అలీకి.. సూర్యకాంతం స్మారక పురస్కారం
ABN, Publish Date - Oct 29 , 2026 | 10:22 AM
తెలుగు సినీ ప్రేక్షకులను తనదైన హాస్యంతో అలరించిన ప్రముఖ నటుడు అలీకి అరుదైన గౌరవం దక్కింది.
తెలుగు సినీ ప్రేక్షకులను తనదైన హాస్యంతో అలరించిన ప్రముఖ నటుడు అలీకి అరుదైన గౌరవం దక్కింది. పాత తరం తెలుగు సినిమాల్లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మహానటి సూర్యకాంతం జయంతిని పురస్కరించుకుని ఆమె పేరిట ఇచ్చే స్మారక పురస్కారాన్ని అలీ అందుకున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన సూర్యకాంతం జయంతి వేడుకల్లో (Suryakantham Jayanti Celebrations) ఈ అవార్డును ప్రదానం చేశారు.
పొన్నాడ వెంకట రామేశ్వరమ్మ, అన్నమయ్య వెల్ఫేర్ సొసైటీ, కిన్నెర ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో బుధవారం బంజారాహిల్స్ ప్రసాద్ ల్యాబ్ (Prasad Labs)లో ప్రముఖ సినీనటి సూర్యకాంతం జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ హాస్య నటుడు అలీ (Ali)కి సూర్యకాంతం స్మారక అవార్డు (Suryakantham Memorial Award) ప్రదానం చేశారు. ఈ వేడుకల్లో సినీనటుడు బాబు మోహన్‌తో పాటు సినీ, సాంస్కృతిక రంగాలకు చెందిన పలువురు పాల్గొన్నారు. కాగా గత సంవత్సరం హాస్యబ్రహ్మ బ్రహ్మానందంకు ఈ అవార్డును అందజేశారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్యనటుడిగా అలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను నవ్వించిన ఆయన, తనదైన కామెడీ టైమింగ్‌తో అభిమానులను సంపాదించుకున్నారు. బాల నటుడిగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించి, ఆ తర్వాత హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో చిత్రాల్లో నటించారు.
ఇక సూర్యకాంతం తెలుగు సినీ చరిత్రలో తనకంటూ చెరగని ముద్ర వేశారు. ముఖ్యంగా అత్త పాత్రల్లో ఆమె పలికించిన హావభావాలు, సంభాషణలు ప్రేక్షకులను ఇప్పటికీ ఎంతగానో అలరిస్తుంటాయి. హాస్యంతో పాటు విబిన్న తరహా పాత్రలతో ఎన్నో తరాల ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రల్లో కనిపించారు. ఈ సందర్భంగా తెలుగు సినీ రంగానికి సూర్యాకాంతం చేసిన సేవలను వక్తలు కొనియాడారు.