రాజమౌళితో సూర్య.. ఈ 'తమిళ ఫ్యాన్స్' దాహం తీరనిది!
ABN, Publish Date - Oct 02 , 2026 | 12:24 PM
ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి నోటి నుండి ఏ మాట వచ్చినా అది విశేషంగా మారిపోతోంది. 'వారణాసి' తరువాత రాజమౌళి నెక్ట్స్ ఏంటి అన్న దానిపై భలేగా డిస్కషన్ మొదలయింది. అందులో భాగంగానే ఓ సెంటమెంట్ కూడా తొంగి చూస్తోంది. ఇంతకూ ఏమిటి సంగతి.?
రాజమౌళి (Rajamouli)దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న 'వారణాసి' సినిమాపై సినీ ఫ్యాన్స్ లో ఎంతటి ఆసక్తి ఉందో కొత్త చెప్పక్కర్లేదు. ఈ సినిమా రాకముందే రాజమౌళి తన తనయుడు కార్తికేయ నిర్మించిన 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' మూవీ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైలో జరిగిన ఈవెంట్ లో తనకు తమిళ స్టార్ సూర్య అంటే ఎంతో అభిమానమని చెప్పారు. 'గజిని' సమయంలో సూర్య (Suriya) ప్రమోషన్స్ చేసిన తీరును చూసి తాను స్ఫూర్తి చెందానని, అందువల్లే 'బాహుబలి' ప్రచారం అంతటా చేయగలిగానని రాజమౌళి గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే రాజమౌళి డైరెక్షన్ లో సూర్య సినిమా వస్తుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు పలు సెంటిమెంట్స్ ను బ్రేక్ చేస్తూ పోయిన రాజమౌళి సినీ ఫ్యాన్స్ డిస్కషన్ లోని మరో సెంటిమెంట్ ను కూడా తుడిచేస్తారని టాక్. అదేమిటంటే ఈ మధ్యకాలంలో పలువురు తెలుగు దర్శకులు తమిళ స్టార్స్ తో సినిమాలు తీసినా, అవి హిట్స్ గా నిలిచాయే తప్ప, బంపర్ హిట్స్ అనిపించుకోలేదు. ఆ సెంటిమెంట్ ను రాజమౌళి బ్రేక్ చేస్తారని తమిళ సినీజనమే ఆశిస్తూ ఉండడం విశేషం.
ఆశ్చర్యపడే పనిలేదు...
సౌత్ సినిమా గోల్డెన్ ఎరాలోనే తెలుగు దర్శకుల చిత్రాల్లో తమిళ స్టార్స్ నటించి గ్రాండ్ సక్సెస్ చూసిన సందర్భాలున్నాయి. ఎల్వీ ప్రసాద్ 'మనోహర' చిత్రంతోనే శివాజీగణేశన్ కు జానపద నాయకునిగా ఫాలోయింగ్ పెరిగింది. అదే తీరున జెమినీగణేశన్ వంటి స్టార్స్ సైతం ప్రసాద్, ప్రకాశరావు వంటి డైరెక్టర్స్ తో సక్సెస్ చూశారు... తరువాతి రోజుల్లో అది అంతగా సాగలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకు తమిళ స్టార్స్ తో తెలుగు దర్శకుల ప్రయాణం ఊపందుకుందని చెప్పొచ్చు. విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన 'వారసుడు' మంచి ఆదరణ పొందింది. అలాగే ధనుష్ తో వెంకీ అట్లూరి రూపొందించిన 'సార్' అలరించింది. సూర్యతో వెంకీ అట్లూరి తీసిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' తమిళంలో కన్నా మిన్నగా తెలుగునాట మురిపించింది. ధనుష్ తో శేఖర్ కమ్ముల మూవీ 'కుబేర' కూడా పరవాలేదనిపించింది. ఈ సినిమాలేవీ బాక్సాఫీస్ వండర్స్ క్రియేట్ చేయలేదు. అయితే ఈ డైరెక్టర్స్ అందరికన్నా ఆల్ ఇండియాలోనే ఎంతో పాపులారిటీ ఉన్న డైరెక్టర్ రాజమౌళి. అలాంటి రాజమౌళి - సూర్యతో సినిమా చేస్తే బాక్సాఫీస్ షేక్ కావలసిందే అంటున్నారు తమిళ సినీజనం. ఇప్పటికే పలు సెంటిమెంట్స్ ను తుడిచేశారు రాజమౌళి. ఇప్పుడు తమిళ స్టార్ తో బ్లాక్ బస్టర్ హిట్ పట్టేసినా ఆశ్చర్య పోనక్కరలేదని అంటున్నారు ఫ్యాన్స్.
ఇంతకూ ఎప్పుడు? ఎలా?
తెలుగులో పలువురు హీరోలను స్టార్స్ గా నిలిపిన రాజమౌళి తొలిసారి మహేశ్ బాబు లాంటి స్టార్ తో 'వారణాసి' సినిమా తీశారు. ఇక తమిళనాట సూర్య ఇప్పటికే స్టార్ హీరోగా సాగుతున్నారు. ఆయనతో రాజమౌళి సినిమా తీస్తే ఎలా ఉంటుందని అప్పుడే కోలీవుడ్ లోనూ డిస్కషన్ మొదలయింది. రాజమౌళి నేరుగా ఓ తమిళ చిత్రం తీయాలని తమిళనాడులోని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. వారి అభిలాష మేరకే 'బాహుబలి-2' చిత్రాన్ని తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కించినట్టు ప్రకటించారు. అయినా అది తెలుగు చిత్రంగానే గుర్తింపు పొందింది. కానీ, ఇప్పుడు సూర్యతో సినిమా తీస్తున్నారనగానే అది ఒరిజినల్ తమిళ్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎటూ రాజమౌళికి ఉన్న క్రేజ్ కారణంగా ఆ సినిమా గ్లోబల్ రేంజ్ లో ప్రాచుర్యం పొందుతుందనీ చెప్పొచ్చు. ఏది ఏమైనా 'వారణాసి' రాకముందే రాజమౌళి తరువాతి సినిమా గురించి ఇంతలా డిస్కస్ చేసుకోవడం విశేషమే. పైగా రాజమౌళి తరువాతి చిత్రం తెలుగు కాదు తమిళ్ అని తెలిసీ తమిళతంబీలు చిందులు వేయడం మరింత ఆసక్తి కలిగిస్తోంది. మరి రాజమౌళి డైరెక్షన్ లో సూర్య నటించే చిత్రం ఎప్పుడు ఎలా పట్టాలెక్కుతుందో చూడాలి.