Suriya: ఈ సినిమా చూస్తున్నంతసేపూ.. మీ ముఖం మీద చిరునవ్వు ఉంటుంది
ABN, Publish Date - Aug 12 , 2026 | 07:07 AM
సూర్య, మమితా బైజు జంటగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఆగస్టు 14న విడుదల కానుంది. ప్రీ రిలీజ్ వేడుకలో సూర్య ‘గజిని’ మ్యాజిక్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది. 20 ఏళ్ల క్రితం ‘గజిని’ (Ghajini) సినిమాలో నన్ను సంజయ్ రామస్వామిగా ఆదరించారు. అదే మ్యాజిక్‌ని తీసుకురావాలని వెంకీ, నాగవంశీ అనుకున్నారు. వెంకీ సిన్సియర్ డైరెక్టర్. 200 శాతం కష్టపడతారు. దర్శకుడు కంటే రచయితగా ఇంకా ఎక్కువగా ఆయనను అభిమానిస్తాను’ అని హీరో సూర్య (Suriya)అన్నారు. ఆయన, మమితా బైజు (Mamitha Baiju) జంటగా వెంకీ అట్లూరి (Venky Atluri) తెరకెక్కించిన చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ (Vishwanath and Sons). శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. సినిమా ఈనెల 14వ తేదీన విడుదలవుతున్న సందర్భంగా మంగళవారం ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు.
కార్యక్రమంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో మదర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమా త్రివిక్రమ్‌కు బాగా నచ్చింది’ అని అన్నారు. వెంకీ అట్లూరి మాట్లాడుతూ ‘ఈ సినిమా నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ఇది సూర్య అభిమానుల కోసం మాత్రమే తీసిన సినిమా కాదు. సూర్య అభిమానుల కుటుంబాల కోసం కూడా తీసిన సినిమా. ఈ సినిమా చూస్తున్నంతసేపూ మీ ముఖం మీద చిరునవ్వు ఉంటుంది’ అని అన్నారు. కార్యక్రమంలో కథానాయిక మమితా బైజు, రాధికా శరత్‌కుమార్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, నిర్మాతలు కె.ఎల్.నారాయణ, వై.రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.