'యుఫోరియా' టీమ్ మ్యాజిక్ చేసింది.. మహేశ్ బాబు ప్రశంసల జల్లు
ABN, Publish Date - Feb 12 , 2026 | 03:31 PM
గుణశేఖర్ తెరకెక్కించిన యుఫోరియా సినిమాను తప్పక చూడాల్సిందిగా మహేశ్ బాబు కోరారు. ఈ సినిమా క్లయిమాక్స్ తనను ఎంతో ఆకట్టుకుందని ఆయన అన్నారు.
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ (Gunasekhar) తెరకెక్కించిన 'యుఫోరియా' (Euphoria) సినిమా ఇటీవల విడుదలైంది. గుణ హ్యాండ్‌మేడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నీలిమా గుణ, యుక్త గుణ ఈ సినిమాను నిర్మించారు. గుణశేఖర్ భార్య రాగిణి సమర్పకురాలిగా వ్యవహరించారు. ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణమైన కథ, కథనాలతో ఈ సినిమాను గుణశేఖర్ రూపొందించారు. తాజాగా ఈ సినిమాను వీక్షించిన మహేశ్ బాబు (Mahesh Babu) సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. 'వారణాసి' షూటింగ్ నుండి బ్రేక్ తీసుకుని మహేశ్ బాబు 'యుఫోరియా' మూవీని చూడటం విశేషమే.
'యుఫోరియా' చిత్రాన్ని వీక్షించిన అనంతరం మహేష్ బాబు సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని తెలియచేస్తూ, ‘గుణశేఖర్ తన కథలను తెరకెక్కించే విధానం ఎప్పుడూ ఓ ప్రత్యేక శైలిలో ఉంటుంది. ఈ మూవీని నేను ఎంతో ఎంజాయ్ చేశాను. మరీ ముఖ్యంగా క్లైమాక్స్‌ను మలిచిన తీరు నాకెంతో నచ్చింది. ఈ మూవీని అందరూ తప్పక చూడండి. గుణశేఖర్, భూమికతో పాటు చిత్రబృందం మొత్తానికి అభినందనలు. గుణశేఖర్ మేకింగ్, ఆయన టెక్నికల్ టీమ్ మ్యాజిక్ చేసింది’ అని తెలిపారు. గుణశేఖర్ దర్శకత్వంలో మహేశ్ బాబు 'ఒక్కడు, అర్జున్, సైనికుడు' చిత్రాలలో నటించారు. ఇందులో 'ఒక్కడు' సినిమాలో మహేశ్ సరసన భూమిక హీరోయిన్‌గా నటించారు. దాదాపు ఇరవై మూడు సంవత్సరాల తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో 'యుఫోరియా'లో భూమిక కీలకపాత్ర పోషించడం విశేషం.
తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం 'యుఫోరియా' చిత్రాన్ని చూసి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. గుణశేఖర్ మేకింగ్ ను మెచ్చుకోవడంతో పాటు ప్రజలందరూ ఈ సినిమా తప్పక చూడాలని ఆయన అన్నారు. 'యుఫోరియా' సినిమాలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత యలమంచలి, అడ్డాల పృధ్వీరాజ్, కల్పలత, సాయి శ్రీనికా రెడ్డి, అశ్రిత వేముగంటి తదితరులు కీలక పాత్రలు పోషించారు.