సందీప్ కిషన్ హీరోగా 'పవర్ పేట'...
ABN, Publish Date - Apr 16 , 2026 | 12:26 PM
రచయిత కృష్ణ చైతన్య దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా 'పవర్ పేట' మూవీ మొదలు కానుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను విజయ్ చిల్లా, శశికిరణ్ దేవిరెడ్డి నిర్మిస్తున్నారు.
యువ కథానాయకుడు నితిన్ (Nitin) ఆ మధ్య 'పవర్ పేట' (Powerpeta) అనే సినిమాను కృష్ణ చైతన్య (Krishna Chaitanya) దర్శకత్వంలో చేయబోతున్నట్టు తెలిపాడు. అలానే ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నట్టూ వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడీ ప్రాజెక్ట్‌లోకి సందీప్ కిషన్ (Sundeep Kishan) వచ్చాడు. సందీప్ కిషన్, కృష్ణ చైతన్య కాంబోలో 'పవర్ పేట' చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు 70 ఎం. ఎం. ఎంటర్ టైన్ మెంట్స్ అధినేతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి తెలిపారు.
అర్థవంతమైన, బలమైన కథలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన హీరో సందీప్ కిషన్ తన సినీ ప్రయాణంలో 16 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, ఈ ప్రత్యేక మైలురాయిని సెలబ్రేట్ చేస్తూ ప్రతిభావంతుడైన రచయిత-దర్శకుడు కృష్ణ చైతన్యతో కలిసి ఒక కొత్త చిత్రాన్ని వారు ప్రకటించారు. బలమైన కథనంతో, రూటెడ్ నేరేటివ్‌తో ఈ కాంబినేషన్ ఆకట్టుకునేలా ఉందని అన్నారు.
‘పవర్ పేట’ అనే టైటిల్‌నే ఆసక్తికరంగా ఉండగా, విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ మరింత ప్రభావం చూపిస్తోంది. డార్క్, గ్రిట్టీ టోన్‌తో, సింబాలిజంతో నిండిన ఈ పోస్టర్‌లో రక్తంతో తడిసిన చెస్‌బోర్డ్ కనిపిస్తుంది! ప్లానింగ్, పవర్, త్యాగానికి ప్రతీకగా నిలిచే ఈ విజువల్‌లో కొన్ని చెస్ పీస్‌లు పగిలిపోయి, కొన్ని కూలిపోయి, మరికొన్ని గెలుపు భావనతో నిలిచినట్టు ఉన్నాయి. ఆ అల్లకల్లోల మధ్య రక్తంతో తడిసిన నలిగిన గులాబీ పువ్వు ప్రేమ, హింస, భావోద్వేగాల మేళవింపును సూచిస్తోంది. లవ్, హానర్, పొలిటిక్స్ అనే ప్రధాన థీమ్స్‌తో ఈ చిత్రం భావోద్వేగాలు, అధికార పోరాటాలు ఢీకొనే తీవ్ర కథను సూచిస్తోంది. ఈ సినిమాను దర్శకుడు కృష్ణ చైతన్య మల్టిపుల్ జానర్స్‌ను మిళితం చేస్తూ గ్రిప్పింగ్ నేరేటివ్‌ను రూపొందించారని, ఈ సినిమాలో సందీప్ కిషన్ పూర్తిగా కొత్త లుక్‌తో, తన కెరీర్‌లోనే అత్యంత తీవ్రత కలిగిన పాత్రలో కనిపించ బోతున్నాడని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి బలమైన సాంకేతిక బృందం కూడా జత కలిసింది. సంగీతాన్ని మణి శర్మ అందిస్తుండగా, సినిమాటోగ్రఫీని ప్రముఖ ఛాయాగ్రాహకుడు మధీ నిర్వహిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టగా, ప్రొడక్షన్ డిజైన్‌ను రామకృష్ణ, మోనిక నిర్వహిస్తున్నారు. సౌండ్ డిజైన్‌ను సచిన్ సుధాకరన్, హరిహరన్ రూపొందిస్తున్నారు.
ఇదిలా ఉంటే... ప్రస్తుతం సందీప్ కిషన్... దళపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకత్వంలో 'సిగ్మా' అనే మూవీ చేస్తున్నాడు. దీనిని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్!