అభ్యంతరకర.. అశ్లీల వీడియోలు! సునయన ఫైర్
ABN, Publish Date - Oct 28 , 2026 | 12:12 PM
తన ముఖాన్ని ఏఐ సాయంతో అసభ్యకర కంటెంట్‌లో మార్ఫింగ్ చేసి వీడియోలు ప్రచారం చేస్తున్నారని నటి సునయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
ఏ.ఐ. సాయంతో హీరోయిన్లు అందరి అసభ్యకర వీడియోలను సృష్టించి సోషల్ మీడియాలో కొందరు పోస్ట్ చేస్తున్నారు. వ్యక్తిగత గౌరవ ప్రతిష్ఠలను మంటగలిపే ఈ విషయమై ఇప్పటికే కొందరు హీరోయిన్లు కోర్టులను ఆశ్రయించారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న వారిని గుర్తించి, శిక్షించాల్సిందిగా కోరుతున్నారు. తాజాగా ఆ జాబితాలోకి ప్రముఖ నటి సునయన సైతం చేరింది. తనను పోలిన కొన్ని అసభ్యకరమైన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని ఆమె తెలిపింది. ఇలాంటి వాటిని సృష్టిస్తున్న వారిపై సునయన సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది.
సునయన ఇన్ స్టాలో పోస్ట్ పెడుతూ, 'నా ముఖాన్ని కృత్రిమ మేధస్సు (AI) ఉపయోగించి అసభ్యకరమైన కంటెంట్‌పై మార్ఫింగ్ చేసి, సోషల్ మీడియా, ఇతర ఆన్‌లైన్ వేదికలపై ఒక ఏఐ వీడియో చక్కర్లు కొట్టడం నా దృష్టికి వచ్చింది. ఈ కంటెంట్ డిజిటల్‌గా సృష్టించబడింది. ఈ నీచమైన, దురుద్దేశపూర్వక చర్య పట్ల నేను తీవ్రంగా కలత చెందాను. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ కంటెంట్‌ను ఏ విధంగానైనా సృష్టించడానికి, ప్రచురించడానికి లేదా వ్యాప్తి చేయడానికి నేను అంగీకరించలేదని, అనుమతించలేదని స్పష్టం చేస్తున్నాను. నేను దీనితో సంబంధం కలిగి ఉన్నానని చెప్పే ఏ సూచన అయినా, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా, అది తప్పు, తప్పుదోవ పట్టించేది, ఎటువంటి ఆధారం లేనిది. ఇది నా గౌరవం, నా గోప్యత, నా గుర్తింపుకు తీవ్ర ఉల్లంఘన. నిజం చెప్పాలంటే... ఇది లైంగిక వేధింపుల కిందకు వస్తుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000, భారతీయ న్యాయ సంహిత, 2023తో సహా, నేరపూరితం. ఇటువంటి ప్రవర్తన ఆమోదయోగ్యం కాదు, సహించరానిది.
ఇందుమూలంగా నేను ప్రతి ఒక్కరికి చేసే హెచ్చరిక ఒక్కటే. ఈ కంటెంట్‌ను, లేదా దానిలోని ఏదైనా భాగాన్ని లేదా దాని మార్పులను సృష్టించడం, అప్‌లోడ్ చేయడం, షేర్ చేయడం, ఫార్వార్డ్ చేయడం లేదా రీపోస్ట్ చేయడం వెంటనే ఆపాలి. ఈ వీడియో ఉన్న ప్రతి ప్లాట్‌ఫారమ్, ఖాతా, గ్రూప్, పరికరం నుండి దానిని తొలగించాలి. ఈ కంటెంట్‌ను సృష్టించడానికి, ప్రచురించడానికి లేదా వ్యాప్తి చేయడానికి బాధ్యులైన ప్రతి వ్యక్తిపై ఎటువంటి తదుపరి నోటీసు లేకుండా క్రిమినల్ మరియు సివిల్ చర్యలను ప్రారంభిస్తాను. దీన్ని మరింత షేర్ చేసే ఎవరైనా కూడా బాధ్యులుగా పరిగణించబడతారు.
ఈ కంటెంట్‌ను షేర్ చేయవద్దని, అది ఎక్కడ కనిపించినా రిపోర్ట్ చేయాలని నా శ్రేయోభిలాషులను కోరుతున్నాను' అని తెలిపారు. సునయనకు నెటిజన్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ లభిస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
Nayanthara: 60 అడుగులతో.. నయనతార భారీ కటౌట్
అబ్సెషన్.. తెలుగు ఏం పాపం చేసింది
ఏం జరుగుతోందిరా.. శ్రీనిధి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్