Sumanth Prabhas: ఈ సినిమా చూసి.. ప్రతి అమ్మాయి ‘ఐ లవ్ యూ డాడీ’ అని చెబుతుంది
ABN, Publish Date - May 08 , 2026 | 06:34 AM
‘గోదారి గట్టుపైన’ సినిమా చూసిన ప్రతి అమ్మాయి తన తండ్రికి ‘ఐ లవ్ యూ డాడీ’ చెబుతుందని హీరో సుమంత్ ప్రభాస్ అన్నారు. తండ్రీ-కూతురు బంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది.
‘గోదారి గట్టుపైన’ (Godari Gattupaina) సినిమా చూశాక మంచి మానవ విలువలున్న చిత్రం చూసి ఎన్ని రోజులు అయిందో అని అనిపించింది. ఈ సినిమా చేయడం చాలా గర్వంగా ఉంది. తండ్రీ - కూతురు బంధం ఇంత బలంగా ఉంటుందా అని అనిపించింది. ఒక తండ్రి తన కూతుర్ని మిస్ అవుతున్న క్షణాలను తలచుకుంటే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ఈ సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి అమ్మాయి ‘ఐ లవ్ యూ డాడీ’ అని తన ఫాదర్‌కి ఫోన్ చేసి చెబుతుంది. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి.’ అని అన్నారు హీరో సుమంత్ ప్రభాస్ (Sumanth Prabhas).
ఆయన కథానాయకుడుగా, నిధి ప్రదీప్ (Nidhi Pradeep) కథానాయికగా సుభాష్ చంద్ర (Subash Chandra) తెరకెక్కించిన చిత్రమిది. రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ సుభాష్ చంద్ర మాట్లాడుతూ ‘ఒక మంచి థియేట్రికల్ అనుభూతిని ఇచ్చే చిత్రమిది. మేమందరం కలిసి ఒక అద్భుతమైన చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ అవుతుందని గర్వంగా చెబుతున్నా’ అని అన్నారు. నిర్మాత అభినవ్, హీరోయిన్ నిధి ప్రదీప్, లైలా పాల్గొన్నారు.