Suman: అదే నాకు భారతరత్న..
ABN, Publish Date - Jul 27 , 2026 | 03:47 PM
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని సీనియర్ నటుడు సుమన్ (Suman) దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని సీనియర్ నటుడు సుమన్ (Suman) దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన సుమన్, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్, టీవీ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APFDC) డైరెక్టర్ పదవికి నందమూరి బాలకృష్ణ తన పేరును సిఫార్సు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. తనకు ఈ గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు నందమూరి బాలకృష్ణతో పాటు ఏపీ ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఇదే క్రమంలో అవార్డులు,పురస్కారాలపై సుమన్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తన సినీ ప్రయాణంలో అవార్డులకు తాను పెద్దగా ప్రాధాన్యత ఇవ్వనని, నటుడిగా ప్రేక్షకుల గుండెల్లో సాధించిన స్థానం, చిత్ర పరిశ్రమ అందించిన గౌరవమే తనకు అత్యంత ముఖ్యమని, అధికారిక అవార్డులపై తనకు ఎలాంటి ఆరాటం లేదా ఆశ లేదని తెలిపారు. 'నాకు అధికారిక అవార్డులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం ఇష్టం ఉండదు. గత 48 ఏళ్ల నా సినీ కెరీర్‌లో దాదాపు 11 భాషల్లో 1000కి పైగా చిత్రాల్లో నటించాను. నటుడిగా ప్రేక్షకులు ఇచ్చే ప్రేమాభిమానాలే నాకు అత్యంత ముఖ్యం. ఎన్నో సినిమాల్లో దేవుడు పాత్రలో కనిపించాను. అన్నమయ్య రిలీజ్ అయ్యాక అప్పటి భారత రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మతో కలిసి సినిమా వీక్షించి, వారితో కలిసి బ్రేక్‌ఫాస్ట్, లంచ్ చేసే భాగ్యం నాకు లభించింది. ఆ అరుదైన క్షణాలతో ప్రపంచంలోని ఏ అవార్డునూ సరిపోల్చలేం. రాష్ట్రపతితో గడిపిన ఆ జ్ఞాపకాన్నే నేను నాకు లభించిన భారతరత్నగా భావిస్తున్నాను.. ఆ క్షణాలే నాకు భారతరత్నతో సమానం'అని ఎంతో భావోద్వేగంగా చెప్పుకొచ్చారు.
ఇక ఏపీఎఫ్ డీసీ డైరెక్టర్‌గా తనవంతు పూర్తి కృషి చేస్తానని ఈ సందర్భంగా సుమన్ హామీ ఇచ్చారు. 1000 సినిమాల మైలురాయిని చేరుకుని ఇప్పటికీ వరుస ప్రాజెక్ట్‌లతో అలరిస్తున్న సుమన్.. ప్రస్తుతం పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ బిజీగా మారారు.సుమన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.