Ram Charan Sukumar Movie: పుష్ప తర్వాత సుకుమార్ మరో ప్రయోగం.. RC17పై ఆసక్తికర చర్చ
ABN, Publish Date - Oct 12 , 2026 | 06:35 AM
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న RC17 సినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ పేరు వినిపిస్తోంది. డీఎస్పీ, శాశ్వత్ సచ్‌దేవ్ పేర్లపై కూడా చర్చ జరుగుతోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కలయికలో రాబోతున్న చిత్రం 'RC17'. 'రంగస్థలం' వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'పుష్ప' సిరీస్ తర్వాత సుకుమార్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో, దీనిపై పాన్-ఇండియా రేంజ్‌లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే, ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి రాకముందే.. దీనికి సంబంధించిన ఓ వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
RC17 అనౌన్స్‌మెంట్ నుంచి ఇప్పటివరకు వినిపిస్తున్న రూమర్లలో అత్యంత ముఖ్యమైనది.. సంగీత దర్శకుడి గురించే. సుకుమార్ సినిమా అంటే కళ్లు మూసుకుని వినిపించే పేరు 'రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్'. మొదటి సినిమా 'ఆర్య' నుంచి 'పుష్ప-2' వరకు ఈ డీఎస్పీ - సుక్కు కాంబినేషన్ తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది. సుకుమార్ ఆలోచనలకు, అభిరుచికి తగ్గట్టుగా ప్రాణం పెట్టే ట్యూన్స్ ఇవ్వడంలో డీఎస్పీ (Devi Sri Prasad) ఎప్పుడూ ముందుంటారు. సుకుమార్ ఏం కోరుకుంటారో డీఎస్పీకి కొట్టినపిండి. డీఎస్పీ ట్యూన్‌లకు సుకుమార్ తెరపై ఇచ్చే విజువల్ ట్రీట్ వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇక 'రంగస్థలం' సినిమాలోని పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆ మూవీ విజయంలో ఎంత కీలక పాత్ర పోషించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి, అలాంటి ఈ సక్సెస్‌ఫుల్ కాంబోకు ఈసారి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం సాయి అభ్యంకర్, జిబ్రాన్, శాశ్వత్ సచ్‌దేవ్ వంటి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ల పేర్లు వినిపించినా.. చివరకు రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ పేరు ప్రముఖంగా తెరపైకి వచ్చింది. ఈ సినిమాకు అనిరుధ్ (Anirudh Ravichander) ను సంగీత దర్శకుడిగా ఖరారు చేసినట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో మరోసారి గట్టిగా వినిపిస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది కానీ, ఒకవేళ ఇది నిజమైతే మాత్రం సుకుమార్ కెరీర్‌లో ఇది చాలా పెద్ద మార్పు అని చెప్పాలి. రామ్ చరణ్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఒక కొత్త తరహా గ్లోబల్ మ్యూజిక్ అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం మ్యూజిక్ ఇండస్ట్రీలో అనిరుధ్ పేరు ఒక బ్రాండ్‌గా మారిపోయింది. ఆయన ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మాస్ బీట్స్ సినిమా రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్తుంటాయి. ఇక సుకుమార్ రా అండ్ ఇంటెన్స్ మేకింగ్‌కు తోడు.. అనిరుధ్ బీజీఎం తోడైతే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయమని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఆ లెక్కన చూస్తే, సుకుమార్ - అనిరుధ్ కాంబినేషన్ మూవీ లవర్స్‌కు ఒక సరికొత్త వైబ్ ఇవ్వడం గ్యారెంటీ.
అయితే, పాన్-ఇండియా మార్కెట్ విస్తరణలో భాగంగా గ్లోబల్ ఆడియన్స్‌కు ఫ్రెష్ సౌండింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే సుకుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారా? లేదంటే, ఇతర కమిట్‌మెంట్స్‌తో డీఎస్పీ బిజీగా ఉండటం వల్ల ఈ మార్పు జరిగిందా? అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి, RC17కి అనిరుధ్ సంగీత దర్శకుడిగా ఉంటారా? లేక ఈ లిస్టులో వినిపిస్తున్న బాలీవుడ్ లేటెస్ట్ సేన్షేషన్ దురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ శాశ్వత్ సచ్‌దేవ్ (Shashwat Sachdev) ను ఏమైనా తెరపైకి తీసుకు వస్తారా? అనేది వేచి చూడాలి.