గతేడాది ఇదే టైమ్‌కి థియేటర్లలో ఫైర్ స్ట్రోమ్: సుజీత్ పోస్ట్ వైరల్
ABN, Publish Date - Sep 25 , 2026 | 07:31 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన మోస్ట్ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఓజీ’. ఈ సినిమా విడుదలై వన్ ఇయర్ పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు సుజీత్ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని తెలియజేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) హీరోగా, దర్శకుడు సుజీత్ (Sujeeth) తెరకెక్కించిన మోస్ట్ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఓజీ’ (They Call Him OG). బాక్సాఫీస్ వద్ద సరికొత్త ప్రకంపనలు సృష్టించి, పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే ప్రత్యేకమైన కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రం విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడు సుజీత్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న సుదీర్ఘ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆనాటి బ్లాక్‌బస్టర్ జ్ఞాపకాలను, థియేటర్లలో వెల్లువెత్తిన ఫ్యాన్స్ ఆనందాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన చేసిన భావోద్వేగ పోస్ట్.. నెటిజన్లను, మెగాభిమానులను ఫిదా చేస్తోంది.
‘‘గతేడాది ఇదే సమయానికి అది ఒక పెను తుఫాను (Firestorm).. నిజంగా అదొక మరచిపోలేని దశ. ప్రతి చోటా కనిపించిన ఆ సంబరం, ఉత్సాహం ఇప్పటికీ నాలో అలాగే తాజా అనుభూతిని కలిగిస్తోంది. మై ఓజీ పవన్ కళ్యాణ్.. ఈ సినిమాతో, నాకు మీరిచ్చిన ప్రతిదానికీ ఎన్ని పదాలు వాడినా సరిపోవు. మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను’’ అంటూ పవన్ కళ్యాణ్‌పై సుజీత్ తనకున్న ప్రేమాభిమానాలను చాటుకున్నారు. అలాగే అడుగడుగునా వెన్నంటే ఉన్న నిర్మాతలు డి.వి.వి. దానయ్య, కళ్యాణ్ దాసరిలకు, తన బీట్స్‌తో ప్రతి క్షణాన్ని రోమాంచితంగా మార్చిన సంగీత దర్శకుడు థమన్, సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దిన ఎడిటర్ నవీన్ నూలి, ప్రతి ఫ్రేమ్‌ను జీవించేలా చేసిన సినిమాటోగ్రాఫర్ రవి కె. చంద్రన్, మనోజ్ పరమహంసలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అద్భుతమైన సెట్స్ తీర్చిదిద్దిన ఏఎస్ ప్రకాష్, రాఘవ్ వీఎఫ్‌ఎక్స్, నీలాంచల్ కాస్ట్యూమ్స్ బృందాలతో పాటు చిత్రంలోని నటీనటులు, తన దర్శకత్వ శాఖకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ ప్రయాణంలో ప్రేక్షకులు అందించిన ప్రేమాభిమానాలతో పాటు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను కూడా స్వీకరిస్తున్నట్లు సుజీత్ స్పష్టం చేశారు. ‘‘మీ ప్రేమనంతా నా వెంట తీసుకుంటూ.. రాబోయే రోజుల్లో స్క్రిప్ట్ రచనపై మరింత దృష్టి పెడుతున్నాను. ప్రతి కథకు ఎంత సమయం, శ్రద్ధ అవసరమో అంత సమయాన్ని వెచ్చించి రూపొందిస్తాను’’ అంటూ తన తదుపరి ప్రాజెక్టులు ‘బ్లడీ రోమియో’ (Bloody Romeo), ‘ఓజీ 2’ (OG2) హ్యాష్‌ట్యాగ్‌లను జోడించారు. పవన్ కళ్యాణ్‌తో భారీగా ప్లాన్ చేస్తున్న సీక్వెల్ ‘ఓజీ 2’, అలాగే నాని కాంబినేషన్‌లో రానున్న ‘బ్లడీ రోమియో’ కోసం సుజీత్ పక్కా స్క్రిప్ట్ పనుల్లో నిమగ్నమైనట్లు తెలపడంతో మెగా అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు. గతేడాది సెప్టెంబర్ 25న ‘ఓజీ’ సినిమా విడుదలైన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
నయనతార ‘హాయ్’ ఓటీటీకి వచ్చేసింది.. మరి ‘టాక్సిక్’ స్ట్రీమింగ్ ఎప్పుడు?
‘లవ్ అండ్ వార్’.. రెట్రో లుక్‌లో సెగలు రేపుతోన్న ఆలియా
ఎమోషనల్ లవ్ స్టోరీ ‘జాన్’ ఫస్ట్ లుక్ విడుదల