సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘SI యుగంధర్’ దర్శకుడితో.. సుధాకర్ కోమాకుల కొత్త ప్రయోగం

ABN, Publish Date - Nov 13 , 2026 | 11:54 AM

హీరో సుధాకర్ కోమాకుల చార్లీ చాప్లిన్ గెటప్‌లో నటిస్తున్న ‘డైరెక్టెడ్ బై చార్లీ చాప్లిన్’ ఫస్ట్ లుక్ విడుదలైంది. రాఘవేంద్ర కటారి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Sudhakar Komakula

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న హీరో సుధాకర్ కోమాకుల (Sudhakar Komakula) మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘డైరెక్టెడ్ బై చార్లీ చాప్లిన్’(Charlie Chaplin).

తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో సుధాకర్ కోమాకుల దిగ్గజ హాస్యనటుడు చార్లీ చాప్లిన్ గెటప్‌లో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీ విఘ్నేశ్వర ప్రొడక్షన్స్, సుఖ మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మనర్తి విఘ్నేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా శ్రీ విఘ్నేశ్వర ప్రొడక్షన్స్‌కు తొలి నిర్మాణం. బన్సారీ ఫిల్మ్స్ సౌజన్యంతో ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది.

ఈ చిత్రంలో సుధాకర్ కోమాకుల ఒక ఛాలెంజింగ్ పాత్రలో కనిపించనున్నారు. సినిమాలోని కొంత భాగంలో ఆయన చార్లీ చాప్లిన్ పాత్రను పోషించబోతున్నారు. ఇందుకోసం చాప్లిన్ హావభావాలు, బాడీ లాంగ్వేజ్, ప్రత్యేకమైన మ్యానరిజమ్స్‌పై ఆయన ప్రత్యేకంగా అధ్యయనం చేసినట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. ఈ పాత్రలో సుధాకర్ ఎలా మెప్పిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

ఇటీవల విడుదలైన ‘SI యుగంధర్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రాఘవేంద్ర కటారి (Raghavendra Katari) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘Life Is a Dramedy’ (జీవితమే ఒక డ్రామెడీ) అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ఈ కథను సిద్ధం చేశారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలు, కన్నీళ్లు, నవ్వులు, అనుకోని మలుపులను కామెడీ, డ్రామా, భావోద్వేగాల మేళవింపుతో చూపించబోతున్నారు.

చార్లీ చాప్లిన్ పేరు వినగానే చాలామందికి ఆయన పండించిన హాస్యం, మరపురాని కామెడీ సన్నివేశాలు గుర్తుకొస్తాయి. అయితే ఆయన పాత్రను నేపథ్యంగా తీసుకున్న ఈ సినిమా కేవలం నవ్వులకే పరిమితం కాబోవడం లేదని తెలుస్తోంది. నవ్వుల వెనుక దాగి ఉన్న బాధలు, కష్టాల్లోనూ జీవితాన్ని ప్రేమించాలనే స్ఫూర్తిని ఈ కథ ద్వారా ఆవిష్కరించబోతున్నారు.

త్వరలోనే పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ప్రారంభించనున్నారు. అనంతరం ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించనున్నారు. వచ్చే ఏడాది మే నెలలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సుధాకర్ కోమాకుల చార్లీ చాప్లిన్‌గా కనిపించనున్న ఈ సినిమా ఎలాంటి అనుభూతిని అందిస్తుందో చూడాలి.

Updated Date - Nov 13 , 2026 | 11:54 AM