కోపం మగాడి లక్షణం.. బీ ఏ మ్యాన్ గ్లింప్స్ అదిరింది
ABN, Publish Date - Nov 25 , 2026 | 03:34 PM
హలో వరల్డ్ వెబ్ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న సుదర్శన్ గోవింద్ హీరోగా నటిస్తున్న బీ ఏ మ్యాన్ సినిమా గ్లింప్స్ విడుదలైంది. మగాడి భావోద్వేగాలు, ఆవేదన, ఆగ్రహాన్ని చూపించిన ఈ గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుదర్శన్ గోవింద్ హీరోగా ద బాయ్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై పవన్ కుమార్ బైకటి (Pavan Kumar Baikati) రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం బీ ఏ మ్యాన్ (Be A Man - Bark One). మెన్స్ ఆర్ డాగ్స్ అనే క్యాప్షన్ తో రెండు రోజుల క్రితం రిలీజ్ చేసిన పోస్టర్ ఈ చిత్రంపై ఒక హైప్ ని క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమాకి బీ ఏ మ్యాన్ అనే టైటిల్ ని ఖరారు చేస్తూ విడుదలైన గ్లింప్స్ డార్క్, ఇంటెన్స్ టోన్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక ఈ చిత్రంలో సుదర్శన్ సరసన ఆరుషి (Aarushi) హీరోయిన్ గా నటిస్తోంది.
గ్లింప్స్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఆడవాళ్ళు తమ భాదని ఏడుస్తూ చెప్తారు. కానీ, మగవాడు ఏడిస్తే మాత్రం ఎందుకురా ఆడదానిలాఏడుస్తావ్ అనేస్తారు. అయితే భాద వచ్చినప్పుడు మగాడు ఏం చేయాలి.. ? ఈ సినిమాలో అలాంటి మగాడి కథనే చూపించినట్లు తెలుస్తోంది. గ్లింప్స్ ఆరంభంలోనే 'నీకు కోపం వస్తే ఏం చేస్తావ్? బాధేస్తే? మరి ఏడుపొస్తే? అన్నిటికీ ఇలా అరిస్తే సొసైటీ నిన్ను ఏమంటది? కోపం మగాడికి ఉండాల్సిన లక్షణం' అనే వాయిస్‌ఓవర్‌తో కథలోని మూడ్‌ను గట్టిగా ఎస్టాబ్లిష్ చేశారు. దానికి తగ్గట్టుగానే సుదర్శన్ పాత్రలోని ఆవేదన, ఆగ్రహం, యాక్షన్, మానసిక సంఘర్షణను చూపించే విజువల్స్ గ్లింప్స్‌కు రా, సీరియస్ ఫీల్‌ను ఇచ్చాయి.
టీజర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ ఈ గ్లింప్స్‌కు ప్రధాన బలంగా నిలిచాయి. చివర్లో బీ ఏ మ్యాన్ టైటిల్‌ను వివిధ భారతీయ భాషల్లో ప్రజెంట్ చేసిన తీరు ఆసక్తికరంగా ఉంది. ఈ రా, ఇంటెన్స్ గ్లింప్స్‌తో సినిమా కథాంశంపై ప్రేక్షకుల్లో కుతూహలం నెలకొంది. ఇది ప్రతి మగాడి కథ అని టీజర్ చూసినవారు చెప్పుకొస్తున్నారు. గ్లింప్స్ లో చూపినట్టే సినిమాలో కూడా ఆ కథను మంచిగా చూపిస్తే హిట్ ఖాయమని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో సుదర్శన్ హీరోగా హిట్ కొడతాడేమో చూడాలి.