Ranabaali: స్టార్‌డమ్, ఫ్యాన్ బేస్ తగ్గలేదు.. అయినా విజయ్‌కు జీవన్మరణ సమస్య

ABN , Publish Date - Oct 04 , 2026 | 08:57 PM

ఒక్క రాత్రిలోనే స్టార్‌డమ్ రావడం సినీ పరిశ్రమలో చాలా అరుదు. కానీ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి, కేవలం మూడేళ్ల వ్యవధిలోనే యావత్ భారతదేశం తనవైపు చూసేలా చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ

Ranabaali

ఒక్క రాత్రిలోనే స్టార్‌డమ్ రావడం సినీ పరిశ్రమలో చాలా అరుదు. కానీ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి, కేవలం మూడేళ్ల వ్యవధిలోనే యావత్ భారతదేశం తనవైపు చూసేలా చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ (vijay devarakonda). 'పెళ్లి చూపులు'తో మొదలై 'అర్జున్ రెడ్డి'తో సెన్సేషన్ క్రియేట్ చేసి, ఆ వెంటనే 'గీతా గోవిందం'తో వంద కోట్ల క్లబ్‌లో చేరిన రౌడీ స్టార్ ప్రయాణం టాలీవుడ్ చరిత్రలోనే ఓ అద్భుతం. అప్పట్లో విజయ్ సినిమా వస్తోందంటే యూత్‌లో ఉండే పిచ్చి మామూలుగా ఉండేది కాదు. కానీ.. అదే స్టార్‌డమ్ ఇప్పుడు అత్యంత క్లిష్టమైన పరీక్షను ఎదుర్కొంటోంది. బాక్సాఫీస్ వద్ద వరుస పరాజయాలు ఆయన మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి.

2018 విజయ్ దేవరకొండ కెరీర్‌కు స్వర్ణయుగం లాంటిది. గీతా గోవిందం బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడం, ఆ వెంటనే రిలీజైన టాక్సీవాలా కూడా సూపర్ హిట్‌గా నిలవడంతో విజయ్ తిరుగులేని హీరోగా మారాడు. అప్పటితో రౌడీ బాయ్ మార్కెట్ ఆకాశాన్ని తాకింది. కానీ అనుకోకుండా అక్కడినుంచే ఆయన ఖాతాలో వైఫల్యాల పరంపర మొదలైంది. చాలా ఆశలు పెట్టుకుని చేసిన డియర్ కామ్రేడ్ కంటెంట్ పరంగా ప్రశంసలు అందుకున్నప్పటికీ, బాక్సాఫీస్ దగ్గర వసూళ్లను రాబట్టలేకపోయింది.

ఇక ఆ తర్వాత వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ డిజాస్టర్‌గా మిగిలి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. తన క్రేజ్‌ను పాన్-ఇండియా స్థాయికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన లైగర్ చిత్రం దేశవ్యాప్తంగా ఎలాంటి బజ్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. ముంబై, ఢిల్లీలలో విజయ్ కోసం ఎగబడిన జనాన్ని చూసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోయాయి. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత రిజల్ట్ మాత్రం తలకిందులైంది. ‘లైగర్’ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

ఆ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో చేసిన రొమాంటిక్ డ్రామా ‘ఖుషి’ కొంతమేర ఊరటనిచ్చినా, అది విజయ్ అసలైన స్థాయి హిట్ అనిపించుకోలేకపోయింది. ఇక ఆ వెంటనే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో వచ్చిన ‘ది ఫ్యామిలీ స్టార్’ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేక ఫ్లాప్‌గా మిగిలింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘కింగ్‌డమ్’ సైతం నిరాశపరచడంతో.. విజయ్ దేవరకొండ మార్కెట్‌పై ఒత్తిడి పతాక స్థాయికి చేరింది. 2018 నాటి 'టాక్సీవాలా' తర్వాత.. అంటే దాదాపు ఎనిమిదేళ్లుగా విజయ్ దేవరకొండ ఖాతాలో సరైన కమర్షియల్ సాలిడ్ హిట్ పడలేదు. ఈ క్రమంలోనే అక్టోబర్ 16న థియేటర్లలోకి రాబోతున్న ‘రణబాలి’ (Ranabaali) చిత్రం విజయ్ కెరీర్‌కు జీవన్మరణ సమస్యగా మారింది.

ఈ సినిమాతో ఆయన బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడన్నది ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్. ఎందుకంటే రౌడీ బాయ్‌లో స్టార్‌డమ్ తగ్గలేదు, ఫ్యాన్ బేస్ తగ్గలేదు. కానీ సరైన కథ, సరైన కమర్షియల్ సక్సెస్ పడక ఆయన మార్కెట్ తీవ్రమైన ఆత్మరక్షణలో పడింది. ఈ 8 ఏళ్ల దాహాన్ని తీర్చేందుకు 'రణబాలి' ఒక్కటే సరైన ఆయుధంగా కనిపిస్తోంది. విజయ్ దేవరకొండ ఎప్పుడూ ఒక మాట అంటుంటాడు.. ఎవడేమనుకున్నా ఐ విల్ కమ్ బ్యాక్ అని. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకోవాల్సిన అసలైన సమయం వచ్చింది. అక్టోబర్ 16న విడుదలవుతున్న 'రణబాలి' గ్రాండ్‌ హిట్‌ కొట్టి, విజయ్ దేవరకొండ పూర్వవైభవాన్ని తిరిగి తెస్తుందా అనేది చూడాలి.

Updated Date - Oct 04 , 2026 | 09:14 PM