సీనియర్ స్టార్స్ నాయికలపైనే సినీ ఫ్యాన్స్‌లో ఆసక్తి!
ABN, Publish Date - Feb 25 , 2026 | 07:30 PM
సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున సరసన నటిస్తున్న హీరోయిన్లపై పలువురిలో ఆసక్తి నెలకొంది. వారెవరో తెలుసుకుందాం!
టాలీవుడ్ సీనియర్ స్టార్స్ సినిమాల్లో ముద్దుగుమ్మలు నటిస్తున్నారు. బాగానే ఉంది- కానీ ఆ సీనియర్స్ కు హీరోయిన్స్ గా నటించేదెవరు? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్!
సీనియర్ స్టార్స్ ఏ మాత్రం తగ్గకుండా యంగ్ హీరోస్ కు పోటీ ఇస్తూనే ఉన్నారు. అంతకు ముందు బాలకృష్ణ (Balakrishna), ఆ తరువాత వెంకటేశ్ (Venkatesh), ఈ యేడాది చిరంజీవి (Chiranjeevi) ఇలా వరుసగా సీనియర్స్ ధాటికి నవతరం స్టార్స్ హీరోస్ తట్టుకోలేకుండా పోయారు. ఒకప్పుడు ఈ స్టార్స్ సరసన ఒక్క సినిమాలో నటించినా చాలు అనే హీరోయిన్స్ ఉండేవారు. కానీ, అందరూ 65 ఏళ్ళకు పైబడినవారే కావడంతో వీరికి తగిన హీరోయిన్స్ ను వెదకడం మేకర్స్ కు సమస్యగా ఉందని టాక్. చిరంజీవితో బాబీ తెరకెక్కించబోయే చిత్రం తండ్రీకూతుళ్ళ సెంటిమెంట్ తో సాగుతుందట. అందులో ఆయన కూతురుగా ప్రీతీ ముకుందన్ నటించనుందని తెలుస్తోంది. చిరంజీవి జోడీగా ప్రియమణిని ఎంచుకున్నట్టు వినికిడి. చిరంజీవితో ప్రియమణి (Priyamani) జంటగా నటించడం ఇదే మొదటిసారి. దాంతో ఫ్యాన్స్ లోనూ ఆసక్తి నెలకొంది.
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని రూపొందించబోయే చిత్రం మార్చి 19న మొదలు కానుంది. మొదట్లో అనుకున్న కథకు నయనతార (Nayanatara) ను నాయికగా ఎంపిక చేశారు. అయితే ఇప్పుడు కథను పూర్తిగా మార్చడంతో నయనతార హీరోయిన్ అవునా కాదా అన్న సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే బాలయ్య సరసన 'సింహా, శ్రీరామరాజ్యం, జై సింహా' చిత్రాలలో నటించి సక్సెస్ చూశారు నయన్. కాబట్టి బాలయ్య కొత్త సినిమాలో కూడా నయన్ నాయికగా ఉంటుందనీ అంటున్నారు.
బాలకృష్ణ, చిరంజీవి తమ కూతుళ్ళ వయసున్న శ్రుతి హాసన్ తోనే జోడీకట్టి అలరించారు. అయితే రాబోయే వారి చిత్రాల్లోని పాత్రల కారణంగానే సీనియర్ హీరోయిన్స్ ను ఎంచుకున్నట్టూ తెలుస్తోంది. అయితే వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ రూపొందిస్తోన్న 'ఆదర్శకుటుంబం'లో 'కేజీఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) నాయికగా నటిస్తున్నారు. ఆ తరువాత వెంకీతో అనిల్ రావిపూడి తెరకెక్కించబోయే సినిమా టైటిల్ 'బామ్మర్ది బాల్ రెడ్డి' అని తెలుస్తోంది. ఇందులో కీర్తి సురేశ్ ను హీరోయిన్ గా అనుకుంటున్నారు. నాగార్జున హీరోగా రా కార్తిక్ డైరెక్షన్ లో రూపొందిస్తోన్న సినిమాలో టబు, అనుష్క, సుస్మిత భట్ నటిస్తున్నారని టాక్. ఇక యంగ్ హీరోస్ లో రామ్ చరణ్ - సుకుమార్ సినిమాలో కృతీసనన్ నాయిక అని సమాచారం. నాని 'బ్లడీ రోమియో'లో తృప్తి డిమ్రీ పేరు వినిపిస్తోంది. శర్వానంద్ తదుపరి చిత్రంలో ఆషికా రంగనాథ్ నాయిక అని తెలుస్తోంది. యంగ్ హీరోస్ సినిమాల కంటే సీనియర్ స్టార్స్ సరసన ఎవరు నాయిక అన్నదానిపైనే సినీ ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తూ ఉండడం విశేషం!