Varanasi: ఐమ్యాక్స్.. కొన్ని సన్నివేశాల్లోనే! ఆసక్తికర విషయాలు ..వెల్లడించిన రాజమౌళి
ABN, Publish Date - Feb 08 , 2026 | 04:28 PM
‘వారణాసి’ చిత్రం గురించి హాలీవుడ్ మీడియాకు రాజమౌళి ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారా ఇప్పటికే పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి.
మహేశ్ బాబు (Mahesh Babu) ‘వారణాసి’ (Varanasi) చిత్రం గురించి హాలీవుడ్ మీడియాకు రాజమౌళి (SS Rajamouli) ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారా ఇప్పటికే పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాను ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో తీసుకురావడం గురించి ఆయన కీలక విషయాలు వెల్లడించారు. ‘వారణాసి’ పుణ్య క్షేత్రంతో భారతీయులందరికీ ఎప్పటికీ ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. తెరపై అద్భుతమైన అనుభూతిని అందివ్వడం కోసమే ఈ చిత్రాన్ని ఆ ప్రాంతం నేపథ్యంలోనే తెరకెక్కిస్తున్నాను.
ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు ఏ ఫార్మాట్‌లో చూపిద్దాం అనే విషయంలో చాలా కసరత్తు చేశాం. ఎందుకంటే ‘వారణాసి’ సినిమా మొత్తం ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో ఉండదు. కీలక సన్నివేశాలు మాత్రమే ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో ఉంటాయి. అలా కొన్ని సన్నివేశాలు తప్ప మిగతా సినిమా మొత్తం మనకున్న సినిమా స్కోప్ థియేటర్ల ఫార్మాట్‌లోనే ఉంటుంది. ఈ క్రమంలోనే ‘సినిమా స్కోప్ తెరల కోసం చిత్రీకరించి అసలు సిసలు ఐమ్యాక్స్ ఫార్మాట్‌లోకి మారుద్దామా? లేక మొత్తం ఐమ్యాక్స్‌లోనే తీసి ఆ తర్వాత సినిమా స్కోప్ తెరల కోసం మారుద్దామా’ అనే చర్చలు జరిగేవి.
‘రెండు రకాల షాట్లను కలిపి చూపిద్దాం’ అని ఆ చర్చల్లో వచ్చిన సలహా నాకు నచ్చలేదు. ‘ప్రత్యేక సన్నివేశాలు వచ్చే సమయానికి ట్రూ ఐమ్యాక్స్‌లో ఉన్నది ఉన్నట్లు చూపిద్దాం’ అని వివరించాను. ఇలా చేయడం ఎంత సవాల్‌తో కూడుకున్నదో ప్రేక్షకులకు తెలియజేయాలి. స్క్రీన్ రేషియోలో మార్పులు చేయడం ద్వారా ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని ఇవ్వచ్చని నేను నమ్ముతాను. దాన్ని వారికి ఇవ్వడానికే ఈ కష్టమంతా’ అని పేర్కొన్నారు. మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న ‘వారణాసి’ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఉగాది సందర్భంగా విడుదలవుతోంది.