‘రామభద్రుడు’గా వస్తున్న డైనమిక్ హీరో శ్రీరామ్
ABN, Publish Date - Oct 15 , 2026 | 03:07 PM
డైనమిక్ హీరో శ్రీరామ్ నటిస్తున్న 13వ చిత్రం ‘రామభద్రుడు’ ఘనంగా ప్రారంభమైంది. మహేష్ భాగ్యరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఫిబ్రవరిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
‘యంగ్ అండ్ డైనమిక్’, ‘మా రాముడు అందరివాడు’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీరామ్ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రామభద్రుడు’ (Ramabhadrudu) గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి మహేష్ భాగ్యరాజ్ దర్శకత్వం వహిస్తుండగా, దుర్గా వరప్రసాద్ నిర్మిస్తున్నారు. సుందర్ రాజ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్రీరామ్ కెరీర్లో ఇది 13వ సినిమా కావడం విశేషం.
తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, గోల్డ్ రెడ్డి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమా ప్రారంభోత్సవానికి 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి, శ్రేయ రియల్ ఎస్టేట్ అధినేత బాబు అగస్టీస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా హీరోగా తనకంటూ గుర్తింపు సంపాదించుకుంటున్న శ్రీరామ్ను వారు అభినందించారు. ‘రామభద్రుడు’ మంచి విజయాన్ని అందుకుని ఆయనకు మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా హీరో శ్రీరామ్ మాట్లాడుతూ.. తనను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రేక్షకుల ప్రేమాభిమానాల వల్లే ‘రామభద్రుడు’ సినిమాను ప్రారంభించగలిగామని పేర్కొన్నారు. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలతో ఆసక్తికరమైన కథను సిద్ధం చేశామని చెప్పారు. అనుభవజ్ఞులైన నటీనటులు, ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్ట్లో భాగమయ్యారని వెల్లడించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఫిబ్రవరిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని శ్రీరామ్ తెలిపారు.