‘శ్రీ శ్రీ’ నుంచి ‘బొమ్మ బొమ్మ’ సాంగొచ్చింది.. రిఫ్రెషింగ్ రొమాంటిక్ రైడ్
ABN, Publish Date - Jul 27 , 2026 | 08:40 PM
వెర్సటైల్ హీరో దుల్కర్ సల్మాన్, బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నూతన దర్శకుడు రవి నెలకుదిటి దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘శ్రీ శ్రీ’.
వెర్సటైల్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), బుట్ట బొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) హీరోహీరోయిన్లుగా నూతన దర్శకుడు రవి నెలకుదిటి దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘శ్రీ శ్రీ’ (Sri Sri). ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్, నిర్మాణ సంస్థకు 10వ చిత్రం. ఇషాన్ సక్సేనా ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే తొలిసారి జంటగా నటిస్తున్న ఈ సినిమా ప్రేమ, వినోదం, భావోద్వేగాలతో కూడిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా పాన్ ఇండియా స్థాయిలో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన వర్కింగ్ స్టిల్స్, ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి స్పందన అందుకోగా, తాజాగా ఈ సినిమా మ్యూజికల్ జర్నీని ప్రారంభిస్తూ తొలి పాట ‘బొమ్మ బొమ్మ’ (Bomma Bomma Song From Sri Sri)ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ పాటను గమనిస్తే.. రైల్వే స్టేషన్‌లో బెంచ్‌పై కూర్చున్న దుల్కర్, ప్లాట్‌ఫామ్‌పైకి పూజా హెగ్డే అడుగుపెట్టిన క్షణమే ఆమె అందానికి మెస్మరైజ్ అవుతాడు. అక్కడి నుంచి ఇద్దరి అందమైన ప్రేమ ప్రయాణాన్ని, ఆనంద క్షణాలను, వారితో పాటు ఉండే ఓ బృందాన్ని ఈ పాటలో ఎంతో అందంగా చూపించారు. సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ మరోసారి మనసును హత్తుకునే మధురమైన మెలోడీతో తన మార్క్ ప్రదర్శించారు. ఆహ్లాదకరమైన ట్యూన్, అందమైన ఆర్కెస్ట్రేషన్‌తో ఈ పాట ఆకట్టుకుంటుంది. అనంత శ్రీరామ్ తన సాహిత్యంతో ప్రేమలో మునిగిపోయిన ఓ యువకుడి భావాలను కవితాత్మకంగా ఆవిష్కరించడమే కాకుండా.. హీరోయిన్ అందం, ఆమె ప్రత్యేకతను ఎంతో అద్భుతంగా వర్ణించారు. కపిల్ కపిలన్ తన మెలోడీ వోకల్‌తో పాటకు మరింత అందం తీసుకురాగా, రామ్ మాస్టర్ అందించిన కొరియోగ్రఫీ విజువల్‌గా పాటను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది.
ఈ పాటలో దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డేల మధ్య కనిపించే నేచురల్ కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా నిలిచిందని చెప్పుకోవాలి. ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ ప్రతి ఫ్రేమ్‌ను చూడముచ్చటగా మార్చాయి. అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించిన విజువల్స్.. ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీకి రొమాంటిక్ ఫీల్‌ను కలిగిస్తున్నాయి. మొత్తంగా అయితే.. జీవీ ప్రకాశ్ నుంచి మరో చార్ట్‌బస్టర్ సాంగ్ వచ్చిందని చెప్పుకోవచ్చు.