Sri Chidambaram Garu: ఫిబ్రవరి 6న రాబోతున్న 'శ్రీ చిదంబరం గారు'
ABN, Publish Date - Jan 23 , 2026 | 05:08 PM
వంశీ తుమ్మల, సంధ్య వశిష్ఠ జంటగా నటించిన 'శ్రీ చిదంబరం గారు' సినిమా ఫిబ్రవరి 6న విడుదల కాబోతోంది. ఇందులోని ఓ పాటను కీరవాణి పాడటం విశేషం.
చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మాతలుగా వినయ్ రత్నం తెరకెక్కించిన చిత్రం ‘శ్రీ చిదంబరం గారు’. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత వంశీ నందిపాటి థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. వంశీ తుమ్మల (Vamsi Tummala), సంధ్యా వశిష్ట (Sandhya Vashisht) జంటగా నటించిన ఈ చిత్రం నుంచి ఇటీవల టీజర్‌ను విడుదల చేశారు. అలానే ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్. ఎమ్. కీరవాణి (MM Keeravani) ఆలపించిన 'వెళ్లేదారిలో' పాట కూడా ఇటీవల రిలీజ్ చేశారు. చందు రవి సంగీతం అందించిన ఈ పాటకు చంద్రశేఖర్ సాహిత్యాన్ని సమాకూర్చారు. ఈ పాట ట్యూన్‌తో పాటు లిరిక్స్ అందరి హృదయాలను హత్తుకుంటున్నాయి. ముఖ్యంగా కీరవాణి ఈ పాటకు తన గాత్రంతో ప్రాణం పోశారు. ఈ పాట సక్సెస్ సెలబ్రేషన్స్ శుక్రవారం హైదరాబాద్ లో జరిగాయి. ఈ సందర్భంగా మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. ఫిబ్రవరి 6న దీనిని జనం ముందుకు తీసుకెళుతున్నట్టు చెప్పారు.
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్. పి. పట్నాయక్ (R P Patnayak) మాట్లాడుతూ 'యంగ్ టీమ్ చేసిన బ్యూటిఫుల్ సినిమా ఇది. ఈ రోజు వేదిక మీద ఇంత మంది మ్యూజిక్ డైరెక్టర్లును చూస్తుంటే ముచ్చటగా ఉంది. ఈ రోజు చందు రవి... కీరవాణి లాంటి గొప్ప సంగీత దర్శకుడిని ఒప్పించి పాడించడం ఎంతో ఆనందంగా ఉంది. చాలా మెచ్యూర్డ్ అండ్ ఇన్‌స్పిరేషన్ స్టోరీతో రాబోతున్న సినిమా ఇది. చాలా మంది యువత చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌కే సూసైడ్ వరకు వెళ్లిపోతున్నారు. అలాంటి వారందరికి ఎంతో ఇన్‌స్పయిర్ అయ్యే కథ ఇది' అన్నారు. నిర్మాత గోపాలకృష్ఱ మాట్లాడుతూ 'కొత్తవాళ్లను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో నేను చేసిన ఐదో సినిమా ఇది. ప్రొడక్షన్ విషయంలో రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాను' అని అన్నారు.
హీరోయిన్ సంధ్య వశిష్ట మాట్లాడుతూ 'ఇందులో లీల అనే పాత్ర చేశాను. ఈ ఫీల్‌గుడ్ స్టోరీలో మలయాళం సినిమా వైబ్ ఉంటుంది. చందు రవి పాటలతో ఈ సినిమాకు లైఫ్ ఇచ్చారు. ఈ సినిమా ఆర్టిస్టులుగా మాకు మంచి పేరు తెస్తుంది' అని అన్నారు. హీరో వంశీ తుమ్మల మాట్లాడుతూ 'ఈ సినిమాలో నేను మెల్లకన్ను పెట్టి నటించడానికి ఆర్.పి. పట్నాయక్ గారి నటనే ఇన్ స్పిరేషన్. వంశీ నందిపాటి గారు ఈ యేడాది కథ నచ్చి విడుదల చేస్తున్న తొలి చిత్రం మాదే' అని అన్నారు. వినయ్ రత్నం మాట్లాడుతూ 'ఈ సినిమా కార్యరూపం దాల్చడానికి ప్రధాన కారణం మా నిర్మాత గోపాల కృష్ణ గారు. ఈ సినిమాలో ప్రతి సాంగ్ అందరి హృదయాలకు హత్తుకుంటుంది. సినిమాను ఫైనల్ మిక్సింగ్‌లో చూసుకుని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాను. చాలా కష్టపడి ఈ సినిమా తీశాం. అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను' అని అన్నారు.