సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

శ్రీలీల: ఆ ఆనందం ముందు కోట్ల రెమ్యునరేషన్‌ నథింగ్

ABN, Publish Date - Mar 15 , 2026 | 03:14 PM

అద్భుతమైన డ్యాన్స్‌లతో థియేటర్లను హోరెత్తించే ‘ధమాకా’ బ్యూటీ శ్రీలీలలో ముగ్గురు చిన్నారుల బాధ్యతను భుజాన వేసుకున్న ఒక సామాజిక యోధురాలు దాగి ఉంది.

అద్భుతమైన డ్యాన్స్‌లతో థియేటర్లను హోరెత్తించే ‘ధమాకా’ బ్యూటీ శ్రీలీలలో ముగ్గురు చిన్నారుల బాధ్యతను భుజాన వేసుకున్న ఒక సామాజిక యోధురాలు దాగి ఉంది. కేవలం 21 ఏళ్ల ప్రాయంలోనే మాతృత్వపు లోతును అర్థం చేసుకున్న ఆమె ప్రయాణం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌. ఒకపక్క భారీ చిత్రాల షూటింగ్‌లు, మరోపక్క సామాజిక బాధ్యతను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతోంది శ్రీలీల.

‘చాలామంది నన్ను అడుగుతుంటారు. షూటింగ్స్‌, డ్యాన్స్‌ ప్రాక్టీస్‌, బిజీ లైఫ్‌.. మీకు బోర్‌ కొట్టదా అని. నిజం చెప్పాలంటే కెమెరా ముందు నేను చేసేది నా వృత్తి. కానీ కెమెరా వెనుక నాకు దొరికే అసలైన ప్రశాంతత ఆ ముగ్గురు పిల్లల దగ్గరే ఉంటుంది. నా వయసు ఇప్పుడు 24 ఏళ్లు. కానీ నేను 21 ఏళ్ల ప్రాయంలోనే దివ్యాంగులైన ఇద్దరు పిల్లలను (గురు, శోభిత) దత్తత తీసుకున్నాను. ఇటీవల మరో చిన్నారిని కూడా తెచ్చుకున్నాను. ఇది వినడానికి కొందరికి ఆశ్చర్యంగా ఉండొచ్చు. కానీ నా దృష్టిలో ఇది ఒక సహజమైన ప్రక్రియ. వారు నాతో ఒకే ఇంట్లో ఉండకపోవచ్చు. కానీ వారి తిండి, బట్టలు, చదువు, ఆరోగ్యం.. ప్రతి ఒక్కటీ నా పర్యవేక్షణలోనే జరుగుతాయి. నాకు సమయం దొరికినప్పుడల్లా వారి దగ్గరికి వెళ్తాను. ఆ పిల్లల కళ్లలో కనిపించే ఆనందం ముందు కోట్లాది రూపాయల రెమ్యునరేషన్‌ కూడా సరితూగదు. నేను వారిని దత్తత తీసుకున్నానని ఎక్కడా గొప్పలు చెప్పుకోలేదు. ఎందుకంటే, అది నా ఆత్మ సంతృప్తి కోసం చేసిన పని. నిజానికి వారు నన్ను ‘అమ్మ’ అని పిలవాలని నేను కోరుకోను. వాళ్లకి నేను ఒక ఆసరా ఇచ్చే అక్కలా ఉంటే చాలు.

డిజిటల్‌ దాడులు.. డీప్‌ఫేక్‌ కష్టాలు

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు మనం విమర్శలకు సిద్ధపడాలి. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వికృత చేష్టలు కూడా పెరిగిపోతున్నాయి. ఇటీవల నా ఫొటోలను, వీడియోలను డీప్‌ఫేక్‌ ద్వారా మార్ఫింగ్‌ చేయడం చూసి కలత చెందాను. ఒక నటిగా నేను ఎంత ధైర్యంగా ఉన్నా, ఒక ఆడపిల్లగా ఆ దృశ్యాలు నన్ను ఎంతగానో బాధించాయి. టెక్నాలజీని మనం పురోగతికి వాడాలి కానీ, ఒక వ్యక్తి గౌరవాన్ని బజారున పడేయడానికి కాదు. ఇలాంటి దాడులు జరిగినప్పుడు మౌనంగా ఉండకూడదని నేను నిర్ణయించుకున్నాను. సామాన్య ప్రజలు కూడా విచక్షణతో ఆలోచించి బాధ్యతగా ఉండాలి.


బాలీవుడ్‌ ఎంట్రీ..

వచ్చేవారం నాకు చాలా ప్రత్యేకం. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పవన్‌ కల్యాణ్‌ గారితో కలిసి నటించడం ఒక కల నిజమైనట్టు అనిపించింది. ఈ సినిమాలో నా పాత్ర, ఆ ఎనర్జీ ఫ్యాన్స్‌కు తప్పకుండా నచ్చుతాయి. ఇక, బాలీవుడ్‌ ఎంట్రీ గురించి వస్తున్న వార్తలు నాకూ సంతోషాన్ని ఇస్తున్నాయి. హిందీ ఇండస్ట్రీ నుంచి కొన్ని మంచి ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. వరుణ్‌ ధావన్‌ లేదా ఇబ్రహీం అలీఖాన్‌.. ఇలా ఎవరితో చేసినా అది ఒక కొత్త లెర్నింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ అవుతుంది. అయితే నాకు కథ, నా పాత్ర ప్రాధాన్యం ముఖ్యం. బాలీవుడ్‌  మేకింగ్ స్టైల్‌, అక్కడి కల్చర్‌ నేర్చుకోవడం బాగుంది. అయితే నా పునాది ఎప్పుడూ సౌత్‌ సినిమాలే. ఇక్కడి ప్రేక్షకుల ప్రేమే నన్ను అక్కడి దాకా తీసుకెళ్లింది.

గ్లామర్‌ ప్రయాణం.. కొత్త లక్ష్యాలు

ప్రస్తుతం నేను చాలా పరిణితి చెందిన కథలను ఎంచుకుంటున్నాను. నా దృష్టిలో కెరీర్‌ అంటే నంబర్‌ వన్‌ స్థానం కోసం పరిగెత్తడం కాదు. మనం చేసే పని పది కాలాల పాటు గుర్తుండిపోవాలి. వైద్యురాలిగా సేవ చేయడం ఎంత ముఖ్యమో నాకు తెలుసు. త్వరలో డాక్టర్‌ శ్రీలీలగా కూడా ప్రజలకు సేవలందిస్తా.

ప్రేక్షకులకు రుణపడి ఉంటాను

నన్ను ఇన్నేళ్లుగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు రుణపడి ఉంటాను. నా డ్యాన్సులను మీరు ఎంజాయ్‌ చేస్తున్నందుకు సంతోషం. కానీ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి.  స్క్రీన్  మీద కనిపించే గ్లామర్‌ ఒక మాయా ప్రపంచం. దానివెనుక కష్టం, కన్నీళ్లు, బాధ్యతలు కూడా ఉంటాయి. నన్ను ఒక నటిగానే కాకుండా మీ ఇంట్లో మనిషిగా చూస్తున్నందుకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ సాటి మనిషికి సాయం చేసే గుణాన్ని అలవర్చుకోవాలి'

.

Updated Date - Mar 15 , 2026 | 03:33 PM