షావుకారు జానకి జ్ఞాపకాల్లో సినీ పరిశ్రమ

ABN , Publish Date - Aug 22 , 2026 | 08:59 AM

దిగ్గజ నటి షావుకారు జానకి మృతి పట్ల యావత్‌ సినీ పరిశ్రమ విచారంలో మునిగిపోయింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తీవ్ర సంతాపం ప్రకటించారు.

Sowcar Janaki

దిగ్గజ నటి షావుకారు జానకి (Sowcar Janaki) మృతి పట్ల యావత్‌ సినీ పరిశ్రమ విచారంలో మునిగిపోయింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తీవ్ర సంతాపం ప్రకటించారు. షావుకారు జానకి పార్థివదేహాన్ని తమిళనాడు, తేనాంపేటలో ఉన్న ఆమె స్వగృహంలో శనివారం మధ్యాహ్నం వరకు అభిమానుల సందర్శనార్థం వుంచి, సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నామని షావుకారు జానకి మనవరాలు, నటి వైష్ణవి భర్త అరవింద్‌ శుక్రవారం మీడియాకు వెల్లడించారు.

చెరగని ముద్ర: సీఎం విజయ్‌

తనదైన ప్రత్యేక నటనతో తరతరాలుగా అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన సీనియర్‌ నటి షావుకారు జానకి మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి, దుఃఖానికి గురయ్యానని ముఖ్యమంత్రి విజయ్‌ తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘సినీ పరిశ్రమలో 70 యేళ్ళకుపైగా లెక్కలేనన్ని పాత్రలకు జీవం పోసిన ఆమె కళాత్మక ప్రస్థానం కూడా ప్రశంసనీయం. తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ వంటి భాషా చిత్రాల్లో నటించి పద్మశ్రీ, కలైమామణి, నంది పురస్కారాలతోపాటు అనేకఅవార్డులు అందుకున్న షావుకారు జానకి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు. జానకి మరణంతో దుఃఖసాగరంలో ఉన్న ఆమె కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, చిత్రపరిశ్రమకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి. ఆమె ఆత్మకు భగవంతుని పాదాల చెంత శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’’ అని సీఎం విజయ్‌ విడుదల చేసిన సంతాప సందేశంలో పేర్కొన్నారు.


ఒక శకం ముగిసింది: టీఎఫ్ఏపీఏ

షావుకారు జానకి మృతిపట్ల తమిళ చిత్ర యాక్టివ్‌ నిర్మాతల సంఘం (టీఎఫ్ఏపీఏ) కార్యవర్గం, సభ్యులు తమ ప్రగాఢ సంతాపం, సానుభూతి వ్యక్తం చేస్తూ ఒక ప్రకటనను విడుదల చేసింది. భారతీయ చిత్రపరిశ్రమలోని గొప్ప, అత్యంత గౌరవనీయ నటీమణుల్లో ఒకరైన షావుకారు జానకి మృతి తీవ్ర విచారాన్ని కలిగించింది. ఏడు దశాబ్దాలకు పైగా తన అపారమైన నటనతో తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం చిత్రపరిశ్రమలను సుసంపన్నం చేశారు. నిజమైన కళకు వయసుతోగానీ, హద్దులతోగానీ ఎలాంటి సంబంధం లేదని నిరూపించిన గొప్పనటి. ‘ఇరు కోడుగల్‌’, ‘ఎదిర్‌నీచ్చల్‌’,‘పుదియ పరవై’ వంటి ఎన్నో చిరస్మరణీయమైన చిత్రాల్లో ఆమె పోషించిన పాత్రలు అభిమానుల ఙ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. భారతీయ సినిమాకు ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా 2022లో ఆమెకు పద్మశ్రీ పురస్కారం లభించింది. తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక ప్రభుత్వాల నుంచి అనేక అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఆమె మరణం ఎప్పటికీ పూడ్చలేని శూన్యాన్ని మిగిల్చింది. షావుకారు జానకి వంటి కళాకారులు ఎప్పటికీ కనుమరుగవరు. తమ మరపురాని కృతుల ద్వారా, రాబోయే తరాలకు స్ఫూర్తినిచ్చే కళాత్మక సేవల ద్వారా శాశ్వతంగా జీవిస్తారు. ఆమె కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, తోటి చిత్ర నిర్మాతలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అభిమానులకు మా ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలుపుతున్నాం. భారతీయ చిత్రపరిశ్రమలో షావుకారు జానకి కీర్తి, కళావారసత్వం శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు.


భారతీయ చిత్రపరిశ్రమకు తీరని లోటు

షావుకారు జానకి మృతి భారతీయ చిత్రపరిశ్రమకే తీరని లోటు. ఆమెతో నాకు పాతికేళ్ళ అనుబంధం. ఒక సందర్భంలో ఎన్‌.టి.రామారావుతో ఆమెకున్న అనుబంధంపై ఇంటర్వ్యూ కావాలని కోరగా, ఆమె స్వయంగా ఇంటికి పిలిచి గంటన్నరపాటు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆమె మృతిపట్ల దుఃఖసాగరంలో మునిగిపోయిన ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటున్నాను- సీనియర్‌ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్‌

నటనలో ఆమెకు సాటి ఆమే

‘భాగ్యలక్ష్మి’ చిత్రంలో ‘మాలై పొలుదిన్‌ మయక్కత్తిలే నాన్‌’ అనే పాటను కన్నదాసన్‌ రాయగా, విశ్వనాథన్‌ - రామ్మూర్తి సంగీతంలో సుశీల ఆలపించారు. ఆ పాటలో షావుకారు జానకి నటించిన తీరు అద్భుతం. ఆమె అభినయం మరువలేనిది, మరుపురానిది. 1950లో షావుకారు జానకి చిత్రంలో చలనచిత్ర రంగంలోకి అడుగుపెట్టి 2023లో ‘అన్నీ మంచి శకునములే’ చిత్రం వరకు నటించి, చలనచిత్ర రంగంలో మకుటం లేని మహారాణిలా చెలామణి అయ్యారు. జానకి మృతి తెలుగు చలన చిత్రపరిశ్రమే కాకుండా, యావత్‌ తెలుగు ప్రజానీకానికి తీరనిలోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడి ప్రార్థిస్తున్నాను- జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య

ఇవి కూడా చదవండి:

అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ మెగాస్టారే

బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా నటి రాధిక.. ఇదేందయ్యా ఇది

మెగా బ్లాస్ట్‌కు సిద్ధమవ్వండి.. డైరెక్టర్ బాబీ పోస్ట్ వైరల్

Updated Date - Aug 22 , 2026 | 08:59 AM