సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఏమిరా.. బాలీవుడ్‌! ఇక్క‌డ బ్లాక్ బ‌స్ట‌ర్స్‌.. అక్క‌డ అల్ట్రా డిజాస్ట‌ర్స్‌

ABN, Publish Date - Oct 04 , 2026 | 08:43 PM

సౌత్ మూవీస్‌లో ముఖ్యంగా తెలుగు, తమిళ టాప్ హీరోస్ సినిమాలు ప్రస్తుతం పాన్ ఇండియా పిక్చర్స్ గా సందడి చేస్తున్నాయి. దాంతో నార్త్ సినీ ఫ్యాన్స్ దక్షిణాది చిత్రాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

south Vs Bollywood

సౌత్ మూవీస్‌లో ముఖ్యంగా తెలుగు, తమిళ టాప్ హీరోస్ సినిమాలు ప్రస్తుతం పాన్ ఇండియా పిక్చర్స్ గా సందడి చేస్తున్నాయి. దాంతో నార్త్ సినీ ఫ్యాన్స్ దక్షిణాది చిత్రాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరిని సంతృప్తి పరచడానికి బాలీవుడ్ బాబులు కొందరు దక్షిణాదిలో అఖండ విజయం సాధించిన చిత్రాలను హిందీలో రీమేక్ చేస్తున్నారు. అయితే సౌత్ నుండి నార్త్‌లో రీమేక్ అయిన సినిమాల్లో అధికశాతం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి.

తాజాగా 'ప్రేమ్ కీటాణు' అదే తీరున సాగింది. మళయాళ చిత్రం ప్రేమలు (Premalu) కేరళలో అనూహ్య విజయం సాధించింది. తెలుగు, తమిళ భాషల్లో డబ్ అయి కూడా అలరించింది. ఈ చిత్రాన్ని ప్రేమ్ కీటాణు (Prem Kitanu) గా హిందీలో రీమేక్ చేశారు. మొదటిరోజు 1800 ఆటల ద్వారా కేవలం 50 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలచింది. సౌత్ మూవీస్‌ను హిందీలో రీమేక్ చేస్తే పెద్దగా అలరించడం లేదని రీసెంట్ టైమ్ మూవీస్ చెబుతున్నాయి. తెలుగులో ఘనవిజయం సాధించిన 'అల వైకుంఠపురములో' చిత్రాన్ని హిందీలో షెహజాదా (Shehzada) గా రీమేక్ చేశారు. కార్తిక్ ఆర్యన్, కృతి సనన్ జోడీగా నటించిన ఈ చిత్రం ఏ మాత్రం అలరించలేక పోయింది.

అలరించిన తెలుగు టు హిందీ..

తెలుగులో ప్రభాస్ హీరోగా రాజమౌళి డైరెక్షన్‌లో రూపొందిన ఛత్రపతి (Chatrapathi) అఖండ విజయం సాధించింది. ఈ చిత్రాన్ని చాలా ఏళ్ళ తరువాత తెలుగు హీరో సాయి శ్రీనివాస్ హీరోగా తెలుగు దర్శకుడు వి. వి. వినాయక్ డైరెక్షన్‌లో హిందీలో 'ఛత్రపతి' టైటిల్ తోనే రీమేక్ చేశారు. ఈ సినిమా డిజాస్టర్‌గా నిలచింది. నాని హీరోగా రూపొంది అలరించిన జెర్సీ (Jersey) చిత్రాన్ని అదే పేరుతో తెలుగు నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, నాగవంశీ హిందీలో పునర్నిర్మించారు. షాహిద్ కపూర్ నటించిన ఈ సినిమా ఏ మాత్రం మురిపించలేకపోయింది. నాని మరో సినిమా 'మిడిల్ క్లాస్ అబ్బాయి' హిందీలో నికమ్మ (Nikamma) గా రూపొంది బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. నాని నిర్మించిన 'హిట్-ద ఫస్ట్ కేస్' మూవీ హిందీలో రాజ్ కుమార్ రావ్ హీరోగా అదే టైటిల్‌తో తెరకెక్కి బాల్చీ తన్నేసింది. ఇలా తెలుగు చిత్రాల రీమేక్స్ ఏ లాంటి ప్రభావం చూపించలేకపోయాయి.

అలరించినవి అల్పం.. అపజయాలే అధికం

తమిళంలో ఘనవిజయం సాధించిన 'విక్రమ్ వేదా', 'తేరీ', 'ఖైదీ', 'జిగర్తాండా', 'సూరారై పోట్రు', 'వీరమ్', 'లవ్ టుడే' వంటి చిత్రాలు కూడా హిందీలో రీమేక్ అయి, బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. సౌత్ నుండి రీమేక్ అయి బ్లాక్ బస్టర్స్‌గా నిలచిన హిందీ చిత్రాల్లో 'కబీర్ సింగ్', 'దృశ్యం' రెండు భాగాలు, 'సింగమ్' వంటి హిట్ సినిమాలు ఉన్నాయి. అయితే అధికశాతం అట్టర్ ఫ్లాప్స్ ఉండడం గమనార్హం. 'కిసీ కీ భాయ్ కిసీ కీ జాన్'వంటి రీమేక్స్‌లో వెంకటేశ్ లాంటి సౌత్ స్టార్ నటించినప్పటికీ ఫలితం మారకపోవడం విచారకరం. దక్షిణాది విజయవంతమైన చిత్రాల కథలతో రీమేక్ అయిన ఉత్తరాది సినిమాలు అంతగా అలరించకపోవడానికి కారణమేంటి?. ఈ ప్రశ్నకు నార్త్- సౌత్ ఆచారవ్యవహారాల తేడా అని బాలీవుడ్ బాబులు చెబుతున్నారు.

అయితే కథలను సరైన పంథాలో రక్తి కట్టించక పోవడం వల్లే సదరు చిత్రాలు పరాజయం పాలయ్యాయని మరికొందరి మాట. కొన్ని సినిమాలకు ఒరిజినల్ డైరెక్టర్స్ దర్శకత్వం వహించినా ఫలితం లేకుండా పోయింది. అంటే ఆ కథల్లోని అంశాలు ఉత్తరాది వారిని ఆకట్టుకోలేక పోయాయి అని చెప్పొచ్చు. ఓటీటీల్లో సౌత్ మూవీస్‌ను చూసేసిన నార్త్ ఇండియన్ ఆడియెన్స్ కు రీమేక్స్‌లో ఒరిజినాలిటీ మిస్ కావడం వల్లే సినిమాలు దెబ్బతింటున్నాయని పరిశీలకుల మాట. ఈ అంశాలన్నిటినీ గుర్తుంచుకొనే అటు నుండి ఇటు, ఇటు నుండి అటు రీమేక్స్ చేస్తే బాగుంటుందని అంటున్నారు. మరి ఈ సూచనలను ఎందరు ఫాలో అవుతారో? ఏ సౌత్ స్టోరీతో బాలీవుడ్‌లో బంపర్ హిట్స్ సాధిస్తారో చూడాలి.

Updated Date - Oct 04 , 2026 | 08:43 PM