రియల్ పెయిర్ స్థానంలో రీల్ పెయిర్!
ABN , Publish Date - Nov 18 , 2026 | 03:25 PM
యువ నటులు సౌమిత్ రావ్, శ్రేయసీ సేన్ ఒకే ఏడాదిలో రెండోసారి జంటగా నటించిన 'డియర్ ఆస్ట్రోనాట్' నవంబర్ 20న విడుదల కానుంది. 'ఆకాశంలో ఒక తార'తో ఈ సినిమా పోటీ పడనుంది.
గతంలో హీరోలు, హీరోయిన్లు ఒకే యేడాది ఆరేడు సినిమాలు చేసేవాళ్ళు. అందులో ఒకే హీరోతో, ఒకే హీరోయిన్ నటించిన సినిమాలు కనీసం రెండు, మూడు వస్తుండేవి. కానీ కథలో ఉండే కొత్తదనం, దర్శకుల ప్రతిభ కారణంగా ప్రేక్షకులు అదే జంటను మళ్ళీ మళ్ళీ చూడటానికి ఇబ్బంది పడేవారు కాదు. పైగా హిట్ పెయిర్ అనే పేరు వస్తే చాలు... ఆ హీరోహీరోయిన్ల కాంబినేషన్ రిపీట్ అవుతుండేది. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. స్టార్ హీరోలు హీరోయిన్లను రిపీట్ చేయడానికి పెద్దంత ఆసక్తి చూపడం లేదు. చిత్రం ఏమంటే... కుర్ర హీరోలు, హీరోయిన్ల కాంబినేషన్ కూడా చాలా రేర్‌గా రిపీట్ అవుతోంది. అలాంటి సమయంలో ఓ యువ జంట ఒకే యేడాది రెండు సినిమాలలో నటించింది. వాళ్ళే సౌమిత్ రావ్, శ్రేయసీ సేన్!
సౌమిత్ రావ్, శ్రేయసీ సేన్ ఈ యేడాది ఫిబ్రవరి 13న విడుదలైన 'నిలవే' చిత్రంలో జంటగా నటించారు. ఈ సినిమాలో హీరోగా నటించిన సౌమిత్ తన మిత్రుడు సాయి కె వెన్నంతో కలిసి దీనిని డైరెక్ట్ చేశాడు. పాయింట్ ఆఫ్ వ్యూ పతాకంపై నిర్మితమైన ఈ సినిమా కమర్షియల్‌గా ఆడలేదు. అయితే సౌమిత్ రావ్, శ్రేయసీ సేన్ మరోసారి జంట కట్టే అవకాశం 'డియర్ ఆస్ట్రోనాట్' మూవీలో లభించింది. ఇప్పుడీ సినిమా నవంబర్ 20న జనం ముందుకు రాబోతోంది. నిజం చెప్పాలంటే.. 'డియర్ ఆస్ట్రోనాట్' మూవీలో వీళ్ళకు అనుకోకుండా అవకాశం వచ్చింది. అదెలాగంటే... ఖమ్మంకు చెందిన యంగ్ ఫిల్మ్ మేకర్స్ కార్తీక్ భాగ్యరాజా ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో కల్పనా చావ్లా జీవితం నుంచి స్ఫూర్తి పొంది 'కౌగిలి' అనే షార్ట్ ఫిల్మ్ తీశాడు. ఆ తర్వాత విదేశాల్లో చదువు ముగించుకుని హైదరాబాద్ వచ్చి ఆ షార్ట్ ఫిల్మ్ ను పూర్తి స్థాయిలో ఫీచర్ ఫిల్మ్ గా తీయాలనుకున్నాడు. అదే 'డియర్ ఆస్ట్రోనాట్'. ఈ సినిమా కోసం నిజమైన జంట వరుణ్ సందేశ్, వితికాశేరును తొలుత ఎంపిక చేసుకున్నాడు. కొంత షూటింగ్ కూడా చేశారు. అంతేకాదు టీజర్‌ను సైతం విడుదల చేశారు. అయితే అనివార్య కారణాల వల్ల వరుణ్ సందేశ్, వితికా శేరు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దాంతో కార్తీక్ భాగ్యరాజా... 'నిలవే' చిత్రంలో జంటగా నటించిన సౌమిత్, శ్రేయసీ సేన్ లను ఈ సినిమా కోసం తీసుకున్నారు.
ఇదిలా ఉంటే... నవంబర్ 20న విడుదల కాబోతున్న 'డియర్ ఆస్ట్రోనాట్' మూవీతో పవన్ సాదినేని డైరెక్ట్ చేసిన 'ఆకాశంలో ఒక తార' చిత్రం పోటీ పడబోతోంది. ఇది కూడా ఆస్ట్రోనాట్ జీవితం ఆధారంగా తీసిన సినిమానే! తన 'కౌగిలి' షార్ట్ ఫిల్మ్ నుంచి ఇన్ స్పైర్ అయ్యి, 'ఆకాశంలో ఒకతార' సినిమాను తీశారని కార్తీక్ భాగ్యరాజా అంటున్నాడు. అయితే పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి, భారీ తారాగణంతో వస్తున్న 'ఆకాశంలో ఒక తార' మూవీపై చర్యలు తీసుకోవాల్సిందిగా తాను ఎవరినీ కోరడం లేదని, బాగున్న సినిమానే జనం చూస్తారనే నమ్మకం తనకుందని, విధిని తాను నమ్ముతానని చెబుతున్నాడు కార్తీక్. సో... రేపు ఈ రెండు సినిమాలు విడుదలైన తర్వాత వాటిల్లో ఉన్న పోలికలను గమనిస్తేనే అసలు విషయం బయటపడుతుంది.
ఇవి కూడా చదవండి:
‘కింగ్100’ సినిమాపై ఇంత సైలెన్స్ ఎందుకు?
మలేషియాలో గ్రాండ్‌గా మృణాళిని వివాహం.. పెళ్లి ఫోటోలు వైరల్
సోల్‌మేట్‌కు లిప్ కిస్.. ‘పులి’ పిల్ల పబ్లిగ్గా చేసిన రచ్చ చూశారా?