Sonia Gandhi Biopic: జగ్గారెడ్డి 'సోనియా గాంధీ' బయోపిక్ ముహూర్తం, రిలీజ్ డేట్ ఫిక్స్!
ABN, Publish Date - Nov 13 , 2026 | 07:15 AM
సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తానని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి ప్రకటించారు. తన తల్లి జీవితమే ఈ నిర్ణయానికి స్ఫూర్తి అని వెల్లడించారు.
పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు భర్త చనిపోతే ఆ తల్లి కష్టాలు ఎలా ఉంటాయో తనకు తెలుసని, అందుకే సోనియా గాంధీ ఆత్మకథను సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నానని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి (Jagga Reddy) తెలిపారు. తనకు నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు తండ్రి చనిపోతే.. తన తల్లే ఉద్యోగం చేసి పోషించిందని, ఇంతదాకా తీసుకొచ్చిందని చెప్పారు.. భర్త చనిపోయాక తల్లి పాత్ర ఎంత గొప్పగా ఉంటుందన్నది తన తల్లిని చూసే తెలుసుకున్నట్లు పేర్కొన్నారు.
గాంధీభవన్లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సోనియాగాంధీ (Sonia Gandhi Biopic) ఆత్మకథ ఆధారంగా తాను తీయబోయే సినిమాపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ (Mahesh Kumar), తన సన్నిహిత మంత్రులతో చర్చిస్తానన్నారు. ఏఐసీసీ పెద్దలు సోనియా, ఖర్గే, కేసీ వేణుగోపాలను కలిసి వారి అనుమతి కూడా తీసుకోనున్నట్లు చెప్పారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ తదితర భాషల్లో తీసే ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబరు 9న ప్రారంభించి వచ్చే ఏడాది డిసెంబరు 9 కల్లా పూర్తి చేసి విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ సినిమాలో తన నిజజీవిత పాత్ర కూడా ఐదు నిమిషాలు ఉంటుందని చెప్పారు. ఈ సినిమా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల మద్దతుతోనే తీస్తానని వెల్లడించారు. ప్రతి మహిళనూ తల్లిగా భావించాలంటూ ప్రసంగాలు చేసే బీజేపీ, ఆరెస్సెస్ నాయకులు.. సోనియాగాంధీని మాత్రం రాజకీయం పేరుతో విమర్శిస్తుంటారని, ఇదే వారి సిద్ధాంతమా? అని ప్రశ్నించారు. మూడు సార్లు ప్రధానిగా అవకాశం వచ్చినా సోనియా గాంధీ తిరస్కరించారని తెలిపారు. కంగనా రౌనత్ లీడర్ కాదని, ఒక నటి మాత్రమేనని చరిత్ర తెలియని చిన్నపిల్ల అని జగ్గారెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్.. సోనియా ఆత్మకథ పుస్తకంపై చీప్ పాలిటిక్స్ చేయడం సరికాదని హితవు పలికారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. ఆనాడు ఆమె ఆ నిర్ణయం తీసుకోకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేది కాదు. తెలంగాణ ఇచ్చిన ఆమె.. ఆ విషయాన్ని పుస్తకంలో రాసుకుంటారా? తీసుకున్న మనం ఆ విషయాన్ని రాయాలి' అన్నారు.