సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నాని.. ఇక ఆపేస్తే బెటర్

ABN, Publish Date - Sep 25 , 2026 | 05:41 PM

ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందే అన్నట్లు.. న్యాచురల్ స్టార్ నాని ప్యారడైజ్ సినిమాతో మాస్ హీరోగా పాన్ ఇండియా లెవెల్లో ఎదిగిపోతాడు అనుకుంటే.. బాక్సాఫీస్ వద్ద చతికిలపడి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాడు.

Nani

ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందే అన్నట్లు.. న్యాచురల్ స్టార్ నాని (Nani)ప్యారడైజ్ (The Paradise) సినిమాతో మాస్ హీరోగా పాన్ ఇండియా లెవెల్లో ఎదిగిపోతాడు అనుకుంటే.. బాక్సాఫీస్ వద్ద చతికిలపడి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అసిస్టెంట్ డైరెక్టర్‌గా, ఆర్జేగా కెరీర్ ప్రారంభించి తన స్వయంకృషితో నేచురల్ స్టార్ గా ఎదిగిన హీరో నాని ప్రయాణం టాలీవుడ్‌లో ఎందరికో స్ఫూర్తిదాయకం. అష్టా చమ్మాతో నటుడిగా పరిచయమై భలే భలే మగడివోయ్, పిల్ల జమీందార్, ఈగ, నిన్ను కోరి, జెర్సీ, హాయ్ నాన్న వంటి చిత్రాలతో తన సహజసిద్ధమైన నటన, కామెడీ టైమింగ్, ఎమోషన్స్‌తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నాడు. ప్రతింటా ఉండే ప్రక్కంటి కుర్రాడిలాంటి ఇమేజ్ ఆయన సొంతం.


అయితే, టాలీవుడ్‌లో క్లాస్ ఇమేజ్ ఉన్న హీరోకి మార్కెట్ పరిమితులు ఉంటాయని భావించి, తన పరిధిని విస్తరించుకోవడానికి నాని మాస్ హీరోగా మారాలని ఆశపడ్డాడు. పాన్-ఇండియా రేంజ్, భారీ ఓపెనింగ్స్, మాస్ ఫాలోయింగ్ కోసం ఆయన తన బాడీ లాంగ్వేజ్, లుక్స్‌ను పూర్తిగా మార్చేసి దసరా, సరిపోదా శనివారం, హిట్ 3 తాజాగా వచ్చిన ది ప్యారడైజ్ లాంటి రోల్స్ వైపు మొగ్గు చూపాడు. బలమైన మాస్ అండ్ యాక్షన్ ఇమేజ్ దక్కించుకోవాలనే తపనతో రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్లను ఎంచుకుంటూ వరుస ప్రయత్నాలు చేశాడు. కానీ, నానికి ప్యారడైజ్ గట్టి ఝలక్ ఇచ్చింది.


భారీ అంచనాల నడుమ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ది ప్యారడైజ్ బాక్సాఫీస్ వద్ద తీవ్రస్థాయిలో నెగెటివ్ టాక్ తెచ్చుకోవడంతో పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. కథనంలో ల్యాగ్, ఎమోషన్స్ సరిగ్గా పండకపోవడం, పరిమితికి మించిన రక్తపాతం, హింస ఉండటంతో ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ సినిమా రిజల్ట్ చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో నానిపై తీవ్రస్థాయిలో ఫైర్ అవుతూ పెద్ద ఎత్తున డిబేట్ లేవనెత్తారు.


నాని, దయచేసి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాలు చేయడం ఆపేస్తే బెటర్. నీ బలం సహజమైన నటన, ఫ్యామిలీ ఎమోషన్స్. ప్యాన్-ఇండియా, మాస్ పేరుతో మీ ఇమేజ్‌కు అసలు సరిపోని రక్తపాతం, వైలెన్స్ ఉన్న సినిమాలు చేసి మీ నైజమైన నేచురల్ స్టార్ బ్రాండ్‌ను నాశనం చేసుకోవద్దు అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్స్, పోస్ట్‌లు చేస్తున్నారు. జెర్సీ, హాయ్ నాన్న లాంటి కంటెంట్ ఉన్న క్లాస్ సినిమాలు చేయాలని, బలవంతపు మాస్ ట్రై చేసి క్రేజ్ పోగొట్టుకోవద్దని ఆయనకు హితవు పలుకుతున్నారు. మరి నాని తనకు కలిసివచ్చిన ఫార్ములాతోనే ముందుకు సాగుతాడో లేక ఇంకా మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తాడో చూడాలి.

Updated Date - Sep 25 , 2026 | 05:41 PM