Low Budget Movies: 'మా ఇంటి బంగారం' సక్సెస్ తో చిన్న సినిమాలపై మళ్ళీ చర్చ
ABN, Publish Date - Jun 28 , 2026 | 01:02 PM
'చింతలు తీర్చేది - చిన్న సినిమానే' (Low Budget Movies)అనే వారు కొందరు దర్శక నిర్మాతలు. ఇప్పుడు మరికొందరు మేకర్స్ అదే మాట అంటున్నారు.
'చింతలు తీర్చేది - చిన్న సినిమానే' (Low Budget Movies)అనే వారు కొందరు దర్శక నిర్మాతలు. ఇప్పుడు మరికొందరు మేకర్స్ అదే మాట అంటున్నారు. ఎందుకలాగా అంటే భారీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతోంటే కొన్ని లో-బడ్జెట్ మూవీస్ మురిపిస్తున్నాయి. ఆ ముచ్చటేంటో చూడాలి మరి...
నిజంగా... బంగారమే...
'రూపాయి ఖర్చు పెట్టి వంద రూపాయలు సంపాదిస్తే గొప్ప' - అంతేగాని, 'వెయ్యి రూపాయలు వెచ్చించి వెయ్యిన్నొక్క రూపాయి సాధిస్తే ఏం గొప్ప?'... ఇలాంటి మాటలు ప్రపంచంలోని అన్ని సినిమా రంగాల్లోనూ వినిపిస్తూంటాయి. హై -బడ్జెట్ మూవీస్ ఎంత వసూళ్ళు చూసినా వాటి లాభాలను బేరీజు వేస్తే - లో-బడ్జెట్ లో హిట్ టాక్ సంపాదించిన సినిమాల ప్రాఫిట్స్ కన్నా తక్కువనే చెప్పాలి. స్టార్స్ నటించే సినిమాలకు ఎంతలేదన్నా వంద కోట్ల బడ్జెట్ తో చిత్రాలను తీస్తారు... బొటాబొటీగా బాక్సాఫీస్ వసూళ్ళు చూస్తే దానిని హిట్ అనలేం. ఎందుకంటే నిర్మాతలకు బాక్సాఫీస్ కాకుండా తమ సినిమాలపై ఓటీటీ, డిజిటల్, శాటిలైట్ ద్వారా మరికొంత సొమ్ము పోగవుతుంది. అందువల్ల స్టార్స్ తో సినిమాలు తీసేవారికి నష్టాలు కనిపించవు. అయితే స్టార్స్ సినిమాలు కదా అని అత్యాశతో కొనుగోలు చేసినవారికే థియేటర్స్ లో నష్టాలు పొడసూపుతూ ఉంటాయి. ఇలా మనదేశంలో పలు సినిమారంగాలు సాగుతున్నాయి... టాలీవుడ్ పరిస్థితి కూడా అదే. ఈ సమయంలోనే సమంత 'మా ఇంటి బంగారం'గా జనం ముందు నిలిచారు. ఈ మూవీ పెట్టుబడికి రెండింతలు రాబడి చూస్తోందని టాక్.
మొదట్లో వినిపించని మోత...
గత సంవత్సరం కూడా పలు లో-బడ్జెట్ మూవీస్ తెలుగులోనే కాదు ఇతర భాషల్లోనూ మంచి విజయం సాధించాయి. ఈ చిత్రాలు ఇంత సక్సెస్ సంపాదించడానికి కారణం- అందులోని కంటెంట్ అనే చెప్పాలి. సినిమాలో సత్తా ఉందన్న టాక్ స్ప్రెడ్ అయితే చాలు సదరు చిత్రాలు విజయఢంకా మోగిస్తున్నాయి.ఎటొచ్చీ ఈ సినిమాలకు తగిన థియేటర్లు లభించాలి. మంచి థియేటర్స్ లో రిలీజైన చిన్న సినిమాకు సైతం ఆదరణ ఉంటుంది. ఒకవేళ కథ, కథనం బాగున్నాయంటే చాలు జనం థియేటర్లకు పరుగులు తీస్తారు. 'మా ఇంటి బంగారం' కంటే కాసింత ముందు రిలీజైన హిందీ సినిమా 'మై వాపస్ ఆవూంగా' పరిస్థితి ఇదే. ఆరంభంలో అసలే కలెక్షన్స్ లేని ఈ మూవీ మెల్లగా మౌత్ టాక్ తో హిట్ దిశగా సాగింది.
అదే మొదటి సమస్య...
ఇప్పుడే కాదు ఎప్పుడైనా సినిమా థియేటర్లకు లాభాలు తీసుకు వచ్చేవి చిన్న సినిమాల విజయాలే!. తక్కువ బడ్జెట్ లో తెరకెక్కే సినిమాలు అందుకు తగ్గ రేటుతోనే మార్కెట్ లో నిలుస్తాయి. అదే బడ్జెట్ తో రూపొందిన సినిమాల్లో స్టార్స్ నటిస్తే దాని మార్కెట్ వేల్యూ కాస్త పెరుగుతుంది. చిన్న సినిమాలకు ఎదురయ్యే మొదటి సమస్య - ఓపెనింగ్స్ ఉండవు. చిత్రంలో సత్తా ఉంటే 'మౌత్ టాక్'తోనే వసూళ్ళు పెరుగుతాయి. తెలుగు దర్శకులు దాసరి నారాయణరావు, కె.విశ్వనాథ్, బాపు వంటివారు చిన్న సినిమాలతోనే అద్భుతమైన విజయాలు సాధించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 'శంకరాభరణం' చిత్రం ఆ రోజుల్లో కొన్ని కేంద్రాలలో కేవలం ఉదయం ఆటలతో రిలీజయింది. తరువాత టాక్ స్ప్రెడ్ అయి, అదే థియేటర్స్ లో రెగ్యులర్ షోస్ తో అనూహ్య విజయం సాధించింది.
ట్రేడ్ పండిట్స్ టాక్...
ప్రస్తుతం సమంత 'మా ఇంటి బంగారం' తొలి రోజు కన్నా మిన్నగా రెండు, మూడు రోజుల్లో వసూళ్ళు చూడడంతో పాత రోజులను గుర్తు చేసుకుంటున్నారు ఎగ్జిబిటర్స్. ఇలా లో-బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రాలకు 'టిక్కెట్ రేట్స్ హైక్' చేసుకోవలసిన అవసరం ఉండదు. నిర్ణీత టిక్కెట్ రేట్స్ ఉండడంతో బాగున్న సినిమాకు జనం పరుగులు తీస్తూ వస్తారు. ఇప్పుడు జరుగుతున్నదదే. గత సంవత్సరం కూడా కొన్ని చిన్న సినిమాలు విజయం సాధించినప్పటికీ అవి చూసిన లాభాలతో పోలిస్తే ప్రస్తుతం వస్తున్న ప్రాఫిట్స్ మిన్న అని తెలుస్తోంది. అందువల్లే బాలీవుడ్ ట్రేడ్ పండిట్స్ సైతం 'మా ఇంటి బంగారం'ను పోలుస్తూ లో-బడ్జెట్ హిందీ సినిమాల సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటున్నారు.
ఒకేలా ఉండని పరిస్థితి..
'కేరళ స్టోరీ' ఫస్ట్ పార్ట్ కేవలం 15 కోట్ల రూపాయలతో తెరకెక్కింది. ఓపెనింగ్ డే 8 కోట్లు పోగేసింది. మూడు రోజుల్లో ఓ ఇరవై కోట్లు వస్తే చాలనుకున్నారు. మౌత్ టాక్ స్ప్రెడ్ కావడంతో ఈ మూవీ లైఫ్ టైమ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 300 కోట్లు దాటాయి. ఇలాంటి చిన్న సినిమాలు వస్తే చాలని అప్పట్లో ఎగ్జిబిటర్స్ ఎంతో ఆనందించారు... తొలి రోజు 7 కోట్లు పోగేసిన 'బదాయి హో' టోటల్ రన్ లో 137 కోట్లు కొల్లగొట్టింది... మొదటి రోజున 6.8 కోట్లు మాత్రమే రాబట్టిన 'స్త్రీ' థియేటర్స్ ద్వారానే 130 కోట్లు పట్టేసింది. 5 కోట్ల పెట్టుబడితో తెరకెక్కిన 'లాపతా లేడీస్' మొదటి రోజు 75 లక్షలు పోగేసింది. అందరూ బొమ్మ పని అయిపోయిందనే భావించారు. మౌత్ టాక్ తో మెల్లగా 20 కోట్లకు పైగా వసూళ్ళు చూసింది. చిన్న సినిమాల్లో కథ, కథనం బాగుంటే ఎగ్జిబిటర్స్ కూడా కొంత అడ్వాన్స్ ఇస్తున్నారు. ఒకవేళ బొమ్మ బాగోకపోయినా, పెద్దగా నష్టాలు వాటిల్లవు. కానీ, పెద్ద సినిమాల విషయంలో ఎగ్జిబిటర్స్, బయ్యర్స్ అందరూ కోట్ల రూపాయలు ఇచ్చి, పైసలు ఎంచుకోవలసి వస్తోంది.
బడ్జెట్ కంట్రోల్ ముఖ్యం...
చిన్న సినిమాల సక్సెస్ ను చూసి ట్రేడ్ పండిట్స్ భారీ నష్టాలు చూసిన బిగ్ బడ్జెట్ మూవీస్ ను గుర్తు చేసుకుంటున్నారు. ఎంత పెద్ద స్టార్స్ నటించినా బిగ్ బడ్జెట్ సినిమాలు బోల్తా కొడితే ఆ దెబ్బ నుండి కోలుకోవడం కష్టమనే చెప్పాలి. తెలుగులో టాప్ స్టార్స్ నటించిన పలు చిత్రాలు అలాంటి దెబ్బలు తిన్నాయి. హిందీలోనూ అగ్ర కథానాయకుల సినిమాలు సైతం బోల్తా కొట్టి బొంగారాల్లా తిరిగాయి. ఈ తంతు కేవలం మన భారతీయ సినిమాల విషయంలోనే సాగలేదు. ప్రపంచ వ్యాప్తంగా రిలీజయ్యే హాలీవుడ్ మూవీస్ లోనూ ఈ తరహా పరాజయాలు చోటు చేసుకున్నాయి. అమెరికన్ హిస్టారికల్ అడ్వెంచర్ గా రూపొందిన 'ద థర్టీంత్ వారియర్' మూవీ ఇప్పటికీ అత్యధిక నష్టం చూసిన హాలీవుడ్ మూవీగా నిలచే ఉంది. పాతికేళ్ళ క్రితమే ఈ మూవీ నష్టం బేరీజు వేస్తే 100 మిలియన్స్ పై మాటే ఉంది. ఇలా వందల మిలియన్ అమెరికన్ డాలర్స్ నష్టపోయిన సినిమాలు వందలాదిగానే ఉండడం గమనార్హం. అక్కడైనా, ఎక్కడైనా బడ్జెట్ ను ప్లాన్ ప్రకారం కంట్రోల్ చేసుకుంటూ రూపొందిన సినిమాలే మంచి ఆదరణ పొందాయి. బడ్జెట్ పై కంట్రోల్ తో సాగుతోన్న మేకర్స్ ను ఇన్ స్పిరేషన్ గా తీసుకుంటేనే ఏ సినిమారంగమైనా బతుకుతుంది. ఆ తీరున ఎందరు సాగుతారో చూద్దాం...