ఆ సినిమా నాకిచ్చిన దైవవరం.. సినీ శ్వాస సింగీతం: ‘ఆదిత్య 369’ నిర్మాత
ABN , Publish Date - Oct 04 , 2026 | 02:36 PM
భారతీయ సినీ యవనికపై తనదైన సరికొత్త ప్రయోగాలతో సినిమాను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన అద్భుత దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావు. ఆయన ఇక మన మధ్య లేరనే వార్త సినీ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి, శోకసంద్రంలోకి నెట్టింది.
భారతీయ సినీ యవనికపై తనదైన సరికొత్త ప్రయోగాలతో సినిమాను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన అద్భుత దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasa Rao). ఆయన ఇక మన మధ్య లేరనే వార్త సినీ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి, శోకసంద్రంలోకి నెట్టింది. ఈ సందర్భంగా సింగీతం దర్శకత్వంలో టైమ్ మెషిన్ కాన్సెప్ట్‌తో వచ్చి తెలుగు సినీ చరిత్రలోనే మైలురాయిగా నిలిచిన ‘ఆదిత్య 369’ (Aditya 369) చిత్రాన్ని నిర్మించిన సీనియర్ నిర్మాత, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ (Sivalenka Krishna Prasad) కంటతడి పెట్టుకుంటూ.. భావోద్వేగంగా నివాళులర్పించారు.
సింగీతంతో తనకున్న దశాబ్దాల అనుబంధాన్ని, ఆయనతో ముడిపడిన జ్ఞాపకాలను పంచుకుంటూ శివలెంక కృష్ణప్రసాద్ విడుదల చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోలో శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ..
సినిమా తప్ప మరో లోకం తెలియని ప్యాషన్!
‘‘సింగీతం శ్రీనివాసరావు ఇకలేరనే వార్త తీవ్ర వేదనను కలిగిస్తోంది. భారతీయ సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టిన అతికొద్ది మంది దిగ్గజ దర్శకుల్లో ఆయన ఒకరు. ఆయనకు సినిమా తప్ప ఇంకొక ప్యాషన్ లేదు. ప్రతి శ్వాసలోనూ సినిమానే జీవించారు.. సినిమానే అనుభవించారు. చాలామంది సినిమాను వ్యాపార కోణంలో చూస్తారు, కానీ సింగీతం సినిమాను ఆస్వాదించిన ప్యాషన్ నిజంగా అసాధారణం. నిష్కల్మషమైన ఆయన మనస్తత్వం ఎందరికో ఆదర్శం. ఆ రోజుల్లో ఆయన అందించిన ‘సొమ్మొకడిది సోకొకడిది’, ‘పంతులమ్మ’, ‘అమెరికా అమ్మాయి’ వంటి చిత్రాలతో పాటు.. మూకీ చిత్రంగా చరిత్ర సృష్టించిన ‘పుష్పక విమానం’, వైకల్యాన్ని అద్భుత కథగా మలిచిన ‘మయూరి’, ‘అపూర్వ సహోదరులు’, ‘రాజపార్వై’, ‘అమావాస్య చంద్రుడు’ వంటి ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి.
‘ఆదిత్య 369’ భగవంతుడిచ్చిన వరం!
నా జీవితంలో, నా కెరీర్లో సింగీతం నాకు ‘ఆదిత్య 369’ సినిమా ఇవ్వడం అనేది భగవంతుడు ప్రసాదించిన వరంగా భావిస్తాను. దానికి మూలపురుషుడు ఆయనే. ఆ ప్రాజెక్ట్‌ను సజెస్ట్ చేసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, నాటి రోజుల్లో నన్ను నమ్మి ఆ అవకాశం ఇచ్చిన సింగీతం శ్రీనివాసరావు, అలాగే నందమూరి బాలకృష్ణలతో కలిసి ఆ సినిమా చేసే భాగ్యం కలగడం నేను, నా కుటుంబం చేసుకున్న పుణ్యం. వీరిందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను. ఎన్నో సినిమాలు నిర్మించినప్పటికీ.. ఇప్పటికీ అందరూ నన్ను ‘ఆదిత్య 369’ నిర్మాతగానే గుర్తిస్తారు. ఈ ఒక్క సినిమా నిర్మాతగా నాకు ఈ జన్మకు చాలు అనేంత సంతృప్తిని, గర్వాన్ని ఇచ్చింది. 1991లో రిలీజైన ఆ చిత్రం వచ్చి 34-35 ఏళ్లు గడుస్తున్నా నేటికీ దాని గురించే మాట్లాడుకుంటున్నారంటే అది సింగీతం ప్రతిభకు నిదర్శనం.
యంగెస్ట్ ఆఫ్ యంగ్ డైరెక్టర్..
వయసుతో సంబంధం లేకుండా సింగీతం ఎప్పుడూ కుర్రాడిలాగే ఆలోచించేవారు. ‘యంగెస్ట్ ఆఫ్ ది యంగ్’ అన్నట్లుగా ఉండేవారు. ఏ సినిమా ఆడింది? ఎందుకు ఆడలేదు? అనేది నిరంతరం విశ్లేషించేవారు. ప్రతి వారం లేదా పదిహేను రోజులకు ఒకసారి నాతో ఫోన్లో మాట్లాడేవారు. ఏ సినిమా ఎలా ఉందనే దానిపై ఎప్పుడూ అప్డేట్గా చర్చించేవారు. గతేడాది నన్ను కలిసి.. ‘నాకో మంచి కథ తట్టింది, అద్భుతమైన ఐడియా ఇస్తాను, మీరే కథను డెవలప్ చేసుకోండి’ అని ఆ ఐడియా చెప్పారు. ‘మీరే కథగా ఇవ్వండి సార్’ అంటే.. ‘నేను ఆ సింగ్ గీతం ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉన్నాను’ అని చెప్పారు. ఇటీవల నాగ్ అశ్విన్ సమర్పణలో వచ్చిన ‘సింగ్ గీతం’ చిత్రంలోనూ భాగమయ్యారు. ఆ వయసులోనూ ఆయన చూపించిన నిరంతర శ్రమ, అంకితభావం అద్భుతం.
సింగీతం శ్రీనివాసరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అంటూ శివలెంక కృష్ణప్రసాద్ భావోద్వేగంతో నివాళులర్పించారు.
ఇవి కూడా చదవండి:
Varanasi: మహేష్ ‘రుద్ర’ పాత్రపై రాజమౌళి షాకింగ్ కామెంట్స్
Drishyam 3: అక్షయ్ ఖన్నా తప్పిదం.. జైదీప్‌కు జాక్‌పాట్
రెండు పార్టులుగా సాయిపల్లవి రెండు సినిమాలు