గ్రామీణ ప్రేమ కథతో.. 'సింగిల్ రాజు'
ABN, Publish Date - May 26 , 2026 | 07:43 AM
విశ్వస్, మౌనిక, దివ్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘సింగిల్ రాజు’ సినిమా టైటిల్ పోస్టర్, గ్లింప్స్‌ను వేణు ఊడుగుల విడుదల చేశారు.
విశ్వస్ (Vishwas), మౌనిక, దివ్య ప్రధాన పాత్రల్లో ఎస్.ఎస్.వర్మ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘సింగిల్ రాజు (Single Raju). అందమైన గ్రామీణ ప్రేమకథగా రూపుదిద్దుకుంటోంది. సోమవారం నిర్వహించిన వేడుకలో దర్శకుడు, నిర్మాత వేణు ఊడుగుల (Venu Udugula) ఈ చిత్రం టైటిల్ పోస్టర్‌తో పాటు గ్లింప్స్ విడుదల చేశారు. టైటిల్ లోగోలో కనిపిస్తున్న ‘బ్రోకెన్ హర్ట్’ ఎమోజీని బట్టి ఈ సినిమా యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్నట్టు తెలుస్తోంది.
ఈ సందర్భంగా వేణు ఊడుగుల మాట్లాడుతూ ‘ఈ సినిమా కథ వినగానే చాలా ఆసక్తిగా అనిపించింది. ఎంతో ధృడ సంకల్పంతో ఈ సినిమాను ప్రారంభించారు. చిత్ర యూనిట్ మొత్తం కష్టపడి పనిచేస్తోంది. సినిమా పెద్ద విజయం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని అన్నారు.
ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని హీరో విశ్వస్ కోరారు. హీరోయిన్ మౌనిక మాట్లాడుతూ ‘విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో జరిగే ఈ కథలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి’ అని అన్నారు. ‘ప్రేక్షకులను తప్పకుండా అలరించే మంచి ఎంటర్‌టైనర్‌గా ‘సింగిల్ రాజు’ నిలుస్తుందనే నమ్మకముంది’ అని చిత్ర దర్శకుడు వర్మ చెప్పారు.