నేనెంత దురదృష్టవంతురాలినో మాటల్లో చెప్పలేను: కౌసల్య
ABN , Publish Date - Jul 12 , 2026 | 07:55 PM
జానకమ్మ మృతిపై సింగర్ కౌసల్య తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారతీయ సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన గానకోకిల ఎస్. జానకి (S Janaki) మృతి.. ఎందరినో దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కర్ణాటక ప్రభుత్వ లాంఛనాలతో కనియనహుండి ఫాంహౌస్‌లో జానకమ్మ అంత్యక్రియలు ముగిశాయి. పలువురు దక్షిణాది సినీరంగ ప్రముఖులతో పాటు ఆమెను కడసారి చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. జానకమ్మ మృతిపై సింగర్ కౌసల్య (Singer Kousalya) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో..
‘‘నేను ఎంత దురదృష్టవంతురాలిని అంటే నేను మాటల్లో చెప్పలేను. ఎస్. జానకమ్మని కలవాలని, వారి ముందు పాడాలని, వారితో మాట్లాడాలని ఎప్పటినుంచో కలలు కన్నాను. బట్, ఇంక ఆ కల ఎప్పటికీ నెరవేరదు. ఇది అసలు ప్రాసెస్ చేసుకోలేకపోతున్నాను. చాలా బాధాకరమైన దుర్వార్త. అమ్మ ఎస్. జానకమ్మ, మీ మాటలు వింటూ, మీ పాటల్లో మెళకువలు నేర్చుకుంటూ పెరిగాను నేను. మీరు ఎంతో నేర్పించారు. అసలు డిక్షన్ కానీ, న్యాచురల్‌గా గమకాలని ప్రాసెస్ చేయడం, ఎలాంటి ఆర్టిఫిషియాలిటీ లేకుండా పాడటం ఇవన్నీ మీ నుంచి నేర్చుకున్నాం. ఎస్. జానకమ్మ, పి. సుశీలమ్మ పాటలు విని పెరిగాము. ఎన్నో థింగ్స్ అడాప్ట్ చేసుకున్నాము, ఎన్నో మెళకువలు నేర్చుకున్నాము. ఒక్కసారి కూడా కలిసే అవకాశం రాలేదు. చాలా దురదృష్టవంతులం.
నేనసలు ప్రాసెస్ చేసుకోలేకపోతున్నాను. ఎస్. జానకమ్మ, వి మిస్ యు సో మచ్. ఒక రిలీఫ్ ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో ఎస్. జానకమ్మ బర్త్ డేకి ‘గున్నమామిడి కొమ్మమీద’ పాట పాడి.. రీల్ పోస్ట్ చేసినప్పుడు, జానకమ్మ ఆత్మీయులు వారికి ఆ వీడియో చూపించి.. ‘కౌసల్య మీ బర్త్ డేకి ట్రిబ్యూట్‌గా ఈ వీడియో పెట్టింది’ అని చూపించినప్పుడు ఆవిడ మొత్తం పాట చూసి.. ‘కౌసల్య నాకు తెలియకపోవడం ఏంటి, చాలా బాగా పాడుతుంది. మరి పక్కనున్న అమ్మాయి ఎవరు?’ అని ఎంక్వయిరీ చేశారట. ‘వారి చెల్లెలు సుధ’ అని చెప్పారట. ఈ విషయం నాకు రీసెంట్ గానే వారు నాతో చెప్పారు. నాకు చాలా సంతోషం వేసింది. ‘ఎప్పటికైనా కలవలేకపోతానా, వెరీ సూన్ ఆవిడ ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు కలుద్దాము’ అని అనుకుంటున్నాను. ఈ లోపు ఈ దుర్వార్త వినాల్సి వచ్చింది.
జానకమ్మ, మీరు మా హృదయాల్లో ఎప్పటికీ పదిలంగా ఉంటారు. ఎందుకంటే, మీ పాటల రూపంలో ప్రతీ రోజు మేమే పాడుకుంటూ ఉంటాం. ఎవరి కోసమో పాడటం కాదు, ప్రతి రోజు ఇంట్లోనూ, ఎక్కడో అక్కడ మీ పాటలు లేకుండా దినచర్య ఉండదు. మీరు మా హృదయాల్లో పదిలంగా ఉంటారు. మీకు సద్గతి ప్రాప్తించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. You will stay forever in our hearts అమ్మ. వి లవ్ యు సో మచ్’’ అని కౌసల్య భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి:
విజయ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్! ‘జననాయగన్’ మళ్లీ వాయిదా..
శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ టీమ్స్ మధ్య ఘర్షణ.. సభ్యుల విజ్ఞప్తి ఇదే
ముంబై హాస్పిటల్‌లో పవన్ కళ్యాణ్‌ని పరామర్శించిన సీఎం చంద్రబాబు