America Ammayi: యాభై ఏళ్ళ.. 'అమెరికా అమ్మాయి' ! సింగీతంకు తొలి హిట్
ABN , Publish Date - Nov 19 , 2026 | 12:43 PM
సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన 'అమెరికా అమ్మాయి' యాభై ఏళ్ళ క్రితం భలేగా అలరించింది. నాటి వర్ధమాన నటీనటులకు 'అమెరికా అమ్మాయి' మంచి గుర్తింపు సంపాదించి పెట్టింది. ఆ విశేషాలను మననం చేసుకుందాం..
'అమెరికా అమ్మాయి' నోట తెలుగు పాట- వింటూంటేనే ఆసక్తి కలిగించింది అప్పట్లో.. అందుకు తగ్గట్టుగానే కథ తెరపై ఆవిష్కృతమయింది. ఓ గొప్పింటి అబ్బాయి అమెరికాలో ఉన్నత విద్యలకు వెళ్ళి, అక్కడి అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకు వస్తాడు. వచ్చిన కోడలు అబ్బాయి కన్నవారికి నచ్చదు. ఆ అమెరికా అమ్మాయి తెలుగుదనం ఉట్టిపడేలా తనను తాను తీర్చిదిద్దుకుంటుంది. మరో అబ్బాయి, అతను ప్రేమించిన అమ్మాయి ఇద్దరూ వెస్ట్రన్ కల్చర్ ను అభిమానిస్తూ సాగుతారు. ఇలా ఇద్దరుకొడుకుల కథతో తెరకెక్కిన చిత్రం 'అమెరికా అమ్మాయి (America Ammayi).
ఈ సినిమాకు 1975లో తమిళంలో రూపొందిన 'మేల్నాట్టు మరుమగళ్' ఆధారం. దీనిని తెలుగు వారికి నచ్చేలా సింగీతం శ్రీనివాసరావు (Singeetam Srinivasa Rao) తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని నవతా కృష్ణంరాజు (Navata Krishnam Raju) నిర్మించారు. ఇందులో పెద్దబ్బాయిగా శ్రీధర్ (Sreedhar), చిన్నబ్బాయిగా రంగనాథ్ (Ranganath), అతని ప్రేయసిగా దీప (Deepa) నటించారు. అమెరికా అమ్మాయి పాత్రలో యాన్నిక్ ఛేమోట్టీ (Annick Chaymotty) (Devayani) అభినయించారు. 1976 నవంబర్ 29న విడుదలైన 'అమెరికా అమ్మాయి' తెలుగు వారినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి జీకే వెంకటేశ్ (G. K. Venkatesh) సమకూర్చిన సంగీతం ప్రధాన ఆకర్షణ.

'అమెరికా అమ్మాయి' సినిమా నాటికి సింగీతం శ్రీనివాసరావుకు హిట్స్ ఏమీ లేవు. అయితే ఆయన ప్రయోగాలను కొందరు అభిమానించే వారు. అలాంటి వారిలో నవతా కృష్ణంరాజు ఒకరు. అందువల్లే 'అమెరికా అమ్మాయి'కి సింగీతం శ్రీనివాసరావును దర్శకునిగా ఎంచుకున్నారు. ఈ సినిమా సక్సెస్ తోనే సింగీతంకు మంచి గుర్తింపు లభించింది. ఇందులో పండరీబాయి, గుమ్మడి, కాంతారావు, రాజబాబు, రమాప్రభ కీలక పాత్రధారులు. ఈ చిత్రంలో శ్రీధర్, రంగనాథ్ అన్నదమ్ములుగా నటించగా, నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో శరత్ బాబు అభినయించారు. దీప అప్పుడప్పుడే నటిగా గుర్తింపు సంపాదిస్తూ ఉండగా ఈ చిత్రంలో దీప నటన అందరినీ ఆకట్టుకుంది. ఇక ఇందులో అమెరికా అమ్మాయిగా నటించిన యాన్నిక్ ఛేమోట్టీ అసలు అమెరికాకు చెందినది కాదు. ఆమె ఫ్రాన్స్ వాసి. భారతీయ సంస్కృతిపై ఆకర్షితురాలయి ఇక్కడకు వచ్చి భరతనాట్యం అభ్యసించారు. కుమారి దేవయాని పేరుతో సుప్రసిద్ధురాలయ్యారు యాన్నిక్.
'అమెరికా అమ్మాయి' చిత్రానికి బాలు మహేంద్ర కెమెరా పనితనం సహజత్వాన్ని చేకూర్చింది. జీకే వెంకటేశ్ బాణీల్లో రూపొందిన ఆరు పాటలూ అలరించాయి. సి.నారాయణరెడ్డి రెండు పాటలు, మైలవరపు గోపి రెండు పాటలు రాయగా, 'టెల్ మి టెల్ మి.' సాంగ్ ను ఆరుద్ర రాశారు. ఇక ఇందులోని సూపర్ హిట్ సాంగ్ 'పాడనా తెనుగు పాట (Paadana Tenugu Paata Paravasamai Nee Eduta Mee Paata) ను దేవులపల్లి కృష్ణశాస్త్రి (Devulapalli Krishnasastri) రచించారు. ఈ పాట ఇప్పటికీ ప్రతా తెలుగు ఇంట్లో వినిపిస్తూ ఉంటుంది. ఇక ఈ సినిమా సక్సెస్ సింగీతం శ్రీనివాసరావుకు, నిర్మాత నవతా కృష్ణంరాజుకు మంచి పేరు సంపాదించి పెట్టింది. తరువాత వీరిద్దరి కాంబోలో రంగనాథ్ హీరోగా రూపొందిన 'పంతులమ్మ' కూడా అలరించింది. ఏది ఏమైనా ఈ నాటికీ కొందరి మదిలో 'అమెరికా అమ్మాయి' సినిమా తిష్ట వేసుకుందనే చెప్పాలి.
ఇవి కూడా చదవండి:
అనిల్ రావిపూడి మొదలెట్టేశాడు.. ఇక జాతరే
సీఎం విజయ్‌కు థ్యాంక్స్ చెప్పిన ధనుష్.. విషయమిదే
‘వారణాసి’.. జక్కన్నా, ఈ వార్తలు నిజమేనా?