సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tollywood: 13 ఏళ్ల త‌ర్వాత.. లెజండ‌రీ డైరెక్ట‌ర్ రీ ఎంట్రీ! క‌ల్కి ద‌ర్శ‌కుడి.. నిర్మాణంలో సినిమా

ABN, Publish Date - Jan 31 , 2026 | 06:34 PM

ప్రముఖ దర్శకులు, లివింగ్ లెజెండ్ సింగీతం శ్రీనివాసరావు 94 సంవత్సరాల వయసులో మరోసారి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న 61వ చిత్రాన్ని నాగ అశ్విన్ నిర్మిస్తున్నారు.

Singeetham Srinivasarao

భారతీయ సినిమా రంగం గర్వించే దర్శకుల్లో సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasarao) ఒకరు. సినిమా జనం ఆయన్ని లివింగ్ లెజెండ్ గా భావిస్తారు, గౌరవిస్తారు. దర్శకుడిగా ఆయన వివిధ భాషల్లో ఇంతవరకూ అరవై చిత్రాలను రూపొందించారు. అందులో ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. మరెన్నో ప్రయోగాత్మక చిత్రాలు ఉన్నాయి. సాంఘిక, జానపద, పౌరాణిక చిత్రాలనే కాదు... 'పుష్పక విమానం' (Pushpaka Vimanam) లాంటి మూకీ చిత్రాన్నీ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించారు. చివరగా ఆయన 2013లో 'వెల్ కమ్ ఒబామా' మూవీని రూపొందించారు. ప్రస్తుతం ఆయనకు 94 సంవత్సరాలు. ఇప్పుడు పుష్కరకాలం తర్వాత మరోసారి సింగీతం శ్రీనివాసరావు మెగాఫోన్ చేతిలోకి తీసుకున్నారు. ఈ వయసులో ఆయనో సినిమాను రూపొందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ అల్లుడు, యువ దర్శకుడు నాగ అశ్విన్ (Naga Ashwin) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి దేవిశ్రీ ప్రసాద్ (Devisri Prasad) సంగీతం అందిస్తున్నారు. శనివారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. మూవీ టైటిల్ ను అతి త్వరలో ఖరారు చేయబోతున్నారు. ఈ విషయాన్ని తెలియచేస్తూ, చిత్రనిర్మాణ సంస్థ ఓ వీడియోను విడుదల చేసింది. నాగ అశ్విన్ దర్శకత్వం వహించిన ప్రతిష్ఠాత్మక చిత్రం 'కల్కి 2898 ఎ.డి.'కి క్రియేటివ్ హెల్ప్ ను సింగీతం శ్రీనివాసరావు చేశారు. ఆ సమయంలో ఏర్పడిన అనుబంధంతో నాగ అశ్విన్... ఇప్పుడు సింగీతం దర్శకత్వంలో ఈ సినిమా నిర్మాణానికి పూనుకున్నారు.


సింగీతం శ్రీనివాసరావును ఎందుకు లెజెండరీ దర్శకుడిగా సినిమా రంగం గౌరవిస్తుందో ఈ వీడియో చూస్తే అర్థమౌతుంది. అందరికంటే సింగీతం కుర్రవాడని నందమూరి బాలకృష్ణ అంటే, అసలు సిసలు పాన్ ఇండియా మూవీ 'పుష్పక విమానం' అని కన్నడ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ ఉపేంద్ర చెప్పారు. 'విచిత్ర సోదరులు' చిత్రంలో కమల్ హాసన్ మూడు అడుగుల మనిషిగా కనిపించడం ఇప్పటికీ తమకు మిస్టరీనే అని అంటారు రాజమౌళి. 'పుష్పక విమానం'లోని షాట్స్ ను తానెప్పటికీ మరువలేనని మణిరత్నం చెబుతుంటారు. క్రిష్‌ సైతం సింగీతం శ్రీనివాసరావు గొప్పతనాన్ని పొగిడేశారు. ఏదేమైనా... ఓ భారతీయ దర్శకుడు తన 94వ సంవత్సరంలో ఫీచర్ ఫిల్మ్ కు దర్శకత్వం వహించడం కూడా ఓ రికార్డే. మరో విశేషం ఏమంటే... ప్రముఖ మలయాళ చిత్ర దర్శకులు ఆదూర్ గోపాలకృష్ణన్ కూడా తన 84వ యేట ఇప్పుడు మరోసారి దర్శకత్వం వహించడానికి సిద్థమయ్యారు.

Updated Date - Jan 31 , 2026 | 09:07 PM