Shruti Haasan: నా దశ మార్చేసిన సినిమా అదే.. శ్రుతి ఆసక్తికర వ్యాఖ్యలు
ABN, Publish Date - Nov 08 , 2026 | 10:57 AM
పాటొచ్చి పదేళ్లు అయింది.. ఇంకా క్రేజ్ తగ్గలేదు.. ‘గబ్బర్‌సింగ్’ సినిమాలో అలీ చెప్పిన డైలాగ్ ఇది. సినిమా వచ్చి 15 ఏళ్లు అయింది.. ఇంకా ఆ జ్ఞాపకాలు వదల్లేదు.. ఇప్పుడు శ్రుతీహాసన్ అంటోన్న మాట ఇది.
పాటొచ్చి పదేళ్లు అయింది.. ఇంకా క్రేజ్ తగ్గలేదు..
‘గబ్బర్‌సింగ్’ (Gababr Singh)సినిమాలో అలీ చెప్పిన డైలాగ్ ఇది.
సినిమా వచ్చి 15 ఏళ్లు అయింది.. ఇంకా ఆ జ్ఞాపకాలు వదల్లేదు..
ఇప్పుడు శ్రుతీహాసన్ (Shruti Haasan) అంటోన్న మాట ఇది.
గబ్బర్‌సింగ్ సినిమా సక్సెస్ గురించి ఆమె మరోసారి గుర్తు చేసుకున్నారు. శ్రుతీ కెరీర్‌ను ‘గబ్బర్‌సింగ్’కు ముందు ఆ తర్వాతగా చెబుతారు. ఎందుకంటే ఆ సినిమాకు ముందు తెలుగు, తమిళ భాషల్లో అరడజను చిత్రాల్లో నటించింది. కానీ ఏదీ హిట్ కాలేదు. ప్రతి సినిమా ఆమెపై ఐరెన్‌లెగ్ అనే ముద్ర వేసింది. 2012లో పవన్‌కల్యాణ్ నటించిన ‘గబ్బర్‌సింగ్’ రిలీజ్ అయింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. అప్పటికే 10 ఏళ్లగా హిట్ లేని పవన్‌కల్యాణ్‌కు భారీ విజయాన్ని అందించగా, శ్రుతీహాసన్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. అందులో పోషించిన భాగ్యలక్ష్మి పాత్రతో మెప్పించి ఓవర్‌నైట్ స్టార్‌గా నిలిచింది. అప్పటివరకూ ఐరెన్ లెగ్ అని విమర్శించిన వారే గోల్డెన్ లెగ్ అని ప్రశంసించడం మొదలెట్టారు. ఈ సినిమా విడుదలై 15 ఏళ్లు కావొస్తున్నా.. సినిమా అందించిన సక్సెస్‌ను శ్రుత్రీ ఇప్పటికీ మరచిపోకుండా కృతజ్ఞతగా ఉంది.
తాజా ఇంటర్వ్యూలో శ్రుతీహాసన్ గబ్బర్‌సింగ్ సక్సెస్ తన కెరీర్‌ను ఎలా మార్చిందో చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో శ్రుతీహాసన్ మాట్లాడుతూ ‘‘తెలుగులో గబ్బర్‌సింగ్’ అనే సినిమా చేశాను. ఆ సినిమా ముందు వరకూ శ్రుతీహాసన్ వేరు.. ఆ సినిమా తర్వాత వేరు. చాలా పెద్ద హిట్టైన సినిమా అది. నా కెరీర్‌ని ఛేంజ్ చేసేసింది. టాలీవుడ్లో ఓవర్‌నైట్ భాగ్యలక్ష్మిని అయిపోయాను. నా దశ మారిపోయింది. రకరకాల కథలు, పాత్రలు వరుస కట్టాయి. రేసుగుర్రం, శ్రీమంతుడు లాంటి భారీ చిత్రాల అవకాశాలు వచ్చాయి. వీటన్నింటికీ రూట్ వేసింది గబ్బర్‌సింగ్ సినిమానే! నేను తెలుగమ్మాయిని కాకపోయినా తెలుగు అమ్మాయి మాదిరి నన్ను ఆదరిస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీ నాకు ఇచ్చిన నేమ్, ఫేమ్‌కు జీవితాంతం ఇండస్ట్రీకి రుణపడి ఉంటాలి.. ఉంటాను కూడా’ అని చెప్పారు.
అయితే శ్రుతీ ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు మాట్లాడింది అనే చర్చ నడుస్తోంది. గబ్బర్‌సింగ్ లాంటి హిట్ సినిమా ఇచ్చిన కిక్ అలాంటిదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులో సినిమాలు చేసి.. మరో ఇండస్ర్టీకి వెళ్లి తెలుగు సినిమాను, ఆర్టిస్ట్‌లను హేళన చేస్తున్న హీరోయిన్లతో పోల్చితే శ్రుతీ వంద రెట్లు నయమనీ, తెలుగు సినిమా ఇచ్చిన గుర్తింపునకు ఆమె కృతజ్ఞతగా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు మరికొందరు.
ఈ ఏడాది ‘పెద్ది’ సినిమాలో ప్రత్యేక గీతంలో అలరించిన శ్రుతీ.. ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి ‘ట్రైన్’ కాగా.. మరొకటి ‘ఆకాశంలో ఒక తార’. దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఈ నెల 20న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.