Shruti Haasan: పెంపుడు పిల్లిని దూరం చేసుకున్న శ్రుతి హాసన్.. అసలు కారణం ఇదే
ABN, Publish Date - Aug 11 , 2026 | 01:53 PM
నటి శ్రుతి హాసన్ (Shruti Haasan) తన పెంపుడు పిల్లి అస్లాన్‌ను రీహోమ్ (Pet Cat Rehoming) చేయడంపై తొలిసారి స్పందించారు.
నటి శ్రుతి హాసన్ (Shruti Haasan) తన పెంపుడు పిల్లి అస్లాన్‌ను రీహోమ్ (Pet Cat Rehoming) చేయడంపై తొలిసారి స్పందించారు. తీవ్రమైన అలర్జీ సమస్య కారణంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. ఎంతో ప్రేమగా పెంచుకున్న మూగజీవిని దూరం చేసుకోవడం తన జీవితంలోనే అత్యంత బాధాకరమైన విషయమని భావోద్వేగానికి గురయ్యారు. శ్రుతి హాసన్ నుంచో ఓ పిల్లిని పెంచుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను అప్పుడప్పుడు అభిమానులతో పంచుకుంటారు. తాజాగా పెంపుడు పర్షియన్ పిల్లి అస్లాన్‌ను వేరే వారికి రీహోమ్ చేయడం ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. అస్లాన్‌ను ఎందుకు దూరం చేయాల్సి వచ్చిందనే దానిపై శ్రుతి హాసన్ తెలిపారు.
'తీవ్రమైన అలర్జీ సమస్య తలెత్తడంతోనే అస్లాన్‌ను రీహోమ్ చేయాల్సి వచ్చింది. ఎంతో ఇష్టంగా పెంచుకున్న పెంపుడు పిల్లిని దూరం చేయాల్సి రావడం నాకు చాలా బాధ కలిగించింది. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో అస్లాన్‌ను నా దగ్గర ఉంచుకోలేకపోయాను. అస్లాన్‌ను దూరం చేసిన క్షణాలు నా జీవితంలోనే అత్యంత బాధాకరమైన సందర్భాల్లో ఒకటి. ఆ సమయంలో నేను అనుభవించిన బాధను మాటల్లో చెప్పలేను. మానసికంగా చాలా కుంగదీసింది. ఇది నేను ఇష్టపూర్వకంగా తీసుకున్న నిర్ణయం కాదు. నా ఆరోగ్య పరిస్థితుల కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అస్లాన్‌ను దూరం చేసిన విషయంపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అందుకే అసలు కారణాన్ని స్పష్టంగా చెప్పాలనుకున్నాను. కొందరు నా నిర్ణయాన్ని భిన్నంగా అర్థం చేసుకున్నప్పటికీ.. తీవ్రమైన అలర్జీ వంటి ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అస్లాన్ ఇప్పుడు నా దగ్గర లేకపోయినా.. దాని సంక్షేమం, ఆరోగ్యం నాకు ఎప్పటికీ ముఖ్యమే. నేను దాన్ని ఎంతో ప్రేమించాను, ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాను. ఒక పెంపుడు జంతువుతో ఏర్పడే అనుబంధం ఎంత బలంగా ఉంటుందో అస్లాన్ విషయంలో అనుభవించాను' అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.