Ramayana: సాయి పల్లవికి.. షాకింగ్ రెమ్యునరేషన్
ABN , Publish Date - Jul 27 , 2026 | 07:29 AM
సౌత్ సినీ ఇండస్ట్రీలో సహజ నటనకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ సాయి పల్లవి.
సౌత్ సినీ ఇండస్ట్రీలో సహజ నటనకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi). గ్లామర్ షోకి పూర్తి దూరంగా ఉంటూ.. కేవలం తన అద్భుతమైన అభినయం, డ్యాన్స్‌తో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. 2015లో మలయాళంలో వచ్చిన ప్రేమమ్ సినిమాతో కథానాయికగా ప్రయాణం ప్రారంభించిన ఈ భామ, ఇండస్ట్రీలోకి వచ్చి విజయవంతంగా 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ 11 ఏళ్ల కాలంలో ఎంతో మంది కథానాయికలు రావడం, మెరిసి మాయమైపోవడం మనం చూశాం. కానీ సాయి పల్లవి క్రేజ్, డిమాండ్ మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది తప్ప ఎక్కడా తగ్గలేదు.
సాయి పల్లవికి ఉన్న ప్రత్యేకతే అది. రెమ్యునరేషన్ ఎంత ఇస్తారు..? అనే దానికంటే.. కథలో తన పాత్రకు ఉన్న ప్రాధాన్యత ఏంటి..? అనే దానికే ఆమె మొదటి ప్రాధాన్యం ఇస్తారు. కేవలం కథ నచ్చితేనే ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పే అతికొద్ది మంది సౌత్ హీరోయిన్లలో సాయి పల్లవి ముందు వరుసలో ఉంటారు. సినిమా సినిమాకూ తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్న ఈ లేడీ పవర్ స్టార్, ఈసారి ఏకంగా బాలీవుడ్ భారీ ప్రాజెక్ట్ రామాయణం (Ramayana) లో సీతమ్మ పాత్రలో కనిపించడానికి సిద్ధమవుతున్నారు.
నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో సాయి పల్లవి సీతగా నటిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే, ఈ పౌరాణిక చిత్రం కోసం సాయి పల్లవి అందుకోబోతున్న రెమ్యునరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. రెండు భాగాలుగా 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సాయి పల్లవి ఏకంగా రెండేళ్ల సుదీర్ఘ సమయాన్ని కేటాయించారు.
అంటే ఈ రెండేళ్ల పాటు ఆమె వేరే ఏ ఇతర సినిమాలకు సంతకం చేసే అవకాశం చాలా తక్కువ. ఒక రకంగా చెప్పాలంటే తన కెరీర్‌లో అత్యంత కీలకమైన సమయాన్ని ఈ ఒక్క ప్రాజెక్ట్‌కే డెడికేట్ చేసింది. అందుకే ఈ విషయంలో నిర్మాత నమిత్ మల్హోత్రా ఆమెకు భారీ ఆఫర్‌ను ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. రెండు భాగాలకు కలిపి సాయి పల్లవికి దాదాపు 20 కోట్లకు పైగా పారితోషికం ఇస్తున్నారని సమాచారం. సౌత్ సినీ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్‌కు ఈ స్థాయిలో పారితోషికం అందడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
అయితే నార్త్‌లో ఏళ్ల తరబడి ఉంటూ భారీగా పారితోషికం తీసుకునే టాప్ హీరోయిన్లతో పోలిస్తే ఇది తక్కువే అయినప్పటికీ.. ఒక సౌత్ నటికి బాలీవుడ్ భారీ ప్రాజెక్ట్‌లో ఈ స్థాయిలో గౌరవం దక్కడం విశేషమనే చెప్పాలి. సాధారణంగా సాయి పల్లవి తాను ఒప్పుకున్న సినిమాల ప్రమోషన్స్‌లో ఎంత యాక్టివ్‌గా పాల్గొంటారో మనకు తెలిసిందే. రామాయణం లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కి బల్క్ డేట్స్ ఇవ్వడంతో పాటు, రోల్ కోసం ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వాల్సి రావడం వల్లనే మేకర్స్ ఈ మొత్తాన్ని అందించడానికి వెనుకాడలేదని అంటున్నారు. ఏది ఏమైనా, వెండితెరపై సీతమ్మ పాత్రలోని పవిత్రతను, గాంభీర్యాన్ని, ఆ భావోద్వేగాలను పండించడంలో సాయి పల్లవి వంద శాతం న్యాయం చేయగలరని చిత్ర యూనిట్‌తో పాటు ఆమె అభిమానులు కూడా గట్టిగా నమ్ముతున్నారు.