Shivaji: ఎపిక్.. ఐస్ లేని అర్జున్ రెడ్డి
ABN, Publish Date - Sep 04 , 2026 | 10:27 PM
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్. బ్లాక్‌బస్టర్ హిట్ బేబీ చిత్రం తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా కనిపించడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.
ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda), వైష్ణవి చైతన్య (Aditya Hasan) జంటగా ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్ (EPIC - First Semester). బ్లాక్‌బస్టర్ హిట్ బేబీ చిత్రం తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా కనిపించడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సెప్టెంబర్ 11 న ఎపిక్ రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ స్పీడు పెంచిన మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ వేడుక ఇటీవల హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సీనియర్ నటుడు శివాజీ మాట్లాడుతూ.. 'నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాత నాగవంశీ గారికి, వీఎంఆర్ గారికి, ఉప్పుటూరు వెంకట్ గారికి, డైరెక్టర్లు శివ నిర్వాణ, శైలేష్‌లతో పాటు ఈవెంట్‌కు విచ్చేసిన రష్మిక మందన్నకి నా ప్రత్యేక ధన్యవాదాలు. రష్మికను చూస్తేనే ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. పెళ్లి తర్వాత ఆమెను మొదటిసారి చూడటం, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఆదిత్య నాకు కథ చెప్పినప్పుడు ఆయన సృష్టించిన ఆ ఆదిత్య వరల్డ్ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. 13 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇండస్ట్రీకి రీ-ఎంట్రీ ఇచ్చేటప్పుడు నా క్యారెక్టర్ ఇంపార్టెంట్ అయి ఉండాలని ఫిక్స్ అయ్యాను.
ఇది 90s వెబ్ సిరీస్‌కు సీక్వెల్ కాబట్టి, ఆదిత్య నా దగ్గరకు రాగానే కాదనకుండా ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నాను. ఈ సినిమాలో నాది పెద్ద పాత్ర కాకపోవచ్చు కానీ కథ ఫస్ట్ సీన్ నుండి లాస్ట్ సీన్ వరకు చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. విదేశాలకు వెళ్లిన పిల్లలకు, ఇక్కడ ఉండే వారి కుటుంబాలకు ఇది ఒక పెద్ద పండగ లాంటి సినిమా. ఎక్కడా బలవంతంగా నెట్టకుండా, చాలా ఆర్గానిక్‌గా వచ్చే ఎమోషన్స్, బ్రేకప్స్ ఇందులో ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఐస్ లేని ఒక అర్జున్ రెడ్డి లాంటి సినిమా, క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. సెప్టెంబర్ 11న థియేటర్లలో కలుద్దాం, అంతేకాదు దీని చాప్టర్ 2 కూడా వేరే లెవెల్‌లో ఉండబోతోంది' అని చెప్పుకొచ్చాడు.