ఓటీటీలో ఇరుముడి ట్రోలింగ్.. ఎట్టకేలకు నోరువిప్పిన శివ నిర్వాణ
ABN , Publish Date - Sep 21 , 2026 | 05:53 PM
మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్‌లో దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఇరుముడి చిత్రం థియేటర్లలో ఘన విజయం సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
మాస్ మహారాజా రవితేజ (Raviteja) కాంబినేషన్‌లో దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఇరుముడి (Irumudi) చిత్రం థియేటర్లలో ఘన విజయం సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అయితే థియేట్రికల్ రన్‌లో విశేష ఆదరణ పొందిన ఈ సినిమా, ఓటీటీలోకి వచ్చిన తర్వాత మాత్రం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఒక హిట్ సాధించిన సినిమాకు ఓటీటీ రిలీజ్ తర్వాత ఈ రేంజ్‌లో నెగెటివిటీ రావడం చాలా అరుదు. కానీ ఇరుముడి విషయంలో మాత్రం నెటిజన్లు సీన్ బై సీన్ జల్లెడ పడుతూ, లాజిక్కులు వెతుకుతూ పెద్ద ఎత్తున శల్యపరీక్ష చేస్తున్నారు.
అసలు మణమ్మ ఆ ఊరు ఎలా వెళ్లింది.. ? తల్లి ఏం చేస్తుంది.. ? పుష్పవతి అయ్యాక ఇంట్లో నుంచి అడుగుపెట్టకూడదు కదా.. ? ముఖ్యంగా సినిమాలో జరుగుతున్న వరుస దారుణాలు, హత్యల వ్యవహారంలో పోలీసులు ఏరీ? అనే పాయింట్‌పై నెటిజన్లు గట్టిగా ట్రోల్ చేస్తున్నారు. ఊళ్ళో స్కూల్ పాప ఆత్మహత్య, పొదల్లో అమ్మాయి శవం లభించడం, అజయ్ ఘోష్ కొడుకు హత్య, మణమ్మ చావు, ఊరి బయట ఆకతాయిల అకృత్యాలు.. ఇలా ఎన్ని దారుణాలు జరుగుతున్నా ఒక్క పోలీస్ కానిస్టేబుల్ కూడా ఎక్కడా కనిపించడు. స్కూల్, బస్సులు ఉన్న ఊర్లో పోలీస్ స్టేషన్ ఉండదా.. అక్కడ లేకపోతే ఆ చుట్టూ పక్కల ఊరులో అయినా ఉండాలి కదా. మచ్చుకైనా ఒక్క పోలీస్ కనిపించకపోవడంతో ఇంట్లో కూర్చుని ఓటీటీలో చూస్తున్న ప్రేక్షకులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు శివ నిర్వాణ ఈ పోలీస్ లాజిక్‌పై స్పందిస్తూ వివరణ ఇచ్చాడు. 'నేను ప్రేక్షకులు అనుభూతి చెందాల్సిన కథ,సెంటిమెంట్ మీద మాత్రమే దృష్టి పెట్టాను. కథలోకి పోలీసులను తీసుకొస్తే ప్రేక్షకులు ఇన్వెస్టిగేషన్ కోణంలో ఆలోచిస్తారు, దానివల్ల ఎమోషన్ దెబ్బతింటుంది. పైగా కథలో ఎమ్మెల్యేనే ఈ నేరాలకు కారణం కాబట్టి, ఆయనే పోలీసులను రాకుండా చేసి ఉండవచ్చనే యాంగిల్‌లో ప్రేక్షకులు అర్థం చేసుకోవచ్చు' అని చెప్పుకొచ్చాడు.
అయితే సక్సెస్ వచ్చినప్పుడు ఇలాంటి లాజిక్స్ పక్కకు వెళ్ళిపోవడం సహజమే. కానీ ఓటీటీ వర్షన్ అందుబాటులోకి వచ్చాక జనాలు సందు దొరికితే చాలు ట్రోల్స్ చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు. హిట్‌లో ఉన్నప్పుడు తర్కానికి చోటు ఉండదు కానీ, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో మాత్రం ప్రతి చిన్న పాయింట్ సీరియస్ డిస్కషన్‌గా మారుతుందనడానికి ఇరుముడిపై జరుగుతున్న ఈ చర్చలే నిదర్శనం.