సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

శేఖర్ మోడల్ హీరోగా “ఒక్క అడుగు” మూవీ ఫస్ట్ లుక్ లాంచ్

ABN, Publish Date - May 28 , 2026 | 09:31 PM

శేఖర్ మోడల్ హీరోగా, దర్శకుడిగా తెరకెక్కిస్తున్న “ఒక్క అడుగు” చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్‌ను సినీ ప్రముఖులు విఎన్ ఆదిత్య, సముద్ర, అశోక్ కుమార్ చేతుల మీదుగా విడుదల చేశారు.

సిరి క్రియేషన్స్ బ్యానర్‌పై శేఖర్ మోడల్ రచించి, దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తున్న చిత్రం “ఒక్క అడుగు”. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తుండగా, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. రాఘవేందర్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌ను సినీ ప్రముఖులు విఎన్ ఆదిత్య, అశోక్ కుమార్, సముద్ర, పద్మిని నాగులపల్లి, రామ సత్యనారాయణ, సత్య మాస్టర్ చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు మురళి మాట్లాడుతూ, దర్శకుడు శేఖర్ మోడల్‌కు ఉన్న కమాండ్ ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఒక టీచర్‌గా ఆయనలో ఉన్న క్రమశిక్షణ, సినిమా పట్ల ఉన్న అంకితభావం ప్రత్యేకంగా కనిపించాయని చెప్పారు. సత్య మాస్టర్ మాట్లాడుతూ, కొత్త ప్రతిభను ప్రోత్సహించే ఉద్దేశంతో శేఖర్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. “ఒక్క అడుగు” చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టాలని, ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సాధించాలని ఆకాంక్షించారు. ఎంవి రఘు మాట్లాడుతూ, ఈ సినిమా అన్ని విధాలా విజయవంతం కావాలని, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

నిర్మాత పద్మిని నాగులపల్లి మాట్లాడుతూ, రచయితగా, దర్శకుడిగా, నటుడిగా శేఖర్ మోడల్ చేస్తున్న ఈ ప్రయత్నం అభినందనీయం అన్నారు. కథ కొత్తదనంతో ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని చెప్పారు. ఫిలిం ఛాంబర్ సెక్రటరీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, ఒక సినిమాను నిర్మించడం ఎంత కష్టమో తెలుసునన్నారు. అన్ని బాధ్యతలు స్వయంగా తీసుకుని “ఒక్క అడుగు” సినిమాను తెరకెక్కించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేది కంటెంట్ మాత్రమేనని, ఈ చిత్రంలో ఆ బలం ఉందని నమ్మకం వ్యక్తం చేశారు. దర్శకుడు సముద్ర మాట్లాడుతూ, “ఒక్క అడుగు” అనే టైటిల్‌కు ప్రత్యేకమైన విలువ ఉందన్నారు. ఈ టైటిల్‌తో వస్తున్న చిత్రం మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు.

దర్శక మండలి అధ్యక్షుడు విఎన్ ఆదిత్య మాట్లాడుతూ, నటుడు, నిర్మాత, దర్శకుడు అనే మూడు బాధ్యతలను ఒకేసారి చేపట్టడం సాహసోపేతమైన విషయం అన్నారు. శేఖర్ మోడల్ తన ప్రతిభను ఈ చిత్రంతో నిరూపించుకోవాలని ఆశీర్వదించారు. డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ, శేఖర్ మోడల్ మల్టీ టాలెంటెడ్ వ్యక్తి అని, ప్రొడక్షన్‌పై మంచి అవగాహన కలిగి ఉన్నారని తెలిపారు. “ఒక్క అడుగు” చిత్రానికి మంచి విజయం దక్కాలని కోరుకున్నారు. నటుడు, దర్శక నిర్మాత శేఖర్ మోడల్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. చిత్ర పరిశ్రమలో అవకాశాలు సులభంగా రావని, తనకు తానే ఒక అవకాశం సృష్టించుకునే ప్రయత్నమే “ఒక్క అడుగు” అని అన్నారు. ఈ సినిమా కోసం అన్ని విభాగాలపై అవగాహన పెంచుకుని ఎంతో కష్టపడ్డానని చెప్పారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించే ఉద్దేశంతో ఆడిషన్స్ నిర్వహించి టాలెంట్ ఉన్న వారిని ఎంపిక చేసుకున్నామని తెలిపారు. ప్రేక్షకుల ఆశీర్వాదంతో సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - May 28 , 2026 | 09:31 PM