ఆ ముగ్గురిని లైఫ్‌లో.. అసలు మర్చిపోకండి
ABN, Publish Date - Mar 27 , 2026 | 12:46 PM
నమ్మకం, కృషి, పట్టుదల ఉంటే విజయాలు సాధించవచ్చునని సినీనటుడు శర్వానంద్ (Sharwanand) విద్యార్థులకు పిలుపునిచ్చారు.
నమ్మకం, కృషి, పట్టుదల ఉంటే విజయాలు సాధించవచ్చునని సినీనటుడు శర్వానంద్ (Sharwanand) విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఏపీ కురబలకోట మండలంలోని మిట్స్ యూనివర్శిటీలో రెండు రోజుల జాతీయ టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ అశ్వ్-2కె26 కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పక్కవారితో పోల్చి నిరుత్సాహ పరచడం మానుకోవాలని, పిల్లలకి మేమున్నామనే భరోసా ఇవ్వాలన్నారు.
పిల్లలను ఉత్సాహపరిస్తే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని తెలిపారు. విద్యార్థులు జీవితంలో ఒక నిర్ధిష్ట లక్ష్యాన్ని ఏర్పరచుకుని సాధించడానికి కృషి చేయాలన్నారు. జీవితం విషయంలో ఎదుటివాడు చెప్పేది వినకండి.. మీకు నచ్చింది చేయండి సక్సెస్ కొట్టండి అన్నారు. మీ లైఫ్‌లో.. మీ కష్టంలో మీతో ఉన్న వాళ్లు, మీరు కష్టంలో ఉన్నప్పుడు వదిలేసిన వాళ్లు, మిమ్మల్ని కష్టంలోకి నెట్టిన వాళ్లు ఈ ముగ్గురిని మాత్రం అసలు మర్చిపోవద్దని అన్నారు. మొదట్లో అందరూ నన్ను పనికిరావు అన్నారని కానీ ఇప్పుడు నేనే 36 సినిమాలు చేసి చూపించానని తెలిపారు.
అనంతరం ఆయనను వర్సిటీ యాజమాన్యం సన్మానించింది. ఆయనతో సెల్ఫీలు తీసుకోవడానికి విద్యార్థులు ఎగబడ్డారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జబర్థస్త్ టీం సద్దాం, బిందాస్ భాస్కర్, నవసందీప్, జబర్థస్ పులి తమ కామెడీతో అలరించారు. క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా, ఛాన్సులర్ ఎన్. విజయభాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సులర్ నాదెళ్ల ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, ప్రిన్సిపాల్ సి.యువరాజ్ పాల్గొన్నారు.
బైకర్ చిత్రాన్ని ఆదరించండి..
బైకర్ (BIKER) చిత్రాన్ని ఆదరించాలని హీరో హీరోయిన్లు శర్వానంద్, మాళవిక నాయర్ (Malvika Nair) కోరారు. గురువారం మిట్స్ యూనివర్సిటీలో చిత్ర యూనిట్ సందడి చేసింది. ఆయన మాట్లాడుతూ కుటుంబ సమేతంగా చూడదగ్గ కథాంశం, విలువలతో కూడిన వినోదంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చెప్పారు. అనంతరం సినిమాలోని పాటకు హీరో హీరోయిన్లతో కలిసి విద్యార్థులు డ్యాన్సులు చేసి, ఆకట్టుకున్నారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు వారు సమాధానం చెప్పారు.