హోంబలే ఫిల్మ్స్ నుంచి మరో భారీ ప్రాజెక్ట్.. ఏఐ టెక్నాలజీతో ‘శరణాగతి’ యానిమేషన్ మూవీ!
ABN , Publish Date - Nov 10 , 2026 | 06:01 PM
హోంబలే ఫిల్మ్స్, ట్రాన్స్‌సెండెంటల్ ఫిల్మ్స్ సంయుక్తంగా ‘శరణాగతి – ది లైఫ్ ఆఫ్ ఎ సరెండర్డ్ సోల్’ యానిమేషన్ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. ఏఐ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఈ సినిమా 2027 ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
'కెజీఎఫ్', ‘సలార్’, ‘కాంతార’ వంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్స్‌తో పాటు, ‘మహావతార్ నరసింహ’ వంటి విభిన్నమైన కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన హోంబలే ఫిల్మ్స్.. భారతీయ సినిమాకు కొత్త దారులు చూపిస్తూ ముందుకు సాగుతోంది. తాజాగా అత్యాధునిక ఎ.ఐ. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందుతున్న యానిమేషన్ చిత్రం ‘శరణాగతి’ని ఈ సంస్థ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది.
ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ (ISKCON) వ్యవస్థాపక ఆచార్యులు హిస్ డివైన్ గ్రేస్ ఏ.సి. భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల అసాధారణ జీవితం, ఆధ్యాత్మిక సేవా ప్రస్థానానికి ఘనమైన నివాళిగా ‘శరణాగతి – ది లైఫ్ ఆఫ్ ఎ సరెండర్డ్ సోల్’ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు హోంబలే ఫిల్మ్స్, ట్రాన్స్‌సెండెంటల్ ఫిల్మ్స్ ప్రకటించాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ విజన్ టెక్నాలజీలను కలిపి మనుషుల కదలికలను డిజిటల్ యానిమేషన్‌గా మార్చే ఈ ఆధునిక సాంకేతికత.. యానిమేషన్ పాత్రలకు మరింత సహజత్వం, భావోద్వేగాలను తీసుకొస్తుంది.
1965లో తన 69వ ఏట శ్రీల ప్రభుపాదులు భారతదేశం నుంచి అమెరికాకు ప్రయాణం ప్రారంభించారు. భగవద్గీతలోని శాశ్వతమైన బోధనలు, శ్రీకృష్ణుడి సందేశాన్ని ప్రపంచానికి చాటాలనే సంకల్పంతో ఆయన ఈ ప్రయాణం చేశారు. తన ఆధ్యాత్మిక గురువైన శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతీ ఠాకూర్ ఇచ్చిన ఆదేశాన్ని అనుసరిస్తూ ప్రారంభించిన ఈ ప్రస్థానం.. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి కృష్ణ చైతన్య సందేశాన్ని చేరవేసే మహోద్యమంగా మారింది. అచంచలమైన విశ్వాసం, సంపూర్ణ శరణాగతి, పట్టుదల, నిస్వార్థ సేవకు శ్రీల ప్రభుపాదుల జీవితం ఒక గొప్ప నిదర్శనంగా నిలుస్తుంది.
ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘శరణాగతి’ చిత్రానికి గౌర శక్తి దాస రచన, దర్శకత్వం వహిస్తున్నారు. రాజేష్ సింగ్, లోహిత్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శ్రీధర్ శికారిపుర విజువల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. డైవ్ డీప్ ఎ.ఐ. స్టూడియోతో కలిసి ట్రాన్స్‌సెండెంటల్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని సమర్పించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ చేయనుంది. శ్రీ నరసింహ చైతన్య మఠం, శ్రీరంగపట్నం, ఇస్కాన్ బెంగళూరు, ఇస్కాన్, భక్తివేదాంత బుక్ ట్రస్ట్ (BBT) ఆశీస్సులతో ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది. శ్రీల ప్రభుపాదుల వ్యాస పూజ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని 2027 ఆగస్టులో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.
ఇవి కూడా చదవండి:
మూడోసారి విడాకులు?.. పవన్ కళ్యాణ్ మరో యుద్ధం చేయాల్సిందే
సూర్య నెక్ట్స్ ప్రాజెక్ట్‌కు టైటిల్ ఫిక్స్.. మరో హిట్ రాసిపెట్టుకోండమ్మా
విజయ్ సేతుపతి జైత్రయాత్ర.. వరుస రిలీజ్‌లతో ఫుల్ బిజీ