Priyanka Nalkari: నా చేతులారా కెరీర్ ని నాశనం చేసుకున్నాను
ABN , Publish Date - Jun 03 , 2026 | 08:32 PM
తెలుగు బుల్లితెర నటి ప్రియాంక నల్కరి (Priyanka Nalkari) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఆహ్వానం, మేఘమాల, మంగమ్మ గారి మనవరాలు, శ్రావణ సమీరాలు వంటి సీరియల్స్‌లో నటించి మెప్పించింది.
తెలుగు బుల్లితెర నటి ప్రియాంక నల్కరి (Priyanka Nalkari) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఆహ్వానం, మేఘమాల, మంగమ్మ గారి మనవరాలు, శ్రావణ సమీరాలు వంటి సీరియల్స్‌లో నటించి మెప్పించింది. అయినా ఇక్కడ ఆమెకు అంత ఆశించిన గుర్తింపు రాలేదు. ఆ తరువాత యాంకర్ గా మారి గెటప్ శ్రీనుతో కలిసి సినిమా చూపిస్తా మావా అనే షో చేసింది. అది ఆమెను స్టార్ ని చేయలేకపోయింది. ఇక వెండితెరపై అందరి బంధువయ సినిమాతో పరిచయమై.. శివ మనసులో శృతి (SMS) లో సుధీర్ బాబు చెల్లెలి పాత్రలో నటించి.. ఆ తర్వాత కిక్ 2, హైపర్, నేనే రాజు నేనే మంత్రి వంటి తెలుగు సినిమాలతో పాటు, లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన కాంచన 3 సినిమా ద్వారా తమిళ్ ఇండస్ట్రీలోనూ చిన్న పాత్రలు చేసింది.
తెలుగులో అవకాశాలు రావడం లేదని తమిళ్ లో అడుగుపెట్టిన ప్రియాంక అక్కడ స్టార్ హీరోయిన్ గా మారింది. సన్ టీవీలో ప్రసారమైన రోజా తమిళ సీరియల్ ఆమె కెరీర్‌ను పూర్తిగా మలుపు తిప్పింది. ఈ సీరియల్‌లో రోజా పాత్రతో తమిళనాడులో ఆమె విపరీతమైన క్రేజ్ సంపాదించుకుని, టాప్ టెలివిజన్ నటీమణులలో ఒకరిగా కొనసాగుతోంది. తాజాగా ప్రియాంక తెలుగు యూట్యూబ్ ఛానెల్ కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తన మనోగతాన్ని మొత్తం చెప్పుకొచ్చింది.
తన కెరీర్ ని చేజేతులారా తానే నాశనం చేసుకున్నట్లు తెలిపింది. ఇప్పటికీ తెలుగువారు తనకు అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ' తమిళ్ లో నేను స్టార్ హీరోయిన్ అని నిరూపించుకున్నా.. ఇప్పటికైనా తెలుగులో నాకు అవకాశాలు వస్తాయని చూస్తున్నా. చాలామంది నేను ఫారిన్ లో సెటిల్ అయ్యాను అనుకుంటున్నారు. నేను ఇండియాలోనే ఉన్నాను. ఇండస్ట్రీలో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటే.. బ్రేక్ అస్సలు తీసుకోవద్దు. నేను అదే తప్పు చేశాను. నా జీవితాన్ని నేనే చేజేతులారా నాశనం చేసుకున్నాను' అని తెలిపింది.