సెప్టెంబర్ 24.. ఈ తేదీకి ఏదో లెక్క ఉంది! ‘ద ప్యారడైజ్‌’పై పెరుగుతున్న ఆసక్తి

ABN , Publish Date - Sep 19 , 2026 | 05:40 PM

కాలగమనంలో ప్రతి తేదీకి ఓ చరిత్ర ఉంటుంది. సెప్టెంబర్ 24వ తేదీ అనగానే 'మార్స్ ఆర్బిట్'లోకి ఇండియా ప్రవేశించడం ఓ హిస్టరీ. సినిమాల విషయానికి వస్తే - 1971లో ఆ తేదీ ఓ స్టార్ ప్రొడ్యూసర్ ను నిలిపింది.

కాలగమనంలో ప్రతి తేదీకి ఓ చరిత్ర ఉంటుంది. సెప్టెంబర్ 24వ తేదీ అనగానే 'మార్స్ ఆర్బిట్'లోకి ఇండియా ప్రవేశించడం ఓ హిస్టరీ. సినిమాల విషయానికి వస్తే - 1971లో ఆ తేదీ ఓ స్టార్ ప్రొడ్యూసర్ ను నిలిపింది. 2003లో మెగాస్టార్ కు మరపురాని విజయాన్ని అందించింది. ఇప్పుడు అదే తేదీన నాని 'ద ప్యారడైజ్' వస్తోంది. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ...!

'ప్రేమనగర్' వెలసిన రోజు...

వాస్తవానికి ఏ ప్రొడ్యూసర్ అయినా తమ సినిమాకు ఫ్రైడే రిలీజ్ ను ఎంచుకుంటూ ఉంటారు. అయితే కొందరు తమకు అచ్చివచ్చిన సంఖ్యను బట్టి సినిమాలను రిలీజ్ చేస్తూ ఉంటారు.ఆ తీరునే ఇప్పుడు నాని హీరోగా తెరకెక్కిన 'ద ప్యారడైజ్'ను విడుదల చేస్తున్నారని చెప్పవచ్చు. సెప్టెంబర్ 24వ తేదీన ఈ చిత్రం జనం ముందుకు వస్తోంది. ఆ రోజు గురువారం. భారీ వ్యయంతో రూపొందిన నాని తొలి చిత్రం కాబట్టి శుక్రవారం కంటే ఓ రోజు ముందుగానే 'ద ప్యారడైజ్'ను రిలీజ్ చేస్తున్నారని టాక్. అయితే టాలీవుడ్ లో సెప్టెంబర్ 24వ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. 1971లో సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మించిన నవలా చిత్రం 'ప్రేమనగర్' అదే రోజున విడుదలై విజయవిహారం చేసింది. అప్పట్లో 'ప్రేమనగర్' చిత్రాన్ని భారీ వ్యయంతో నిర్మించారు డి.రామానాయుడు. ఆ సినిమా రిజల్ట్ ను బట్టి చిత్రసీమలో ఉండాలో లేదో తేలిపోతుందని రామానాయుడు భావించారు. ఆ సినిమా హిట్ అయితే చిత్రసీమలో కొనసాగాలని, లేని పక్షంలో ఏదైనా వ్యాపారం చేసుకోవాలని నాయుడు అనుకున్నారు. అయితే 'ప్రేమనగర్' సినిమా అనూహ్య విజయం సాధించింది...దాంతో రామానాయుడు చిత్రసీమలోనే కొనసాగారు. తరువాత అనేక విజయవంతమైన చిత్రాలు నిర్మించి 'స్టార్ ప్రొడ్యూసర్' అనిపించుకున్నారు... గిన్నిస్ బుక్ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్స్ లోనూ స్థానం సంపాదించారు.


చిరంజీవి ఫ్యాన్స్ కూ గుర్తుండే రోజు...


'ప్రేమనగర్' రిలీజైన 10 ఏళ్ళకు అదే తేదీన రామానాయుడు 'ప్రేమమందిరం' చిత్రాన్ని రిలీజ్ చేశారు. 'ప్రేమనగర్' హీరో ఏయన్నార్ తోనే 'ప్రేమమందిరం' తెరకెక్కింది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన 'ప్రేమమందిరం' 1981 సెప్టెంబర్ 24న విడుదలైంది. అయితే 'ప్రేమనగర్' పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా రిలీజైన 'ప్రేమమందిరం' అలరించలేకపోయింది. దీన్ని బట్టి తేదీలో ఏముంది? అనే అనుమానాలు రావచ్చు. అదే తేదీన 2003లో చిరంజీవి హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో మధు నిర్మించిన 'ఠాగూర్' రిలీజయింది. ఈ మూవీ ఘనవిజయం  సాధించి దాదాపు 190కి పైగా కేంద్రాలలో శతదినోత్సవం చూసింది. చిరంజీవి కెరీర్ లో ఇప్పటికీ అత్యధిక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న చిత్రంగా 'ఠాగూర్' నిలచింది. చిత్ర నిర్మాత మధు పేరు ముందు 'ఠాగూర్' స్థానం సంపాదించింది. అందువల్ల సెప్టెంబర్ 24వ తేదీ అనేది చిరంజీవి ఫ్యాన్స్ కు కూడా మరపురాని తేదీగా మిగిలిపోయింది. 2014 సెప్టెంబర్ 24వ తేదీన భారతదేశం 'మార్స్ ఆర్బిట్ మిషన్'ను మార్స్ కక్షలోకి విజయవంతంగా ప్రయోగించింది. అలా మార్స్ ఆర్బిట్ లో ప్రవేశించిన మొదటి ఆసియా దేశంగా భారత్ చరిత్రలో నిలచింది. దాంతో ఎంతోమందికీ సెప్టెంబర్ 24వ తేదీ గుర్తుండి పోయింది. అదే తేదీన ఇప్పుడు నాని 'ద ప్యారడైజ్' విడుదల కానుంది. అందువల్ల సినీ ఫ్యాన్స్ లో ఆసక్తి చోటు చేసుకుంది...

ఏమవుతుందో మరి...!

యాభై ఐదేళ్ళ క్రితం 'ప్రేమనగర్' ఘనవిజయం, నలభై ఐదేళ్ళ నాటి 'ప్రేమమందిరం' నిరాశ, ఇరవై మూడేళ్ళ నాటి 'ఠాగూర్' అఖండ విజయం, పుష్కరం నాటి 'మార్స్ ఆర్బిట్' గ్రాండ్ సక్సెస్- ఇవన్నీ పరిశీలిస్తే సెప్టెంబర్ 24కు లక్ పాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే తేదీన ఇప్పుడు 'ద ప్యారడైజ్' ప్రేక్షకుల ముందుకు వస్తోంది... ఈ తేదీని ఎంచుకున్న హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి ఏ స్థాయి సక్సెస్ అందుకుంటారో చూడాలి...

ALSO READ:

Chiranjeevi: చిరంజీవి నన్ను చెప్పుతో కొట్టినా ఫీలవ్వను.. కానీ అందుకు ఫీలయ్యా

Irumudi: 250 కోట్ల సినిమా.. అసలు లాజిక్స్ లేకుండా ఎలా తీశార్రా బాబు

Updated Date - Sep 19 , 2026 | 06:14 PM