‘సీతా పయనం’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ABN, Publish Date - Mar 17 , 2026 | 09:41 PM
నటుడు అర్జున్ సర్జా (Arjun Sarja) దర్శకత్వం వహించి, నటించిన చిత్రం ‘సీతా పయనం’. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
నటుడు అర్జున్ సర్జా (Arjun Sarja) దర్శకత్వం వహించి, నటించిన చిత్రం ‘సీతా పయనం’ (Seetha Payanam). ఈ సినిమాతో ఆయన కుమార్తె ఐశ్వర్య (Aishwarya Arjun) హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచమయ్యారు. కన్నడ నటుడు ఉపేంద్ర సోదరుడి కుమారుడు నిరంజన్ కథానాయకుడిగా నటించాడు. గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఉగాది సందర్భంగా ఈనెల 19 నుంచి ‘సన్ నెక్స్ట్’ (SunNxt)లో స్ట్రీమింగ్ అవ్వబోతోంది.
కథేంటంటే:
సీత (ఐశ్వర్య అర్జున్ Aishwarya Arjun) తల్లి లేని పిల్ల. మల్టీమిలియనీర్ రాజేంద ప్రసాద్ (సత్యరాజ్ Satya Raj) ఆ లోటు తెలియకుండా కూతురుని పెంచుతాడు. షెఫ్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సీత ఒకసారి వైజాగ్ నుండి హైదరాబాద్‌కు కారులో ప్రయాణిస్తుంది. కారు బ్రేక్ డౌన్ కావడంతో అభి (నిరంజన్) అనే కుర్రాడు హైదరాబాద్ వరకూ లిఫ్ట్ ఇవ్వమని ఆమెను కోరడంతో మొదట కాస్తంత హెజిటేట్ చేసినా చివరకు అంగీకరిస్తుంది. ఆ దారిలో ఒకరి గురించి ఒకరికి మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. సీతాపురం వెళ్ళే దారిలో అభిని దించి, సీత హైదరాబాద్ చేరుతుంది. సీత హాజరు కావాల్సిన వర్క్ షాప్ జరిగే హోటల్... ఆమె లోపలకు అడుగు పెట్టడానికి కొన్ని సెకన్ల ముందు భారీ అగ్ని ప్రమాదానికి గురవుతుంది. అందులోని వారంతా చనిపోతారు. కాస్తంత ఆలస్యంగా అక్కడకు రావడం వల్లే తను ప్రాణాలతో ఉన్నానని సీత భావిస్తుంది. వైజాగ్ నుండి హైదరాబాద్ వరకూ చేసిన ప్రయాణంలో తనకు తారసపడిన వారందరికీ ధ్యాంక్స్ చెప్పాలని అనుకుంటుంది. ఆ తిరుగు ప్రయాణం సీత జీవితంలో ఎలాంటి మార్పును తీసుకొచ్చింది? తల్లిలేని సీత... అభికి తన మనసులోని ప్రేమను తెలియచేసిందా? అసలు అభి ఆమె జీవితంలోకి ఎప్పుడు, ఎలా అడుగుపెట్టాడు? అందులో ఆమె తండ్రి పాత్ర ఏమిటీ? అనేది మిగతా కథ. ఈ సినిమా థియేటర్లలో పెద్దంత ఆదరణకు నోచుకోలేదు. మరి ఓటీటీలో ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.