Violence: హీరోయిజం అంటే రక్తపాతమేనా? మేకర్స్‌కు ప్రేక్షకుల ప్రశ్న!

ABN , Publish Date - Nov 02 , 2026 | 10:30 AM

గత కొంతకాలంగా చూస్తే ఇండియన్‌ సినిమాల్లో హింస, రక్తపాతం(Violence in movies).. ఇదే మెయిన్‌ థీమ్‌గా కనిపిస్తోంది. మాస్‌ ప్రేక్షకులను ఆకట్టుకునే పేరుతో కమర్షియల్‌ సినిమాల్లో హింసాత్మక సన్నివేశాలకు పెద్దపీట వేస్తున్నారు.

గత కొంతకాలంగా చూస్తే ఇండియన్‌ సినిమాల్లో హింస, రక్తపాతం(Violence in movies).. ఇదే మెయిన్‌ థీమ్‌గా కనిపిస్తోంది. మాస్‌ ప్రేక్షకులను ఆకట్టుకునే పేరుతో కమర్షియల్‌ సినిమాల్లో హింసాత్మక సన్నివేశాలకు పెద్దపీట వేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో ఈ ధోరణి కాస్త ఎక్కువగా కనిపిస్తోంది. హీరోలు ఆయుధాలు పట్టి విలన్‌లను చితకబాదడం, రక్తపాతం సృష్టించడం, క్రూరంగా హతమార్చడం వంటి సన్నివేశాలు సాధారణమైపోయాయి. ఇప్పుడు అదే సమస్యగా మారింది. సినిమాల్లో చూపించే హింస సమాజంపై ఎంతో ప్రభావం చూపిస్తోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా పిల్లలు, యువతపై వీటి ప్రభావం పడుతోందనే చర్చ మొదలైంది. సినిమా అనేది సృజనాత్మక స్వేచ్చ ఉన్న మాధ్యమం. కథనుబట్టి సినిమాటిక్‌ లిబర్టీ తీసుకోవడం మేకర్స్‌కు అలవాటు. అది హద్దు దాటకుండా ఉంటే మంచిది. కానీ మేకర్స్‌ హద్దు మీరి సినిమాలు తీస్తున్నారు. కథలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నామని చెబుతున్నారు. 

రాప్తాడు ఘటన ఓ ఉదాహరణ...

ఇప్పుడు సినిమాల్లో పెరుగుతున్న హింసాత్మక సన్నివేశాలు జనాల్ని ఆలోచింపజేస్తున్నాయి. హీరో పూర్తిగా లోడ్‌ చేసిన తుపాకీతో పాఠశాల తరగతి గదిలోకి వెళ్లే సన్నివేశాలను ఏవిధంగా చూడాలి? తెరపై అలాంటి సన్నివేశాలు స్టైలిష్‌గా, కథానుగుణంగా కనిపించినా.. వాస్తవ జీవితంలో అవి ఎంతటి ప్రమాదకర పరిణామాలకు దారి తీస్తున్నాయో ఆలోచించాల్సిన అవసరం ఉందని ఓ వర్గం ప్రేక్షకులు నిలదీస్తున్నారు.   అందుకు రాప్తాడులో ఘటన ఓ ఉదాహరణగా చెబుతున్నారు. తాజాగా రాప్తాడులోని ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకున్న దారుణ ఘటన అందరినీ కలచివేసింది. 21 ఏళ్ల యువకుడు ఓ చిన్నారిపై ఎలక్ర్టిక్‌ చైన్‌షాతో దాడి చేసిన ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ ఘటనకు ఏదైనా సినిమా స్ఫూర్తి అని నేరుగా చెప్పలేం. కానీ సినిమాల ప్రభావంతో ఇలా జరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఏడాది క్రితం మలయాళ సినిమా స్ఫూర్తితో ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో ఒకటి జరిగింది. ప్రమాదకర ఆయుధాలను ఉపయోగించే సన్నివేశాలు సినిమాల్లో ఎలా చూపిస్తున్నామనే అంశంపై కూడా ఇప్పుడు టాపిక్‌ నడుస్తోంది. తెరపై హీరో అలాంటి ఆయుధంతో చేసే విన్యాసాలను కొందరు కేవలం వినోదంగా చూడొచ్చు. కానీ మరికొందరైతే వాటిని అనుకరించే ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది  చేసిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా బలహీనమైన మనస్తత్వం ఉన్నవారిపై ఇలాంటి దృశ్యాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయనేది అంచనా వేయడం కష్టం.

ఓటీటీ, సోషల్‌ మీడియాతో మరింత ప్రభావం.. 

కొంతమంది ఈ సినిమాలకు సెన్సార్‌ బోర్డు ‘ఎ’ సర్టిఫికెట్‌ ఇచ్చిందని వాదించవచ్చు. కానీ థియేటర్లలో పెద్దలకు మాత్రమే పరిమితం చేసిన సినిమాలు కొద్ది రోజుల్లోనే ఓటీటీలోకి వస్తున్నాయి. అక్కడ పిల్లలు, టీనేజర్లు కూడా వాటిని చూసే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. సినిమాలోని హింసాత్మక సన్నివేశాలు సోషల్‌ మీడియాలో క్లిప్పుల రూపంలో విస్తృతంగా ప్రచారంలోకి వస్తున్నాయి. పిల్లలు, యువత రోజువారీ జీవితంలో సోషల్‌ మీడియా కీలకంగా మారిన నేపథ్యంలో ఇలాంటి దృశ్యాలు వారి దృష్టికి చేరకుండా నియంత్రించడం కూడా కష్టమే.

దర్శకుల ఆలోచన మారాలి.. 

ఇటీవల తెలుగులో వచ్చిన ‘ది ప్యారడైజ్‌’, రణబాలి, ‘కల్ట్‌’తోపాటు పలు చిత్రాలు విపరీతమైన వయలెన్స్‌తో తెరకెక్కినవే. ఆయా చిత్రాల్లో కథలో అవసరమైన చోట, అక్కర్లేని చోట కూడా విపరీతమైన హింసాత్మక సన్నివేశాలతో నింపేశారు దర్శకులు. ఈ సినిమాలేవీ కుటుంబ సభ్యులతో కలిసి చూసేలా లేవు. వీటి సక్సెస్‌ మాట కూడా అంతంత మాత్రమే! మాస్‌ ఇమేజ్‌, కమర్షియల్‌ హంగుల పేరుతో హింసను మరింత ఎక్కువగా చూపిస్తున్నారు. సినిమాల్లోని హింస సమాజంలో నేరాలకు కారణమని కాదు. వ్యక్తుల ప్రవర్తనపై కుటుంబ పరిస్థితులపై, సామాజిక వాతావరణం, వ్యక్తిగత మానసిక స్థితి వంటి అనేక అంశాలపై ప్రభావం చూపుతాయి. అయినప్పటికీ హింసను ఎలా చిత్రీకరిస్తున్నాం? దాన్ని ఎంతవరకు గ్లామరైజ్‌ చేస్తున్నాం? అనే విషయాల్లో దర్శకనిర్మాతలు కాస్త బాఽధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రేక్షకులను అలరించడం ఎంత ముఖ్యమో.. సమాజంపై తమ సినిమాల ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకోవడం కూడా అంతే ముఖ్యమని, ఈ విషయంతో దర్శకులు మారాలని సూచిస్తున్నారు. 

ఒకప్పుడు ఈ తరహా రక్తపాతాలు లేకుండా సినిమాలు ఆడాయని, సూపర్‌సక్సెస్‌ అయ్యాయని చెబుతున్నారు ప్రేక్షకులు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌, వినోదాత్మక చిత్రాలు, హారర్‌ థ్రిల్లర్‌ ఇలా చాలా జానర్‌ చిత్రాలు ప్రేక్షకులను అలరించినవే. మరి ఇప్పుడెందుకు ఇంతటి హింస, రక్తపాతాలు అని మేకర్స్‌ని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాల్లో హింసాత్మక సన్నివేశాల మోతాదుపై ప్రభుత్వాలు, సెన్సార్‌ బోర్డ్‌ సంస్థలు, చిత్ర పరిశ్రమ మరోసారి ఆలోచించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


ఇవి కూడా చదవండి:

టాలీవుడ్ స్టార్ హీరోలూ.. సూర్య, ధనుష్‌లను చూసి నేర్చుకోండయ్యా..

King: ‘కింగ్‌’.. ఫస్ట్‌ సాంగ్‌.. చూసేయండి

డ్రాగన్' కోసం 'ధురంధర్' మ్యూజిక్ డైరెక్టర్



Updated Date - Nov 02 , 2026 | 11:33 AM