ఆసుపత్రిలో వేటూరి.. 'దొరకునా ఇటువంటి సేవ' పాట వెనకున్న కథ

ABN , Publish Date - Feb 22 , 2026 | 01:47 PM

తెలుగులో ఒకప్పుడు సినిమా నవలలు వచ్చేవి. టీవీలు, మొబైల్స్‌, ఇంటర్నెట్‌ వంటివి ఇంకా రాకపోవటం వల్ల ఈ నవలలకు మంచి ఆదరణ ఉండేది. అలాంటి ఒక నవలే- ప్రముఖ దర్శకుడు వంశీ రాసిన ‘శంకరాభరణం’.

తెలుగులో ఒకప్పుడు సినిమా నవలలు వచ్చేవి. టీవీలు, మొబైల్స్‌, ఇంటర్నెట్‌ వంటివి ఇంకా రాకపోవటం వల్ల ఈ నవలలకు మంచి ఆదరణ ఉండేది. అలాంటి ఒక నవలే- ప్రముఖ దర్శకుడు వంశీ (Vamsi) రాసిన ‘శంకరాభరణం’ Sankarabharanam) . ఈ సినిమా దర్శకత్వ శాఖలో పనిచేసిన వంశీ- మొత్తం కథను నవల రూపంలోకి మార్చారు. రెండున్నర గంటల సినిమాకు వంద పేజీల ప్రతిరూపం ఈ పుస్తకం. దీనిలోనే ఈ సినిమా తీసే సమయంలో తెర వెనుక జరిగిన అనేక ఆసక్తికరమైన సన్నివేశాలను కూడా పాఠకులకు అందించారు. ఈ పుస్తకాన్ని ఈ నెల 18వ తేదీన కె. విశ్వనాధ్‌ జయంతి (K Vishwanath) సందర్భంగా ఆవిష్కరించారు. ఆ పుస్తకంలో ఒక ఆసక్తికరమైన భాగం మీ కోసం...

‘అన్ని పాటలూ ముందే రికార్డు చేసినా ఒక్క క్లైమాక్స్‌ సాంగ్‌ మాత్రం తర్వాత చేద్దాం అని వదిలేశారు. దానికి కారణం మహదేవన్‌ ఇచ్చిన డేట్స్‌ చాలకనే. ఆ పాట చాలా గొప్పగా రావాలి అన్నారు డైరక్టర్‌ గారు. నిజంగా అది అద్భుతంగా రాయాలి అనుకున్నారు వేటూరి. ఆ- గగూర్పొడిచే సిట్యుయేషన్‌కి గొప్ప ట్యూన్‌ ఇవ్వాలని యోచించారు మహదేవన్‌. ఇవన్నీ జరగాలంటే మంచి టైమ్‌ కావాలి. అందుకే ఆ పాట తరువాత చేద్దాం అనుకున్నారు. ఆఖరి షెడ్యూల్‌ టైము దగ్గర పడింది. ఆ షెడ్యూల్‌లోనే పాట తియాలి. కానీ వేటూరిగారికి హెల్త్‌ కండిషన్‌ బాగోక విజయా హాస్పిటల్‌ డీలక్స్‌ వార్డులో అడ్మిట్‌ చేశారు. వారం రోజుల్లో ఆయన శారీరక పరిస్థితి కాస్త బాగుపడింది. అయినా డాక్టర్లు ఆయన్ని కదలవద్దని కండిషన్‌ పెట్టారు. ఓ రోజు ఆయన మా ఆఫీసుకు ఫోన్‌ చేసి తన పరిస్థితి చెప్పి పాట ఇస్తాను ఎవర్నయినా పంపమన్నారు. నాగేశ్వరరావుగారు ఆ విషయాన్ని డైరక్టర్‌ గారికి చెప్పారు. ఆయన నన్ను పంపమన్నారట. నేను హాస్పటల్‌కి వెళ్లేసరికి వేటూరిగారు బెడ్‌ మీద పడుకొని చాలా హీనస్వరంతో బి.పి. చూస్తున్న నర్స్‌కి జవాబు చెబుతున్నారు. ఆమె వెళ్లాక వేటూరిగారన్నారు- ‘‘నా కండీషనేం బాగోలేదు. అయినా ఆ క్లైమాక్స్‌ సాంగ్‌ రాసి చచ్చిపోయినా బాధలేదు’’. ఆ సీరియస్‌ కండిషన్‌లో ఆయనలా మాట్లాడ్తుంటే అన్పించింది శంకరాభరణం మీద ఆయనకున్న గౌరవం, ఇష్టం ఎంత గొప్పదో అని. చాలా సేపయ్యాక ఆయన పాట గురించి ఆలోచించటం మొదలుపెట్టారు. చాలా సేపయ్యాకా నెమ్మదిగా ఆయన డిక్టేట్‌ చేశారు.


'దొరకునా ఇటువంటి సేవ.. నీపద రాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము సేయు త్రోవ..’- ‘ఎలాగుంది?’ అని అడిగారు. ‘బావుంది సార్‌’’ సమాధానమిచ్చాను. ‘మొదటిలైను త్యాగరాజుదిలే.. చరణం రాసుకో’ అన్నారు. ‘‘రాగాలంతాలు నీ వేయిరూపాలు.. భవరోగ తిమిరాన పోకార్చు దీపాలు.. నాదాత్మకుడవై నాలోన చెలగి.. నా ప్రాణ దీపమై నాలోన వెలిగి.. నిను కొల్చువేళ దేవాదిదేవ.. దోరకునా ఇటువంటి సేవ..’’ అని చెప్పి రెండో చరణం గురించి కాసేపు ఆలోచించి అన్నారు. ‘గోపాలుడవై నావు గోవబాలుడవైనావు.. గోకులం నీ సొంతం చేసుకున్నావు’ అంటూ రెండో చరణం చెప్పారు. ఆ తర్వాత రెండు రోజులకు అంతవరకు అయిన పిక్చర్‌ చూసి - ‘ఆ రెండో చరణం బావులేదు. దాన్ని మార్చాలి’ అని వేరే చరణం రాశారు. ఆ తర్వాతి కాలంలో- ‘ఆ పాటలు రాయటానికి మీరు చాలా శ్రమించి ఉంటారు కద సార్‌’ అని అడిగిన వాళ్లకు ఆయనిచ్చిన జవాబు- ‘చాలా సుఖంగా హాయిగా రాశాను. రెగ్యులర్‌గా రాసే వాటికి పడ్డ కష్టం వీటికి పడలేదు’. ఆయన టేస్ట్‌ ఏ అంచునుందో ఆ మాట ద్వారా అర్థమవుతుంది. అయినా ఆయనది కావ్యాల కోసం వినియోగించే పాండిత్యం. మరి అభిరుచి అటుగాక ఇటెందుకు ఉంటుంది? ’


శంకరాభరణం

రచయిత: వంశీ

ప్రచురణ: సాహితీ ప్రచురణలు

అన్ని ప్రముఖ పుస్తక దుకాణాల్లో లభిస్తుంది

Updated Date - Feb 22 , 2026 | 03:56 PM