Veta: సందీప్ సరోజ్ హీరోగా వేట.. దేనికోసం..
ABN, Publish Date - Aug 31 , 2026 | 03:34 PM
సందీప్ సరోజ్, సాత్విక జంటగా నటిస్తున్న ‘వేట’ చిత్రం సోమవారం రామానాయుడు స్టూడియోలో పూజ కార్యక్రమాలతో మొదలైంది.
సందీప్ సరోజ్, సాత్విక జంటగా నటుస్తున్న చిత్రం ‘వేట’. అశోక్ కోటిపల్లి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఎస్ఆర్‌డి ప్రొడక్షన్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఫణి అడపాక, జయలక్ష్మీ అడపాక నిర్మిస్తున్నారు. సోమవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. కొణిదెల నాగబాబు, కేఎస్ రవి కుమార్, వీఎన్ ఆదిత్య, మెహర్ రమేష్, సాయి రాజేష్, ఎస్‌కేఎన్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి నాగబాబు స్క్రిప్ట్ అందజేయగా.. కేఎస్ రవి కుమార్ క్లాప్ కొట్టారు. సాయి రాజేష్, ఎస్‌కేఎన్, వీఎన్ ఆదిత్య, ఫణి అడపాక కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
సందీప్ సరోజ్ మాట్లాడుతూ 'కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో అందరికీ పరిచయం అయ్యాను. ఇప్పుడు చేస్తున్న ‘వేట’ అనేది చిరంజీవి గారి టైటిల్. మా ఈ కథకి ఈ టైటిల్ యాప్ట్‌గా ఉంటుందని పెట్టాం' అని అన్నారు.
కేఎస్ రవి కుమార్ మాట్లాడుతూ ‘డైరెక్టర్ అశోక్ గారు ‘వేట’ కథని నాకు కాల్‌లో వివరించారు. కథ అద్బుతంగా అనిపించింది. అందరూ కొత్త వాళ్లు కలిసి పని చేస్తున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో ఊర్లో పెద రాయుడు టైపు పాత్ర నాది.ఈ కారెక్టర్ బాగా నచ్చింది. జెన్ జీ ఆడియెన్స్‌కి కూడా ఈ సినిమా నచ్చుతుంది' అని అన్నారు.
నిర్మాత ఫణి అడపాక మాట్లాడుతూ ‘‘ఈటీవీ విన్‌తో కలిసి చేస్తున్న మూడో ప్రాజెక్ట్. ‘కమిటీకుర్రోళ్లు’ చిత్రంలానే ఇది కూడా ఓ గ్రామీణ కథ. అశోక్ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. సినిమా ఎంతో సహజంగా ఉంటూనే కమర్షియల్ పంథాలో ఉంటుంది. కేఎస్ రవి కుమార్ మా సినిమాలో గొప్ప పాత్రను పోషించనున్నారు. నా సినీ జర్నీలో సపోర్ట్ చేస్తున్న నిహారికకు థాంక్స్’ అని అన్నారు.