మార్చి మొదటి వారంలో 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని'...
ABN , Publish Date - Feb 13 , 2026 | 03:43 PM
శివాజీ నటించి, నిర్మించిన 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' మూవీ మార్చి 6న విడుదల కాబోతోంది. ఈ సినిమాతో సుధీర్ శ్రీరామ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
శివాజీ హీరోగా నటించి నిర్మించిన 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' చిత్రం థియేట్రికల్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. మార్చి 6న మూవీని రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. గతంలో శివాజీ, లయ జంటగా పలు విజయవంతమైన చిత్రాలలో నటించారు. కాస్తంత గ్యాప్ తర్వాత శివాజీ, లయ ఇద్దరూ సినిమా రంగంలోకి తిరిగి ప్రవేశించారు. శివాజీ కీలక పాత్రలు పోషించిన పలు చిత్రాలు విజయవంతమయ్యాయి. కానీ లయ ప్రధాన పాత్ర పోషించిన 'తమ్ముడు' మూవీ మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో గ్రాండ్ విక్టరీ కోసం లయ ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో ఆమెకు శివాజీ సరసన 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' మూవీలో నటించే ఛాన్స్ దక్కింది. ఇది పైకి ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీగా కనిపిస్తున్నా, క్రైమ్ ఎలిమెంట్ కూడా తగినంత ఉందని తెలుస్తోంది.
ఈటీవీ విన్‌లో ఈ సినిమాను డైరెక్ట్‌గా స్ట్రీమింగ్ చేస్తామని తొలుత ప్రకటించినా, ఆ తర్వాత మనసు మార్చుకుని థియేట్రికల్ రిలీజ్‌కు శివాజీ సిద్థమయ్యారు. ఆ రకంగా ఇప్పుడీ సినిమా మార్చి 6న విడుదల కాబోతోంది. అలీ, ధనరాజ్, రఘుబాబు, 30 ఇయర్స్ పృధ్వీ, ప్రిన్స్, జబర్దస్ ఇమ్మాన్యుయేల్, రాజ్ తిరందాసు, కరణ్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాతో సుధీర్ శ్రీరామ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రంజిన్ రాజ్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ అవుతున్న మార్చి 6నే లావణ్య త్రిపాఠి 'సతీ లీలావతి', శ్రీనాథ్ మాగంటి 'మాన్షన్ హౌస్ మల్లేష్' కూడా విడుదల కానున్నాయి.