Samantha: ఒక దశలో నటనను వదిలేయాలనుకున్నా.. సమంత సంచలన వ్యాఖ్యలు..
ABN, Publish Date - Sep 11 , 2026 | 12:06 PM
టాలీవుడ్‌లో కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సమంత. నటనతో పాటు నిర్మాతగా కూడా బిజీ అయ్యారు.
టాలీవుడ్‌లో కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సమంత (Samantha). నటనతో పాటు నిర్మాతగా కూడా బిజీ అయ్యారు. మరో పక్క వ్యాపార రంగంపై కూడా దృష్ఠ్టి సారిస్తున్నారు. ఇప్పటికే పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టి బిజినెస్ వైపు అడుగులు వేస్తున్నారు. తాజాగా ఓ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కొంతకాలం అనారోగ్య సమస్యలతో సినిమాలకు విరామం తీసుకున్న సమయంలో తన భవిష్యత్తు గురించి చాలా ఆలోచించినట్లు సమంత చెప్పారు. ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచించడంతో.. నటనకు ప్రత్యామ్నాయంగా ఇతర వృత్తుల వైపు దృష్టి సారించానని తెలిపారు. ఈ క్రమంలో తనకు నమ్మకం ఉన్న పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడించారు. వ్యాపారవేత్తగా మారిన తర్వాత తన జీవితాన్ని మరో కోణంలో ఆస్వాదిస్తున్నానని సమంత పేర్కొన్నారు.
ఆమె మాట్లాడుతూ "నా సొంతంగా ఏదైనా నిర్మించుకోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. నేను అనారోగ్యంతో ఉన్న సమయంలో ‘సిటాడెల్’ షూటింగ్‌లో పాల్గొనడం చాలా కష్టంగా అనిపించింది. నా వల్ల సెట్‌లో ఉన్న మిగతా వాళ్ల సమయం వృథా కాకూడదని అనుకున్నాను. అందుకే ఆ సమయంలో షూటింగ్ చేయలేనని చెబుతూ చాలా ఈమెయిల్స్ పెట్టాను. కానీ, చిత్ర బృందం మాత్రం నేనే ఆ పాత్ర చేయాలని కోరుకుంది. వాళ్లు నాపై పెట్టుకున్న నమ్మకంతో చివరకు ఆ ప్రాజెక్ట్‌ను పూర్తి చేశాను. ‘మా ఇంటి బంగారం’ విషయంలో కూడా మొదట నేను నటిగా కాకుండా కేవలం నిర్మాతగా తెరవెనుక ఉండాలని అనుకున్నాను. అయితే రాజ్ నన్ను ప్రోత్సహించడంతో పాటు నటించమని పట్టుబట్టారు. దాంతో కెమెరా ముందుకు వచ్చాను. ఇక నాపై వచ్చే ట్రోలింగ్ విషయానికి వస్తే.. గతంతో పోలిస్తే ఇప్పుడు వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. కాలం నాకు చాలా విషయాలు నేర్పించింది. ఒకప్పుడు నేను సంతోషంగా ఉండటానికి కారణాలను డైరీలో రాసుకునేదాన్ని. అలాగే భవిష్యత్తులో చేయాలనుకున్న పనులను కూడా నోట్ చేసుకునేదాన్ని. మన జీవితంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దాని కోసం ముందుకు వెళ్తున్నప్పుడు ఇతరులు ఏమనుకుంటున్నారో ఎక్కువగా ఆలోచించకూడదు. నా గురించి నెగెటివ్‌గా మాట్లాడాలని ఎవరైనా ముందే నిర్ణయించుకున్నప్పుడు.. నేను ఏం చెప్పినా వారి అభిప్రాయాన్ని మార్చలేను. అలాంటప్పుడు వాళ్లను ఒప్పించడానికి నా సమయాన్ని ఎందుకు వృథా చేసుకోవాలి? నా జీవితంలో చేయాల్సిన ముఖ్యమైన పనులు ఇంకా చాలా ఉన్నాయి. గతంలో మానసికంగా బలహీనంగా ఉన్న రోజుల్లో ట్రోలింగ్ నన్ను చాలా బాధించేది. అయితే ఇప్పుడు అలాంటి విషయాల గురించి ఆలోచించడం చాలా వరకు తగ్గిపోయింది. నా శాంతి, నా ఆనందం, నా లక్ష్యాలపై దృష్టి పెట్టడం నేర్చుకున్నాను’’ అని సమంత తెలిపారు.