సమంత.. సరికొత్త చరిత్ర! ఇప్పటి వరకు లేరు.. ఇకపై కష్టమే
ABN, Publish Date - Jun 21 , 2026 | 02:57 PM
సమంత లీడ్ రోల్‌లో నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం జూన్ 19న విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో సందడి చేస్తోంది.
సౌత్ ఇండియా స్టార్ బ్యూటీ సమంత (Samantha) లీడ్ రోల్‌లో నటించిన తాజా యాక్షన్ డ్రామా చిత్రం ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram). జూన్ 19న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో సందడి చేస్తోంది. నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రేక్షకులు, అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. టాలీవుడ్‌తో పాటు ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ఈ చిత్రం మొదటి రోజే సాలిడ్ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన ఓపెనింగ్స్ సాధిస్తూ తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా 13.15 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను సృష్టించింది. ఒక వైపు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడుతుండగా, మరోవైపు ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర కూడా ఈ చిత్రానికి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ లభిస్తోంది. సమంత క్రేజ్, నందిని రెడ్డి మేకింగ్ స్టైల్ సినిమాకు ఈ స్థాయి భారీ వసూళ్లు రావడానికి ప్రధాన కారణాలని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో సమంతకు ఉన్న తిరుగులేని మార్కెట్‌ను ఈ సినిమా మరోసారి నిరూపించింది. యూఎస్ బాక్సాఫీస్ దగ్గర అత్యధికంగా 1 మిలియన్ డాలర్ మార్క్ అందుకున్న ఏకైక సౌత్ ఇండియన్ హీరోయిన్‌గా ఇప్పటికే సమంత పేరిట ఒక అరుదైన రికార్డు ఉంది. ఇప్పటివరకు ఆమె ఖాతాలో ఏకంగా 16 వన్ మిలియన్ డాలర్ సినిమాలు ఉండగా, ‘మా ఇంటి బంగారం’ కూడా ఈ ఆదివారం ముగిసే సమయానికి చాలా సులువుగా 1 మిలియన్ డాలర్ క్లబ్‌లోకి అడుగుపెట్టబోతోంది. ఈ క్రమంలో యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 17 చిత్రాలతో వన్ మిలియన్ డాలర్ మార్క్ అందుకున్న ఏకైక నటిగా సమంత తన పేరిట సరికొత్త చరిత్రను లిఖించబోతున్నారు. సమీప భవిష్యత్తులో మరే హీరోయిన్ కూడా అందుకోలేనంత ఎత్తులో ఈ సరికొత్త రికార్డు నిలవనుందని సినీ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.
సమంత తన సొంత నిర్మాణ సంస్థ ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్‌పై ప్రముఖ మేకర్స్ రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరులతో సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. దిగంధ్ మంచలే, గౌతమి, శ్రీముఖి తదితరులు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ అందించిన అద్భుతమైన నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కంటెంట్ పరంగా, టెక్నికల్ పరంగా సినిమా రిచ్‌గా ఉండటంతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మొత్తానికి ఓ వైపు నటిగా, మరోవైపు నిర్మాతగా సమంతకు ఈ సినిమా డబుల్ కిక్ ఇచ్చిందనే చెప్పాలి. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఉన్న ఊపు చూస్తుంటే, మొదటి రెండు రోజుల వసూళ్లను ఆదివారం కలెక్షన్స్ సునాయాసంగా దాటేసేలా కనిపిస్తున్నాయి. ‘మా ఇంటి బంగారం’కి రాబోయే వారం రోజులు కూడా బాక్సాఫీస్ వద్ద ఇదే హవా కొనసాగడం ఖాయమని ట్రేడ్ పండితులు బలంగా అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ చిత్రం మరిన్ని కలెక్షన్ల సునామీ సృష్టించి, సమంత కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.