Sai Pallavi: అటు సాఫ్ట్‌.. ఇటు హార్డ్‌! హైబ్రీడ్ పిల్లా.. సాయి ప‌ల్ల‌వి రూటే స‌ప‌రేటు

ABN , Publish Date - Oct 28 , 2026 | 11:00 AM

సాధారణంగా చిత్ర పరిశ్రమలో హీరోలతో పోలిస్తే హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ. ఒకప్పుడు కథానాయికలకు సమాన ప్రాధాన్యం ఉండే పాత్రలు దక్కినా, ఈ మధ్య కాలంలో చాలామంది హీరోయిన్లను కేవలం గ్లామర్ డాల్స్‌గానే స్క్రీన్‌పై చూపిస్తున్నారు.

Sai Pallavi

సాధారణంగా చిత్ర పరిశ్రమలో హీరోలతో పోలిస్తే హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ. ఒకప్పుడు కథానాయికలకు సమాన ప్రాధాన్యం ఉండే పాత్రలు దక్కినా, ఈ మధ్య కాలంలో చాలామంది హీరోయిన్లను కేవలం గ్లామర్ డాల్స్‌గానే స్క్రీన్‌పై చూపిస్తున్నారు. నాలుగు పాటలు, రెండు రొమాంటిక్ సీన్లు.. ఇదీ ప్రస్తుత కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ల పరిధి. కానీ ఈ ట్రెండ్‌కు పూర్తి విరుద్ధంగా, కథకు తగ్గ పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ సొంత ముద్ర వేసుకున్న నటీమణులు చాలా అరుదు. అలాంటి వారిలో అందరికంటే ముందు వరుసలో నిలిచే పేరు.. సాయి పల్లవి (Sai Pallavi).

భారీ మేకప్ అవసరం లేదు, ఎక్స్‌పోజింగ్ అసలే చేయదు.. అయినా స్క్రీన్ మీద కనిపిస్తే ప్రేక్షకుల కళ్ళు పక్కకు తిప్పుకోలేరు. కథలో విషయం ఉంటేనే, తన పాత్రకు వెయిట్ ఉంటేనే ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఈ సహజ నటి, చేసిన సినిమాలు తక్కువే అయినా ప్రతీ సినిమాతోనూ అభిమానుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. గత రెండు మూడేళ్లుగా సాయి పల్లవి సినిమాల వేగం కాస్త తగ్గించింది. క్వాలిటీ కోసం మాత్రమే చూస్తూ ఆచితూచి అడుగులు వేస్తూ వచ్చింది. అయితే ఈ ఏడాది మాత్రం ఒకేసారి భారీ అంచనాలున్న క్రేజీ ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకుల ముందుకు దూసుకొస్తోంది. ఇప్పటికే ఆమె నటించిన హిందీ డెబ్యూ మూవీ ఏక్ దిన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్కడ ఆమె నటన బాగుందనే ప్రశంసలు దక్కినా, కమర్షియల్‌గా సాయి పల్లవి స్థాయికి తగ్గ గుర్తింపును ఆ సినిమా తీసుకురాలేకపోయింది.

బాలీవుడ్ ఎంట్రీ ఆశించిన స్థాయిలో సౌండ్ చేయకపోయినా.. నెక్స్ట్ రాబోతున్న ప్రాజెక్ట్ మాత్రం ఇండియన్ సినిమా స్థాయిలోనే అతి పెద్ద సెన్సేషన్ కాబోతోంది. అదే నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం రామాయణ పార్ట్-1 (Ramayana). ఇందులో రణబీర్ కపూర్ సరసన సీతాదేవి (Sita)గా సాయి పల్లవి నటిస్తోంది. అయితే ఈ పాత్ర కోసం ఆమెను ఎంపిక చేసినప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరిగింది. కొందరు నెటిజన్లు తీవ్రమైన విమర్శలు చేశారు. సీత పాత్రకు ఆమె సరిపోతుందా అంటూ ట్రోల్స్ కూడా నడిచాయి. కానీ అసలైన టాలెంట్‌ను ఎవరూ ఎక్కువ కాలం ఆపలేరు. ఇటీవల విడుదలైన రామాయణ సాంగ్స్, ట్రైలర్స్ చూసిన తర్వాత ఆ విమర్శకులంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.

ఆ కళ్ళలోని పవిత్రత, ముఖంలో కనిపించే ప్రశాంతత, అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో సీతాదేవిగా సాయి పల్లవి జీవించేసింది. ట్రైలర్ చూసిన తర్వాత సీత పాత్రకు సాయి పల్లవి తప్ప ఇంకెవరూ న్యాయం చేయలేరు అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. ఈ విజువల్ వండర్ దీపావళి కానుకగా నవంబర్ 5న గ్రాండ్‌గా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఒకవైపు భక్తిభావం ఉట్టిపడే సీతాదేవి పాత్ర.. మరోవైపు ఖాకీ డ్రెస్సులో తుపాకీ పట్టిన పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్ర! అవును, తమిళంలో సాయి పల్లవి నటించిన లేటెస్ట్ మూవీ ఓమ్ (Om Movie). ఇందులో ఆమె నెల్లూరు నాయిడు పేట నుంచి వ‌చ్చిన నిత్యా రెడ్డి అనే క్యారెక్టర్‌లో కనిపించనుంది.

ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ సోషల్ మీడియాను షేక్ చేసింది. కేవలం ఎమోషన్స్, పెర్ఫార్మెన్స్ మాత్రమే కాదు.. ఊహించని రేంజ్‌లో యాక్షన్ సీక్వెన్స్‌లలో కూడా సాయి పల్లవి దుమ్మురేపింది. క్రిమినల్స్‌ను వేటాడే పోలీసాఫీసర్‌గా ఆమె చూపించిన ఇంటెన్సిటీ అందరినీ ఆశ్చర్యపరిచింది. నటిగా తనలో ఎన్ని షేడ్స్ ఉన్నాయో మరోసారి ఈ సినిమాతో ప్రూవ్ చేయబోతోంది. ధనుష్‌, మమ్ముట్టి లీడ్‌ రోల్స్‌ చేస్తున్న ఈ సినిమాకు అమరన్‌ ఫేమ్‌ రాజ్‌కుమార్‌ పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్నారు.

ఎర్రచందనం కథాంశంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కూడా నవంబర్‌ 20న పాన్‌ ఇండియా వైడ్‌గా రిలీజ్‌ కాబోతుంది. అటు భారీ పాన్-ఇండియా చిత్రం రామాయణ, ఇటు డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ ఓమ్ విడుదలవుతుండటం సాయి పల్లవి కెరీర్‌కు ఖచ్చితంగా పెద్ద ప్లస్ పాయింట్. ఏది ఏమైనా, గ్లామర్ పాత్రల జోలికి వెళ్లకుండా కేవలం తన అభినయంతోనే స్టార్ డమ్ సంపాదించుకున్న సాయి పల్లవికి రామాయణ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది..? నార్త్ ఆడియెన్స్‌ను ఎంతవరకు కట్టిపడేసి బాలీవుడ్‌లో తిరుగులేని స్థానాన్ని సంపాదిస్తుంది అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Updated Date - Oct 28 , 2026 | 11:00 AM