సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

జానకమ్మ జీవితంలో విషాదాలు..

ABN, Publish Date - Jul 11 , 2026 | 10:19 PM

గాయని ఎస్. జానకి (S.Janaki) ది ప్రేమ వివాహం. తన కెరీర్ ను తీర్చిదిద్దిన దగ్గరి బంధువు ఫన్ డాక్టర్ చంద్రశేఖరం కుమారుడు రాంప్రసాద్‌ను ఆమె ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. అయితే ఇది వన్ సైడ్ లవ్ కాదు. టూ సైడ్ లవ్.

S. Janaki

గాయని ఎస్. జానకి (S.Janaki) ది ప్రేమ వివాహం. తన కెరీర్ ను తీర్చిదిద్దిన దగ్గరి బంధువు ఫన్ డాక్టర్ చంద్రశేఖరం కుమారుడు రాంప్రసాద్‌ను ఆమె ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. అయితే ఇది వన్ సైడ్ లవ్ కాదు. టూ సైడ్ లవ్. తన పెళ్ళి గురించి జానకి చెబుతూ, 'నేను గాయనిగా ఎదిగి, ఇంతటి పేరు ప్రతిష్ఠలు తెచ్చుకోవడం వెనుక మావారి సహకారం ఎంతో ఉంది. నేను ఏం చేసినా, ఎంత సాధించినా భర్త చాటు భార్యనే. మాది ప్రేమవివాహం. వైద్యుల రాంప్రసాద్‌ గారు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నేను కూడా ప్రేమించాను. అయితే మొదట్లో అది ప్రేమ అని తెలీదు. మా ప్రేమకథ ఎలా సాగిందంటే... చంద్రశేఖరంగారి కుటుంబంతో నాకు అనుబంధం పెరిగిపోవడంతో, నాకు రాంప్రసాద్ అంటే సహజంగానే యిష్టం ఏర్పడింది. ఎవరికీ తెలీకుండా అతని ఫోటో ఒకటి సంపాదించి నా దగ్గర ఉంచుకున్నాను. పైకి మాత్రం ఇవేమీ పట్టనట్టే ఉండేదాన్ని. వారికేమైనా పెళ్లి సంబంధాలు చూస్తుంటే నేను కూడా వెళ్లేదాన్ని. ఓరోజు అనుకోకుండా నేను దాచుకున్న ఫోటో ఇంట్లో వాళ్ల కంటపడింది. దాంతో నేను ఆయన్ను ప్రేమిస్తున్న విషయం తెలిసిపోయి౦ది. ఇంకేముంది వెంటనే మా పెళ్లయిపోయింది.


ఒకేరోజు నాలుగు స్టూడియోలకు వెళ్లడం, వేరు వేరు భాషల్లో నాలుగైదు పాటలు పాడడం, ఏవైనా నచ్చకపోతే నేను పాడనని చెప్పడం... రెమ్యునరేషన్ విషయాలు, రాయల్టీ గొడవలు, యివన్నీ నాకు కొంచెం కష్టంగా ఉండేవి. అయితే మావారు నా వెన్నంటి ఉండి అన్నీ చూసుకునేవారు. నాకేమాత్రం శ్రమ కలిగించేవారు కాదు. కష్టాలు, ఒత్తిడులు అన్నీ ఆయనే భరిస్తూ నన్ను పీస్ ఆఫ్ మైండ్ ఉండేటట్లు చూసుకునేవారు. నేనూ అంతే. ఆయన్ని ఒక నిమిషం కూడా వదలి ఉండేదాన్ని కాదు. సిగరెట్టు కాల్చుకుని ఇప్పుడే వస్తానని వెళ్తున్నవారిని 'వద్దులెండి' అనేదాన్ని. కొన్నిసార్లు అలా కాదని వెళ్లినా, సగం దూరంలోనే వెనక్కి వచ్చేసేవారు. అంతలా సహకారం ఉంది కనుకనే నేను యిన్నేళ్లు ఈ ఫీల్డులో కెరీర్ కాపాడుకోగలిగాను. ఆయనకు తగ్గటే మా అత్తగారు (శకుంతలాబాయి) కూడా నన్ను బాగా చూసుకునేవారు. మా పిల్లాడి బాగోగులన్నీ, నా రికార్డింగులకు ఏ ఇబ్బంది రాకుండా ఆమె చూసుకునేది. నాకు ఒక్కడే కొడుకు. వి. మురళీకృష్ణ, వివాహితుడు. మా కోడలు ఉమ. మంచి డాన్సర్. కూచిపూడి, భరతనాట్యం రెండింట్లోనూ నిష్ణాతురాలే. ఆమెకు కూడా 'కలైమామణి' అవార్డు వచ్చింది. ఇంకా దూరదర్శన్ 'ఏ' గ్రేడ్ ఆర్టిస్టు కూడా.


మా మురళీకృష్ణ కూడా నటుడే. కొన్ని సినిమాల్లో నటించాడు. "శ్రుతిలయలు” లో సత్యనారాయణగారి కొడుకుల్లో ఒకడుగా నటించాడు. నాకిద్దరు మనవరాళ్లు. అమృతవర్షిణి, అప్సర. నేనైతే నా భర్త చేతుల్లోనే వెళ్లిపోవాలని భగవంతుణ్ణి కోరుకునేదాన్ని. కానీ ఆయనే వదలి వెళ్లిపోయారు. మా వారికి మొదటిసారి గుండెపోటు వచ్చినపుడు, ఆయనను ఆస్పత్రిలో చేర్పించి ఉన్నాం. కానీ నాకు రికార్డింగులున్నాయి. 'కార్తీకదీపం' సినిమా పాటల రికార్డింగ్ జరుగుతోంది. అందులో 'నీ చేతులలో తలవాల్చి...' అనే పాట వుంది. ఆ పాటను ఆయననే తలుచుకుంటూ, అదే ఫీలింగ్ తో పాడాను. కానీ విధి వైపరీత్యం, నాకంటే ముందు ఆయనే పోవాల్సి వచ్చింది' అని అన్నారు. కొద్దిరోజుల క్రితమే జానకమ్మ తన కుమారుడు మురళీకృష్ణనూ కోల్పోవడం మరో విషాదం.

Updated Date - Jul 11 , 2026 | 10:28 PM