మరో లక్కీ ఛాన్స్ పట్టేసిన రుక్మిణీ వసంత్..
ABN, Publish Date - Oct 13 , 2026 | 03:20 PM
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని (Nani) తన లైనప్‌లో వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్న విషయం తెల్సిందే. ది ప్యారడైజ్ సినిమాతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన నాని ఈసారి మాస్, క్లాస్ రెండు సినిమాలను ఒకేసారి మొదలుపెట్టాడు.
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని (Nani) తన లైనప్‌లో వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్న విషయం తెల్సిందే. ది ప్యారడైజ్ సినిమాతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన నాని ఈసారి మాస్, క్లాస్ రెండు సినిమాలను ఒకేసారి మొదలుపెట్టాడు. ఇప్పటికే సుజీత్ దర్శకత్వంలో బ్లడీ రోమియోని పట్టాలెక్కించిన నాని అది ఇంకా సెట్స్ మీదకు వెళ్లకుండానే మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కోలీవుడ్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన 96, ఇటీవలే సత్యం - సుందరం చిత్రాలతో సెన్సేషనల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ప్రేమ్ కుమార్ (Prem Kumar) దర్శకత్వంలో నాని ఒక సినిమా చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.
ఈ సినిమా పూర్తిగా ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కనుందని తెలుస్తోంది. ప్రేమకథలను అత్యంత సహజంగా, హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించడంలో ప్రేమ్ కుమార్‌కు ప్రత్యేక శైలి ఉంది. 96 లాంటి కల్ట్ క్లాసిక్ తర్వాత ఆయన నుంచి వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవలం రొమాన్స్ మాత్రమే కాకుండా, చక్కటి భావోద్వేగాలు ఈ చిత్రానికి ప్రధాన బలంగా ఉండబోతున్నట్లు సమాచారం. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కథానాయిక పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా, స్ట్రాంగ్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం మేకర్స్ మొదట పలువురు ప్రముఖ హీరోయిన్ల పేర్లను పరిశీలించినప్పటికీ, చివరికి టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ రుక్మిణి వసంత్ పేరును ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. పాత్ర ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఆమెను ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఫైనల్ చేసినట్లు సమాచారం.
రుక్మిణి వసంత్ తన అద్భుతమైన నటనతో ఇప్పటికే సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం డ్రాగన్ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటిస్తోన్న ఈ భామకు నాని సినిమా మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఈ సినిమా నాని కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. మరి 96 లాంటి మరో ప్రేమకతను ప్రేమ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తాడేమో చూడాలి.